ఏటికి ఎదురీదిన విప్లవ స్వాప్నికుడు
ఆలూరి భుజంగరావుగారు ఈ లోకాన్ని విడిచి వెళ్లి సంవత్సరమైంది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లినా, మా స్మృతిపథంలో నిలిచేవుంటారు. ఆయన జీవితం, ఆచరణ మాలాంటి వారికి మార్గదర్శకాలే.
భుజంగరావుగారి జీవితం చిన్నతనం నుంచీ దుర్భర దారిద్య్రంతో, నిరంతర పోరాటంగానే సాగింది. ఆ వయసు నుంచే హోటల్ కార్మికునిగా పనిచేశారు. ‘శారద’ అనే నటరాజన్‌తో కలసి సాహి త్య సాధన చేశారు. తోటి కార్మికులతో కలసి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సంబంధాలలోకి వెళ్లారాయన. పార్టీ నుంచి అందుకున్న రాజకీయ చైతన్యం, శారద వంటి స్నేహితుల సాంగత్యం భుజంగరావుగారు తన రచనా వ్యాసంగాన్ని మెరుగుపరుచుకునేందుకు దోహదం చేశాయి. అయితే తనను ‘రచయితగా తీర్చి దిద్దింది దేశంలోని కోటానుకోట్ల దరిద్రజీవులే’నని సగర్వంగా ఆయన చెప్పేవారు. సమస్త జ్ఞానవిజ్ఞానాలూ, సుఖసంపద లూ అన్నీ శ్రమజీవుల చెమట చుక్కల నుంచి వచ్చాయని నమ్మారు.
కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించిన తరువాత, ‘మీ బతుకులు మీరే బతకండి’ అని తన సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలకు చెప్పడంతో చాలామంది ఎలాగ బతకడం అని ప్రశ్నించుకున్నారు. చాలామంది అందిన రంగాలలో కుదురుకున్నారు. క్రమక్రమంగా కమ్యూనిస్టు చైతన్యానికి దూరమయ్యారు. పార్టీ పార్లమెం టరీ రాజకీయాల ఊబిలో కూరుకుపోయింది. ఇందుకు భి న్నంగా భుజంగరావుగారు హిందీ పరీక్షలు రాశారు. ఆ భాష మీద పట్టు సాధించారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినా కష్టాలు తప్పలేదు. మార్క్సిస్టు దృక్పథం నుంచి భూత భవి ష్యత్ వర్తమానాల చరిత్రను అవగాహనకు తేగల రాహుల్ సాంకృత్యాయన్ రచనలను విరివిగా అ నువదించారు. ఇల్లు చిన్నది. కుటుంబం పెద్దది. ఆ స్థితిలో రా హుల్జీ, యశ్‌పాల్, ప్రేమ్‌చంద్ రచనలను అనువదించ డం ఎంత కష్టమో ఊహించవచ్చు.
ఇక్కడ నా గొడవ కొంచెం. చిన్నతనంలో నాకు రాహుల్జీ ‘ఓల్గా సే గంగ’ తెలుగు అనువాదం (అల్లూరి సత్యనారాయణరాజు) దొరికింది. తరువాత నేను పుట్టిన బ్రాహ్మణ ‘తత్వ’ భావజాలం మీద వ్యతిరేకత మొదలైంది. కమ్యూనిస్టుల మీద సానుభూతి కలిగింది. అప్పుడే ‘పుట్టిల్లు’ సినిమా పరాజయంతో రాజమండ్రి వచ్చిన డాక్టర్ రాజారావు గారి దగ్గర నాటకాల కోసం చేరాను. సినిమా తీయాలని మళ్లీ మద్రాసుకు వెళ్లినప్పుడు ఆయన వెనకే నా సహచరితో మద్రాసు చేరాను. అక్కడ ఆయన కల్పించిన నాటక వాతావరణం, కన్నెమెరా లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రాహుల్జీ అనువాద నవలలు, నా ఆలోచనా విధానంలో మార్పును త్వరితం చేశాయి. ఈ మార్గాన్వేషణలో నాకు దోహదం చేసిన విజ్ఞుల్లో భుజంగరావు గారిని పరోక్ష మార్గదర్శకులుగా భావిస్తున్నాను నేను.
భుజంగరావు గారు ‘అరణ్యకాండ’ లాంటి కథలను రాశారు. అది చదివితే వారి కథన నైపుణ్యం తెలుస్తుంది. ‘గమనాగమనం’ పేర జీవిత కథని రచించారు. ఆయన అనువాద సాహిత్యంలో ‘సింహావలోకనం’కి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశాన్ని భవిష్యత్తు వైపు నడిపిస్తున్న ఒకే ఒక్క వేగుచుక్కలా ‘భగత్సింగ్’ని మన స్మృతి పథంలో అది నిలుపుతుంది. ‘దర్శన్ దిగ్దర్శన్’ ప్రపంచ తాత్విక జ్ఞానాన్ని పరిచ యం చేసింది. ఆచరణపరంగా కూడా భజంగరావుగారు నాకు మార్గదర్శకులుగా నిలిచారని నేను ‘విరసం’కి దగ్గరయ్యే వరకూ తెలియలేదు. భుజంగరావు గారు ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాల కాలం నుంచి నక్సల్బరీ మీదుగా ‘విరసం’ సభ్యులు గా, విప్లవాభిమానిగా ముందుకు నడిచారు.
స్వచ్ఛందంగా ముందుకు రాదల్చుకున్న పిల్లల్ని, సహచరిని విప్లవోద్యమంలోకీ, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలోకీ వచ్చేందుకు ప్రోత్సహించారు. ఆలూరి లలితా పరమేశ్వరిగారు కూడా నీడలా ఆయన్ని అనుసరించడంతో ఆగిపోకుండా, వారు కీర్తిశేషులయ్యాక ఆయన సభ్యత్వాన్ని ‘విరసం’లో కొనసాగిస్తూ నేను ఉన్నంత వరకూ మేం ఇద్దరం వస్తున్నట్లే భావించమని కోరారు. ఇది సభ్యులకు, సభ్యులు కాని సహచరులకు స్ఫూ ర్తినిచ్చే సంప్రదాయం. భుజంగరావు గారు భౌతికంగా మన మధ్య లేకున్నా విప్లవకారుల, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమ సహచరుల, విప్లవసానుభూతిపరుల స్మృతి పథంలో సదా నిలిచేవుంటారు. జీవితాంతం ఏటికెదురీదిన విప్లవ స్వాప్నికుడు భుజంగరావు. ఆ అమరునికి రెడ్ శాల్యూట్స్.
- కాకరాల
(వ్యాసకర్త రంగస్థల, సినీ నటుడు, వామపక్ష ఉద్యమశీలి)