మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమ దేవి
సాక్షి, నల్లగొండ : మా కుటుంబం పోరాటాలకు పుట్టినిల్లు, మాతాతల నుంచే స్వాతంత్య్ర పోరాటంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మాది ఆనాటినుంచే రాజకీయ కుటుంబం ఆ విధంగానే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. 20ఏళ్లకే నల్లగొండలో కౌన్సిలర్‌గా గెలిచాను. ఆ సందర్భంలో 1981లో ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించి నల్లగొండకు వచ్చిన సందర్భంలో పార్టీలోకి ఆహ్వానించడంతో చేరాను. 1983లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుడు నావయస్సు 23 సంవత్సరాలు. ప్రత్యర్థి పార్టీలు వయసు తక్కువగా ఉంది అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పుడు నామినేషన్ తొలగించే అవకాశం లేనందున పోటీలో కొనసాగా.. 2వేల ఓట్లతో ఓడిపోయాను. తిరిగి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోయారు. ఎన్టీఆర్‌ను నల్లగొండ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించాను. దాంతో ఆయన మూడు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు.
ఆ సందర్భంలో నల్లగొండ అసెంబ్లీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి నాకు అవకాశం కల్పించడంతో విజయం సాధించాను. అప్పట్లో ఎన్టీ రామారావుకు మహిళలంటే ఎంతో గౌరవం, నా అక్కలు నా చెళ్లెళ్లు అంటూ ఎంతో గౌరవించేవారు. ఆ శాసన సభలో 12మంది మహిళా శాసన సభ్యులం ఉన్నాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశాను. ఇప్పటికీ నల్లగొండ పాత నియోజకవర్గంలో నేను కట్టించిన ఇండ్లే అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అప్పట్లో గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. స్కూల్ బిల్డింగ్‌లు, రోడ్లు, ఎస్‌ఎల్‌బీసీ ఫౌండేషన్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే జరిగాయి. నేను ఏది అడిగినా కూడా ఎన్టీఆర్ కాదనేవారు కాదు. ఆనాడు ఎన్నికల ప్రచారం, వాల్ రైటింగ్, బ్యానర్లు, మైకులతో చేసేవారు.
ప్రజలంతా మనస్ఫూర్తిగా పనిచేసేవారు. ఈనాడు ప్రచార సరళి అంతా మారిపోయింది. అంతా సోషల్ మీడియా...డీజేలు, పోస్టర్లు, డిజిటల్ పోస్టర్లు వంటివాటితో ప్రచారాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు గౌరవం లేదు. తెలుగుదేశం ఎన్టీఆర్ కాలంలో...ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాలంలో మహిళలకు మంచి గుర్తింపు లభించింది. ఐదేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో మంత్రి వర్గంలో మహిళల స్థానమే దక్కలేదు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ బంగారు తెలంగాణ అని కుటుంబ పాలన చేశాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తిరిగి మహిళలకు సరైన గౌరవం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment