
ప్రజాసమస్యలపై ఉద్యమించకుండా కుటిలయత్నం
ఒక వైపు కమలంతో చెలిమి.. మరోవైపు కామ్రేడ్స్‌తో బంధం
కమ్యూనిస్టులకు కబురు పంపి మరీ రప్పించుకున్న వైనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయా పార్టీలను తన రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు అన్న విషయం కూడా జగది్వదితమే. తాజాగా ఆయన ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్స్’ అంటూ కమ్యూనిస్టులతో లోపాయికారీ వ్యవహారాలు నడుపుతుండటం ఆయన నైజాన్ని చెప్పకనే చెబుతోంది.
చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత గత నెల 26న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు ఆ పార్టీ కీలక నేతలు ఎంఏ గఫర్, సీహెచ్ బాబూరావు, వై.వెంకటేశ్వరరావు ఆయన్ను కలసి అభినందించారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లినట్టు వివరించారు. ఆ తర్వాత గత నెల 31న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర కీలక నేతల బృందం బాబును కలిసి అభినందించి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించినట్టు ప్రకటించారు.
కలయికలో మర్మం అదేనా?..
ఉభయ కమ్యూనిస్టు నేతలు పోటీ పడి మరీ సీఎంను కలిసి ప్రజా సమస్యలు వివరించడంలో తప్పులేదని.. అయితే దీని వెనుక పెద్ద మంత్రాంగం నడిచిందని వామపక్ష శ్రేణులే చెబుతున్నాయి. బాబు పథకం ప్రకారమే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ద్వారా కమ్యూనిస్టు నేతలను తన వద్దకు పిలిపించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి వామపక్షాలకు టచ్‌లో ఉన్న జనార్దన్ వారిని టీడీపీకి అనుకూలంగా మలుచుకునేలా పనిచేశారని కమ్యూనిస్టు శ్రేణులే చెబుతున్నాయి.
ఎన్నికల ముందు పాలకపక్షానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు ప్రజాసంఘాలు ఉద్యమించడంతో టీడీపీకి మేలు జరిగేలా జనార్దన్ ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక వారిని బాబు వద్దకు తీసుకెళ్లడంలో కూడా జనార్దన్ కీలకంగా వ్యవహరించారన్నారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు ఉద్యమించకుండా ఉండేందుకే ఈ తతంగం నడిచిందని, అందుకే తమ పార్టీ నేతలపై బాబు కపట ప్రేమ కనబరచారని కమ్యూనిస్టు నేతలు చెబుతున్నారు.
పథకంలో భాగమే లోకేశ్ స్పందన..
తండ్రికి తగ్గట్టుగానే తనయుడు లోకేశ్ సైతం కామ్రేడ్స్‌పై ఎన్నడూ లేని ప్రేమను ఒలకబోయడం వెనుక చంద్రబాబు పథకం ఉందని చెబుతున్నారు. ఈ నెల 1న శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా స్పందిస్తూ.. తాము ఎటువంటి నిరసనకు పిలుపు ఇవ్వకపోయినా తమ నేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై నారా లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ “మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్’ అంటూ పోస్టు చేశారు. కమ్యూనిస్టుల గృహనిర్భందం నెపాన్ని పోలీసులపై నెట్టేశారు. ఈ వ్యవహారాలన్నీ చూశాక.. పాలకపక్షాన్ని ప్రశ్నించే కమ్యూనిస్టుల్లో మార్పు వచి్చందా? పథకం ప్రకారం పాలకపక్షమే వారిని ప్రజల్లో పలచన చేస్తోందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.