నిరాడంబర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం
నర్రా రాఘవరెడ్డి- ఆదర్శం: నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయితీ, సేవాతత్పరత మూర్తీభవించిన వామపక్ష యోధుడు. ప్రజా కళాకారుడిగా ఆరు సార్లు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి అహరహం శ్రమించిన అవిశ్రాంత నేత నర్రా రాఘవరెడ్డి. దీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన నిష్కలంక నేతగా పేరుగాంచారు. నేటి తరం నేతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సీపీఎం సీనీయర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయి తీ, సేవాతత్ప రత నిండిన నేతగా ప్రజాభిమా నం పొందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండ లం వట్టిమర్తిలో 1924లో నర్రా రాంరెడ్డి, కన కమ్మ దంపతులకు జన్మించిన ఆయన చిన్నతనం లోనే తల్లి మరణించడంతో మారుతల్లి పెట్టే కష్టాలు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు.
కార్మికునిగా, కళాకారుడిగా..
కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో వర్కర్ గా పనిచేశాక ముంబై వెళ్లి రూ.13 వేతనానికి గైక్వాడ్ జౌళి మిల్లులో చేరారు. జీఎం ఖాన్ సహకారంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారునిగా స్థానిక సమస్యలను పల్లె సుద్దులతో మిళితం చేసి జనరంజకంగా వివరించేవారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా..
1949లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన ఆయన పార్టీలో వివిధ హోదాలలో పనిచేశారు. 1959 నుంచి ఏడేళ్ల పాటు వట్టిమర్తి గ్రామ సర్పంచ్‌గా , నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1967లో మొదటిసారి నకిరేకల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో మోటార్ సైకిల్‌పై నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేస్తూ రూ. 300 ఖర్చుచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో ఓడిపోయినా 1978,1984, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. ఏడేళ్ల పాటు శాసనసభ లో సీపీఎం పక్ష నాయకునిగా పనిచేశారు. ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాన్ని కూడా తీసుకోలేదు. తన హయాం లో 50కిపైగా గ్రామాలకు రహదారుల నిర్మాణం, విద్యుత్, మంచి నీటి సౌకర్యాలను కల్పించారు. శ్రీశైలం ఎడమ కాలువ, మూసీ కాల్వపై లిఫ్టులను సాధించారు.
- 90 ఏళ్ల జీవితంలో 37 ఏళ్లు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు.
- 1978 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
స్ఫూర్తిదాయకులు: పుచ్చలపల్లి సుందరయ్య, జీఎం ఖాన్
అభిమానించే సహచరులు: బీఎన్ రెడ్డి, సుద్దాల హనుమంతు, కొండవీటి గురునాధ్‌రెడ్డి, రాచమల్ల రామచంద్రం
- ఇష్టమైనవి: ప్రజాకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాడిగేదెల పెంపకం