సన్నివేశాలను చిత్రీకరిస్తున్న దర్శకుడు రాజ్
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: ఓ సామాన్య చేనేత కార్మికుడి విజయగాథను వెండితెరపై ఆవిష్కరించడంతో చేనేత కళాకారుడి కష్టాలు, కళానైపుణ్యాలు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ఆసుయంత్ర సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత విజయగాథను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఆర్. రాజ్ మల్లేశం సినిమా రూపొందించగా, ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ఆదరణ పొందింది. సినిమా ఆసాంతం పోచంపల్లి మండలంలో నిర్మించడం విశేషం. చిత్ర యూనిట్ మూడు నెలల పాటు ఇక్కడే ఉండి రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, జలాల్‌పురం గ్రామాల్లో నిరంతరాయంగా సినిమా షూటింగ్ చేశారు. చేనేత కార్మికుడి ఇతిబాధలు వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు చేనేత కార్మికుల జీవనస్థితిగతులపై ఆధ్యయనం చేసి ఈ సినిమాను కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఆత్మహత్యలు వద్దనే సందేశంతో...
ప్రస్తుతం చేనేతలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కార్మికుడి శ్రమభారం తగ్గించి వస్త్ర ఉత్పత్తి పెంచిన ఆసుయంత్రం రూపకల్పనకు దారితీసిన పరిస్థితులు, కష్టాలను ఎదురీది సాధించిన విజయం, అప్పులబాధ వెంటాడిన ధైర్యంతో సమస్యలను అధిగమించాలని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం చూపవని దర్శకుడు చేనేత కార్మికులకు సందేశాన్ని అందించారు.
మెరిసిన స్థానికులు..
మల్లేశం సినిమాలో నటించేందుకు ఆసక్తి కల్గిన స్థానికులకు దర్శకుడు అవకాశం కల్పించాడు. పోచంపల్లికి చెందిన తడక రజని హీరో ప్రియదర్శ్‌కు అక్క పాత్రలో నటించింది. అలాగే తడక అతిథి లక్ష్మి, ఈపూరి వరుణ్‌సాయి హీరోకు మేనల్లుడి పాత్రలో నటించి మెప్పించారు. పోచంపల్లిలో పద్మశాలి, చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల సన్మానసభను ఏర్పాటుచేసి మల్లేశం చిత్ర యూనిట్‌కు సన్మానించారు.
వెండితెరపై చేనేతలు..
ముప్‌పై ఏళ్ల క్రితమే శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో చేనేత నేపథ్యంలో ‘సుష్మాన్’ సినిమాను నిర్మించారు. మమ్ముట్టి హీరోగా మళయాల సినిమా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’, నీలకంఠ దర్శకత్వంలో ‘మాయ’, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రాలు చేనేత కార్మికులను తెరకెక్కించారు. ప్రభుత్వం కూడా ప్రముఖ సినీనటి సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్‌ను ఇక్కత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
గతేడాది జాతీయ చేనేత దినోత్సవం రోజున పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించారు. పోచంపల్లికి చెందిన ప్రముఖ యాంకర్ అనసూయ పలువేదికలో ఇక్కత్ వస్త్రాలను ధరిస్తూ పోచంపల్లికి ఇక్కత్‌ను తనవంతుగా ప్రమోట్ చేస్తుంది.
ఎందరికో స్ఫూర్తినిచ్చింది
మల్లేశం సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు సామాన్య చేనేత కార్మికుడి సినిమా రాలేదు. మొదటిసారిగా తన విజయగాథను తెరకెక్కించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆసుయంత్రం తయారు చేయడానికి పడిన కష్టాలు, చివరగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పే సందేశం నచ్చింది. ఈ సినిమా ద్వారా చేనేత కార్మికుడికి గుర్తింపు వచ్చింది. చేనేత దినోత్సవం నిర్వహిస్తూ ప్రధాని మోదీ చేనేత కళాకారులకు గుర్తింపు తీసుకువచ్చారు.
– చింతకింది మల్లేశం
Comments
Please login to add a commentAdd a comment