bhoodan pochampally
-
గణేష్ నిమజ్జనంలో విషాదం.. చెరువులో పడి యువకుడి మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు గణేషుడిని చెరువులో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందాడు. ప్రవీణ్ మృతదేహం వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చదవండి: ఉత్సాహంగా వినాయక నిమజ్జనం -
ధాన్యం తూర్పారపట్టే యంత్రంలో చీరకొంగు చిక్కుకొని..
సాక్షి, నల్గొండ: ధాన్యం తూర్పారపట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు చీర కొంగు చిక్కుకోవడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది.. ఈ విషాదం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన మరాటి ఆండాలు (55) స్థానిక పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు రమావత్ జగన్‌కు చెందిన ధాన్యాన్ని తూర్పారట్టేందుకు కూలికి వెళ్లింది. కాగా తూర్పారపట్టే యంత్రంలో ధాన్యం పోస్తుండగా ప్రమాదవశాత్తు వేగంగా తిరుగుతున్న రాడ్‌కు ఆండాలు చీర కొంగు చుట్టుకొని కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆండాలు కుడికాలు విరగడంతో పాటు రొమ్ము భాగంలో బలమైన గాయాలయ్యాయి. గమనించిన రైతు జగన్.. అండాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి రైతుల సహాయంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కారులో తరలించారు. కాగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆండాలు అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. చదవండి: భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం? -
65 ఏళ్ల వృద్ధుడు.. యువతికి మాయమాటలు చెప్పి.. లోబర్చుకుని..
సాక్షి, నల్గొండ: 65 ఏళ్ల వృద్ధుడు, మానసికస్థితి సరిగాలేని ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పి శారీరంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్‌లో చోటు చేసుకొంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానసికస్థితి సరిగా లేని యువతి(25)కి తల్లిదండ్రులు మరణించారు. వివాహితులైన ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న యువతికి అదే గ్రామానికి చెందిన ఉప్పునూతుల మల్లయ్య(65) మాయమాటలు చెప్పి శారీరంగా లోబర్చుకొన్నాడు. 15 రోజుల క్రితం యువతి రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఉంటున్న అక్క వద్దకు వెళ్లింది. యువతి శరీర ఆకృతి అనుమానస్పదంగా ఉండటంతో అక్కాబావ ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఆ యువతి 7నెలల గర్భవతి అని తేలింది. దాంతో ఆ యువతిని ప్రశ్నించగా మల్లయ్య తనను లోబర్చుకొని మోసం చేశాడని తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో సోమవారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో బాధితురాలికి పరిహారం ఇప్పించి రాజీకి యత్నించారు. కానీ, ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరలేదని సమాచారం. దాంతో సాయంత్రం బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. చదవండి: భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో.. వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ వెంకటయ్య, ఎస్ఐ సైదిరెడ్డి గ్రామాన్ని సందర్శించి వాస్తవ విషయాలపై స్థానికులతో ఆరా తీసి విచారణ జరిపారు. ఉప్పునూతుల మల్లయ్యను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే తనకు ఎలాంటి పాపం తెలియదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లయ్య పేర్కొంటున్నాడు. చదవండి: గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి.. -
వలకు చిక్కిన భారీ చేపలు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చెరువులో మత్స్యకారుల వలలో భారీ చేపలు చిక్కాయి. మినీ ట్యాంకుబండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నాలుగైదు రోజులుగా చెరువు నుంచి దిగువకు తూముల ద్వారా నీటిని ఖాళీ చేస్తున్నారు. కొన్నేళ్లుగా చెరువులో చేపలు పెంచుతున్న మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతున్నారు. సోమవారం వలలో 30 నుంచి 25 కిలోల చేపలు 30 వరకు వలకు చిక్కాయి. ఇంత పెద్ద చేపలను గతంలో ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం) -
‘గాజుల పూసల పల్లి’... గాజుల పోచంపల్లి.. ఇప్పుడేమో!
Pochampally: Best Tourism Village India Silk City Interesting Facts Old Name Etc: ఊరంటే.. చెట్టు, చేమ.. పుట్ట, గుట్ట.. మళ్లు, మడుగులు..చెరువులు, చెలకలు.. పాడి, పశువులు.. బడి, గుడి.. వాటితో పెనవేసుకున్న మనుషులు! విషయం ఇంతే అయితే ఆ ఊరు ఉనికి పొలిమేరతోనే ఆగిపోతుంది! ఆ పల్లె ఓ ఆదర్శాన్ని ఆచరణలో పెడితే.. అరుదైన కళను పడుగు – పేకల్లో పేర్చుతుంటే ఆ ప్రత్యేకతే అస్తిత్వమై అవధులు దాటుతుంది.. ప్రపంచ పటంలో రంగులీనుతుంది!! ఆ ఆదర్శం.. భూదానం.. ఆ కళ.. ఇక్కత్.. కలిస్తే భూదాన్ పోచంపల్లి.. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా!! ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్చే ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా గౌరవం దక్కించుకుంది!! ఇక్కడ పోచంపల్లి ప్రస్తావనకు ప్రాసంగిత అదే!! హైదరాబాద్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోచంపల్లి. వస్త్రనేతకు ఆలవాలం కాకముందు గాజులు, పూసల తయారీకి ప్రసిద్ధీ పల్లే. అందుకే ‘గాజుల పూసల పల్లి’గా పేరు. రానూరానూ పలకడంలో గాజుల పోచంపల్లి అయింది. పేరునిచ్చిన భూదానం ఇది 1951 నాటి ముచ్చట. గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయం. సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్ ఆహ్వానం మేరకు ఆ ఏడు ఏప్రిల్15న హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. అప్పుడే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి కాలినడకన బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం దళితవాడంతా తిరిగి ఆ రాత్రి పీర్లకొట్టం (ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు (ఏప్రిల్ 18న) చెరువు సమీపంలోనున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే వినోబాభావే స్పందిస్తూ ‘మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా?’ అని అడిగారు. ఆ తక్షణమే..అక్కడే ఉన్న పోచంపల్లి వాసి వెదిరె రామచంద్రారెడ్డి లేచి ‘నా తండ్రి జ్ఞాపకార్థం వంద ఎకరాల భూమిని దానం చేస్తా’నని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి అదే సభలో వినోబాభావేకు అందించారు. దానరూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తమైంది. గాజుల పోచంపల్లిని ‘భూదాన్ పోచంపల్లి’గా మార్చింది..1993లో గెజిట్ ద్వారా ఆ పేరు స్థిరమైంది. పోచంపల్లిని వినోబాభావే 1956లోనూ సందర్శించారు. భూదానోద్యమానికి తనను కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని ఆయన ‘భూదాన గంగోత్రి’గా అభివర్ణిస్తూ ఆ ఊరిని తన రెండో జన్మస్థలంగా పేర్కొన్నారు. నేతను కట్టుకుంది.. అసఫ్‌జాహీల పాలనా కాలం నాటికే లడీల హల్‌చల్‌ని కంటూ మగ్గాల సవ్వడిని వింటూ ఉంది పోచంపల్లి. అద్భుతమైన వస్త్రనేత కళాకారులకు పీటవేసింది. 1910 నాటికే ఇక్కడ చిటికి పరిశ్రమ ఏర్పడింది. ఇరవై నంబరు నూలుతో ‘తేలియా రుమాళ్ల’ను నేసేవారు. వ్యాపార నిమిత్తం హైదారాబాద్‌కు వచ్చిపోయే అరబ్బులు వీటిని చూసి ఇష్టపడి కొనుగోలు చేసేవారు. ఆ డిమాండ్‌తో తేలియా రుమాళ్లను అరబ్బు దేశాలకు ఎగుమతి చేయడమూ ప్రారంభించారు. పట్టునూ పట్టుకుంది తొలుత తేలియా రుమాళ్లు, కాటన్ వస్త్రాలు మాత్రమే పోచంపల్లి పేటెంట్గా ఉండేవి. తర్వాత ఈ ఊరికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరి అనే చేనేత కళాకారులు 60 నెంబరు నూలుతో పడుగు, పేకలతో సహజరంగుల్లో చీరలనూ నేశారు. 1956లో పోచంపల్లిని సందర్శించిన ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డ్ ప్రెసిడెంట్ కమలాబాయి ఛటోపాధ్యాయ, చిన్నతరహా పరిశ్రమల డైరక్టర్ దయారాం కాటన్ చీరల మాదిరిగానే పట్టు చీరలను తయారు చేయమని కోరారు. వారి కోరిక మేరకు అనంతరాములు, పెద్దయాదగిరి ఇద్దరూ బనారస్‌కు వెళ్లి అక్కడ ఏడాది పాటు శిక్షణ తీసుకొన్నారు. అనంతరం అనంతరాములుతో పాటు భిక్షపతి, కర్నాటి వాసుదేవ్ కుంభకోణం వెళ్లి రంగుల అద్దకంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత పోచంపల్లికి తిరిగి వచ్చి.. మొట్టమొదటిసారిగా 1958లో మగ్గంపై పట్టు చీరను నేశాడు అనంతరాములు. దాంతో పట్టు పరిశ్రమకూ పోగును సవరించుకుంది పోచంపల్లి. ఇక్కత్‌ను బ్రాండ్ వాల్యూగా మార్చుకుంది. ఈ నేత కళకు ప్రభుత్వం 2004లో పెటెంట్ హక్కునూ (జియోగ్రాఫికల్ ఆఫ్ గూడ్స్) కల్పించింది. చేతివృత్తుల ఎంపోరియం ప్రతినిధి నాయుడమ్మ.. పోచంపల్లిలో తయారైన ఇక్కత్ వస్త్రాల మార్కెటింగ్‌కు అవకాశాలను కల్పించాడు. అలా పట్టు చీరల తయారీలో తమదైన నేత, అద్దకంతో 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. కాలానికనుగుణంగా పోచంపల్లిలో నేత కార్మికులు.. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. మల్లేశం కనిపెట్టిన ఆసుయంత్రం ఇక్కడ పెద్ద విప్లవమనే చెప్పొచ్చు. దాని రాకతో నేత విషయంలో మహిళలకు పనిభారం చాలా తగ్గింది. ఒక్క ఆసుయంత్రం రోజుకు అయిదారు చీరలకు సరిపోను చిటికి పోస్తుంది. యంత్రం లేకపోతే రెండు చీరల కంటే ఎక్కువ పోయలేరు. అలాగే కండెలు చుట్టే యంత్రాలూ వచ్చాయి. వీటన్నిటి వల్ల వస్త్రోత్పత్తి గణనీయంగా పెరిగింది. విస్తృతమైన మార్కెట్ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరిగింది. దాంతో అన్నివర్గాల ప్రజలూ పర్యావరణ హితమైన చేనేత వస్త్రాలను ధరించడానికే మక్కువ కనబరుస్తున్నారు. బహుళజాతి కంపెనీలైన అమెజాన్, వీవ్‌మార్ట్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి చేనేత వస్త్రాలకు ఆన్లైన్లో అంతర్జాతీయ మార్కెట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా పేటీఎం, సొంత వెబ్సైట్ల ద్వారా పోచంపల్లి చేనేత సహకార సంఘమూ ఈ–మార్కెటింగ్‌ను మొదలుపెట్టింది. అలాగే ఔత్సాహిక యువతా వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను చేనేత వస్త్రాల మార్కెట్‌కు వేదికగా మలచింది. ఈ నూతన ఒరవడితో నెలలో ఒక్క పోచంపల్లిలోనే రూ. 3కోట్ల మేర టర్నోవర్ అవుతుందని అంచనా. వైట్ హౌస్‌లో పోచంపల్లి రెపరెపలు చీరలతో పాటు ఇక్కడ ఉత్పత్తి అయ్యే డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజాయ్లు, స్టోల్స్, స్కార్ఫ్స్, దుపట్టాలు, కర్టెన్స్, బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, దివాన్సెట్స్, సోఫా కవర్స్, హ్యాండ్ బ్యాగులు, క్యారీ బ్యాగ్స్ తదితర వెరైటీలకు స్వదేశంలోను, విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. ముఖ్యంగా సూడాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, దుబాయ్ వంటి దేశాల్లో మహిళలు ధరించే స్కార్ఫ్స్ను ఇక్కడే ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడి అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరోప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. విదేశాల్లో జరిగే వస్త్ర ప్రదర్శనల్లో పోచంపల్లి ఇక్కత్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలోని వైట్‌హౌస్, జపాన్, రష్యా అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్లనే వినియోగిస్తున్నారంటే ఇక్కడి చేనేత కళానైపుణ్యం ఎంతటిదో అర్థంచేసుకోవచ్చు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇక్కడి చేనేత చీరలను ధరించినవారే. పర్యాటకానికీ రంగులు అద్దింది.. పాఠ్యాంశంగా అచ్చయింది తనకే ప్రత్యేకమైన నేత ఈ ప్రాంతానికి ఓ నేపథ్యాన్ని అద్దితే.. వినోభాబావే సందర్శన ఆయన మాటతో వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం ఈ ఊరికి చారిత్రక ప్రాశస్త్యాన్ని కల్పించింది. ఈ రెండిటి ఘనత నాటి నుంచే పోచంపల్లిని సహజంగానే ఓ పర్యాటక పల్లెగా మలచింది. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం వచ్చిపోయే వ్యాపారులు, కొనుగోలుదారులతోపాటు ఆచార్య వినోబాభావే నడియాడిన నేల, ఆయన కూర్చున్న జువ్విచెట్టు, ఆయన బస (వినోబాభావే మందిరం) చేసిన చోటు, సంతానప్రాప్తికోసం నిర్మించిన 101 దర్వాజాల భవనాన్ని సందర్శించడానికీ దూరదూరాల నుంచి జనం వస్తూండడంతో పర్యాటక ప్రాంతంగా కిటకిటలాడుతుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే 2007లో రూ.3.75 కోట్ల వ్యయంతో ఇక్కడ గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పటి కేంద్ర పర్యాటక శాఖామంత్రి అంబికా సోని, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి దీనిని ప్రారంభించారు. ఇందులో ఆంఫి థియేటర్, చేనేత హస్తకళల మ్యూజియం, షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్, గెస్ట్‌హౌస్, బోటింగ్ సౌకర్యాలను కల్పించారు. అమెరికా, రష్యా, చైనా, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సూడాన్, నైజీరియా, ఈజిప్ట్, ఇటలీ, ఉగాండా, ఘనా, మలేషియా మొదలు వందకు పైగా దేశాలకు చెందిన ఎంతోమంది విదేశీయులు, విదేశీ అధికారులు పోచంపల్లి సందర్శనకు వచ్చారు.. వస్తున్నారు. ట్రైనీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులూ ఈ చేనేత పల్లెలో పర్యటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫ్యాషన్ డిజైనర్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులూ స్టడీటూర్‌లో భాగంగా సందర్శనకు వస్తుంటారు. మన పాఠ్యపుస్తకాలలో పోచంపల్లి ఇక్కత్‌ను పాఠ్యాంశంగా చేర్చడంతో ప్రత్యక్షంగా ఈ ఊరిని చూడ్డానికి వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులూ ఇక్కడికి వస్తుంటారు. మనకే కాదు పోచంపల్లి విదేశీయులకూ ఓ అధ్యయన కేంద్రంగా మారింది. ముఖ్యంగా వారు భూదానోద్యమ చరిత్ర, చేనేత, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, మహిళా సంఘాల నిర్వహణ, వ్యవసాయం, ఇక్కడి ప్రజల సంస్కృతీసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలను అధ్యయనం చేయడానికి తరచుగా వస్తుంటారిక్కడికి. పోచంపల్లి హైద్రాబాద్‌కు చేరువలో ఉండటం కూడా పర్యటనకు ఈజీ అయింది.. పర్యాటకులకు అనుకూలంగా మారింది. మేళాలతో ఉత్సాహం... గతంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచంపల్లి టూరిజం పార్కులో మూడు రోజుల పాటు మేళాను ఏర్పాటు చేశారు. ఇందులో చేనేత వస్త్రాల ప్రదర్శన, హ్యాండిక్రాప్ట్ ప్రదర్శన, గ్రామీణ వంటకాల రుచులు, గ్రామీణ కళలో భాగంగా గంగిరెద్దుల ఆట, డప్పుకళాకారుల ఆటాపాటా, ఒగ్గు కళారూపాలను ప్రదర్శించారు. ఈ మేళా ప్రతి ఏటా కొనసాగితే బాగుంటుందని పర్యాటకుల అభిప్రాయం. ఆకట్టుకున్న ఫ్యాషన్‌షోలు... పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిండంతో పాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి స్థానిక టూరిజం పార్కులో 2008లో ఫ్యాషన్‌షోను నిర్వహించారు. ప్రముఖ నటి శోభనతో పాటు పలువురు మోడల్స్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించి పర్యాటకులను ఆకట్టుకొన్నారు. 2018లో కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యాషన్‌షో నిర్వహించారు. ఇందులో మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రశ్మి ఠాకూర్‌తో పాటు ప్రముఖ ప్యాషన్ డిజైనర్లు తాము రూపొందించిన ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించారు. అభివృద్ధిని మరచింది డిసెంబర్ 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే 24వ మహాసభల సమావేశంలో ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పురస్కారాన్ని అందుకోనుంది పోచంపల్లి. ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కించుకున్న ఈ ఊరికి పర్యాటక కేంద్రంగా గొప్ప వైభవం వస్తుందనే ఆశతో ఉన్నారు స్థానికులు. ఇప్పటి వరకు పర్యాటక శాఖ ఆదాయాలపైనే శ్రద్ధ పెట్టి.. అభివృద్ధిని మరచింది. దాంతో ప్రస్తుతం గ్రామీణ పర్యాటక కేంద్రం వెలవెల బోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దీన్నో సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం.. సినిమా షూటింగ్‌లకూ.. ఎటూ చూసినా పచ్చని పంట పొలాలు, చెరువులు, గుట్టలతో అందమైన లోకేషన్లు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో సినిమా షూటింగ్‌లకూ కేరాఫ్‌గా మారింది పోచంపల్లి. ఆ షూటింగ్‌లకు మొదట క్లాప్ కొట్టి.. యాక్షన్ చెప్పింది ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్.. 1986లో.. ఆ సినిమా పేరు సుస్మాన్. షూటింగ్ కోసం దర్శకుడు శ్యామ్ బెనెగల్ సరే.. హీరోయిన్ షబానా ఆజ్మీ సహా ఆ యూనిట్ మొత్తం పోచంపల్లిలోనే బస చేశారట.. నెలరోజులకు పైనే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ సినిమా షూటింగ్ అయిపోయేలోపు షబానా ఆజ్మీ, హీరో ఓంపురి ఇద్దరూ బట్టలు నేయడం నేర్చుకోవడం. ఓంపురి ఓ కుర్తా గుడ్డ నేసి షబానాకు ప్రెజెంట్ కూడా చేశాడట. అలా సుస్మాన్ మొదలు నేటి వరకు ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాలు, పలు సీరియల్, డాక్యుమెంటరీల షూటింగ్‌లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. హీరో మహేశ్‌బాబు నటించిన ‘అతిథి’, పవన్‌కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’, వెంకటేశ్ నటించిన ‘వెంకీమామ’, అల్లుఅర్జున్ ‘వేదం’, ‘వరుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, ‘సాంబ’, విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’, నితిన్ ‘అ,ఆ’, శర్వానంద్ ‘మహానుభావుడు’, వరుణ్‌తేజ్ నటించిన ‘లోఫర్’, సాయిధరమ్ తేజ ‘ప్రతిరోజు పండగే’, మమ్ముట్టి ‘యాత్ర’, శ్రీకాంత్ నటించిన ‘రంగా ది దొంగ’, ఎన్. శంకర్ ‘ జై బోలో తెలంగాణ’, సునీల్ ‘భీమవరం బుల్లోడు’, ‘ఉంగరాల రాంబాబు’, ఇటీవల విడుదలైన నాని ‘టక్ జగదీశ్’, ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమాల షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. -ఎమ్ఏ షరీఫ్ చదవండి: Matilda Kullu: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..? -
పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల నేషనల్ క్వాలిటీ అనాలసిస్‌కు చెందిన కేంద్ర ప్రతినిధుల బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. జాతీయ స్థాయి ఎంపిక ఇలా.. జాతీయ వైద్య ఆరోగ్య సంస్థ చేపట్టిన 14 రకాల కార్యక్రమాల అమలు, ఆస్పత్రి పరిపాలనా విభాగం పనితీరు, వివిధ ఆరోగ్య పరీక్షల నిర్వహణ–నాణ్యత, రోగులకు అందిస్తున్న సేవలు, రికార్డులు–ఫార్మసీ నిర్వహణ, డెలివరీ ప్రొటోకాల్స్, అనంతరం తల్లీబిడ్డలకు అందిస్తున్న సేవలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ప్రమాణాలు పాటించిన పీహెచ్‌సీలను జాతీయస్థాయి క్వాలిటీ అస్యూరెన్స్ ఇస్తారు. కాగా పోచంపల్లి పీహెచ్సీ, పరిధిలోని 9 హెల్త్ సబ్‌సెంటర్ల ద్వారా మండలంలోని 52వేల మందికి వైద్య సేవలందిస్తున్నది. గర్భిణులు, పిల్లలకు ఇమ్యునైజేషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నది. జిల్లాలో అత్యధికంగా ఒక్క ఏడాదిలో పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 750 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఇలా జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పనిచేస్తున్నందుకుగాను పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి లభించింది. అదనపు నిధులు వస్తాయి పోచంపల్లి పీహెచ్సీ 2017లో ‘కాయకల్ప’అవార్డుకు ఎంపికైంది. గతంలో పీహెచ్‌సీని సందర్శించిన స్టేట్ క్వాలిటీ అనాలిసిస్ బృందం, నేషనల్‌కు ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇలా జాతీయస్థాయికి ఎంపికైన పీహెచ్‌సీకి ఏటా రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు అదనపు నిధులు వస్తాయి. –డాక్టర్ యాదగిరి, మండల వైద్యాధికారి -
‘బెస్ట్ విలేజ్’ పోటీలో భూదాన్‌పోచంపల్లి
భూదాన్‌పోచంపల్లి: తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం పోటీపడుతోంది. మన దేశంలోని భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక గ్రామం లద్‌పురాఖాస్ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. పోచంపల్లికి ఘనమైన చరిత్ర భూదాన్‌పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది. అలాగే ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయం. అంతేగాక నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు గాంచింది. దాంతో పోచంపల్లిని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు సందర్శించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తో్తంది. -
భూదాన్ పోచంపల్లిలో సాయి కుమార్ మూవీ షూటింగ్
విలక్షణ నటుడు సాయికుమార్ ప్రధాన పాత్రలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్ గ్రామాల్లో జరిగింది. అక్కడ సాయికుమార్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సాయికుమార్ మగ్గం నేసే, రచ్చబండ వద్ద గ్రామస్తులతో మాట్లాడే సీన్స్‌తోపాటు ఆయన బైక్‌పై వెళ్తున్న పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనుప్రసాద్ మాట్లాడుతూ.. మగ్గం నేసే తండ్రి కుమారుడిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులు, ఆ కుటుంబం పడే బాధలు కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. -
ఆ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సొంతూరిలో సందడి చేసిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల అనసూయ తన తల్లి అనురాధతో కలిసి వారి సొంతూరైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి వెళ్లారు. లాక్డౌన్ వల్ల చేనేత కార్మికులు తయారుచేసిన స్టాక్ అంతా పేరుకుపోయిందని.. వారికి అండగా నిలవాలని అనసూయ తన అభిమానులను, సన్నిహితులను కోరారు. అదే విధంగా గ్రామంలో పలువురికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రామంలోని పలు అందమైన ప్రదేశాల్లో అనసూయ ఫొటోలు దిగారు. తన తల్లితో కలిసి సరాదాగా గడిపారు. తను ఎక్కువగా చేనేత దుస్తులే ధరిస్తానని.. చేనేతలు మన ఆస్తులు అని అనసూయ పేర్కొన్నారు. వారికి తోడుగా ఉంటానని చెప్పారు. కాగా, అనసూయ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా అనసూయ భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే.(చదవండి : షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) View this post on Instagram Days like these are >>> #BhoodaanPochampally #VisitToMyNative #MyPeople #WeAreAllInThisTogether #LetsLookOutForEachOther #IWearHandloom #ILoveHandloom #IAmWithTheWeavers #WeaversAreOurAssets 💓 A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Jun 22, 2020 at 11:22pm PDT -
వెండితెరపై చేనేత కార్మికుడి విజయగాథ
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: ఓ సామాన్య చేనేత కార్మికుడి విజయగాథను వెండితెరపై ఆవిష్కరించడంతో చేనేత కళాకారుడి కష్టాలు, కళానైపుణ్యాలు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ఆసుయంత్ర సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత విజయగాథను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఆర్. రాజ్ మల్లేశం సినిమా రూపొందించగా, ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ఆదరణ పొందింది. సినిమా ఆసాంతం పోచంపల్లి మండలంలో నిర్మించడం విశేషం. చిత్ర యూనిట్ మూడు నెలల పాటు ఇక్కడే ఉండి రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, జలాల్పురం గ్రామాల్లో నిరంతరాయంగా సినిమా షూటింగ్ చేశారు. చేనేత కార్మికుడి ఇతిబాధలు వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు చేనేత కార్మికుల జీవనస్థితిగతులపై ఆధ్యయనం చేసి ఈ సినిమాను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆత్మహత్యలు వద్దనే సందేశంతో... ప్రస్తుతం చేనేతలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కార్మికుడి శ్రమభారం తగ్గించి వస్త్ర ఉత్పత్తి పెంచిన ఆసుయంత్రం రూపకల్పనకు దారితీసిన పరిస్థితులు, కష్టాలను ఎదురీది సాధించిన విజయం, అప్పులబాధ వెంటాడిన ధైర్యంతో సమస్యలను అధిగమించాలని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం చూపవని దర్శకుడు చేనేత కార్మికులకు సందేశాన్ని అందించారు. మెరిసిన స్థానికులు.. మల్లేశం సినిమాలో నటించేందుకు ఆసక్తి కల్గిన స్థానికులకు దర్శకుడు అవకాశం కల్పించాడు. పోచంపల్లికి చెందిన తడక రజని హీరో ప్రియదర్శ్‌కు అక్క పాత్రలో నటించింది. అలాగే తడక అతిథి లక్ష్మి, ఈపూరి వరుణ్‌సాయి హీరోకు మేనల్లుడి పాత్రలో నటించి మెప్పించారు. పోచంపల్లిలో పద్మశాలి, చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల సన్మానసభను ఏర్పాటుచేసి మల్లేశం చిత్ర యూనిట్‌కు సన్మానించారు. వెండితెరపై చేనేతలు.. ముప్పై ఏళ్ల క్రితమే శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో చేనేత నేపథ్యంలో ‘సుష్మాన్’ సినిమాను నిర్మించారు. మమ్ముట్టి హీరోగా మళయాల సినిమా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’, నీలకంఠ దర్శకత్వంలో ‘మాయ’, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రాలు చేనేత కార్మికులను తెరకెక్కించారు. ప్రభుత్వం కూడా ప్రముఖ సినీనటి సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్‌ను ఇక్కత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. గతేడాది జాతీయ చేనేత దినోత్సవం రోజున పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించారు. పోచంపల్లికి చెందిన ప్రముఖ యాంకర్ అనసూయ పలువేదికలో ఇక్కత్ వస్త్రాలను ధరిస్తూ పోచంపల్లికి ఇక్కత్‌ను తనవంతుగా ప్రమోట్ చేస్తుంది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది మల్లేశం సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు సామాన్య చేనేత కార్మికుడి సినిమా రాలేదు. మొదటిసారిగా తన విజయగాథను తెరకెక్కించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆసుయంత్రం తయారు చేయడానికి పడిన కష్టాలు, చివరగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పే సందేశం నచ్చింది. ఈ సినిమా ద్వారా చేనేత కార్మికుడికి గుర్తింపు వచ్చింది. చేనేత దినోత్సవం నిర్వహిస్తూ ప్రధాని మోదీ చేనేత కళాకారులకు గుర్తింపు తీసుకువచ్చారు. – చింతకింది మల్లేశం -
ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్దరావులపల్లి రజక సంఘం నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పోచంపల్లి రెడీమేడ్ వస్త్ర వ్యాపారులు కుంభం సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్టీలో చేరిన వారిలో సంగెం రంగులు, రాములు, కిష్టయ్య, యాదయ్య, వెంకయ్య, నర్సింహ, గణేశ్, బాలకృష్ణ, సంజీవ, తోటకూర బాలయ్య, దానయ్య, సంగెం శ్రీను, లింగం, శ్రీకాంత్, నాగేశ్, మహేశ్, మక్తాల కృష్ణ, గుర్రం నర్సింహ, జెల్ల బాలయ్య, భువనగిరి రాములు, కీర్తి భాస్కర్, దోర్నాల బాలరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తడక వెంకటేశం, కొట్టం కరుణాకర్‌రెడ్డి, భారత లవకుమార్, మలిపెద్ది అంబరీష్‌రెడ్డి, ఎంపీటీసీ ఆర్.సంధ్యాలాలయ్య, గంజి గణేశ్, కందాల గణేశ్, శీలం అంజయ్య, వడకాల రమేష్, బాలకృష్ణ, జంగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తా బీబీనగర్ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతన్న తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని జంపల్లి, గుర్రాలదండి, చిన్న, పెద్ద పలుగుతుండాలతో పాటు ముగ్దుంపల్లి, రావిపహాడ్, మాదారం తదితర గ్రామాల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న పైళ్ల శేఖర్‌రెడ్డి ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేశాడని దుయ్యబట్టారు. పబ్లిసిటీ కోసం ప్రజలను మభ్యపెడుతూ నీటి క్యాన్లు, హెల్మెట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్‌గౌడ్, జెడ్పీటీసీ బస్వయ్య, ఎంపీటీసీ వెంకటేష్, రామాంజనేయులు, మంగ్తానాయక్, రాజేశ్వర్, రాజేందర్, గోపి, రాములు, రాము, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు వెళ్లే సరికే.. పెళ్లైపోయింది
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో బుధవారం పోలీసులు వెళ్లేసరికే ఓ బాలిక వివాహమైంది. భూదాన్ పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామానికి చెందిన మంచాల కిషన్‌తో రేవనపల్లి గ్రామానికి చెందిన బాలిక(14)తో వివాహం నిశ్చయమైంది. పోచంపల్లిలో ఫంక్షన్‌హాళ్లు దొరకకపోవడంతో, చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ఫంక్షన్హాల్లో వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ మల్లీశ్వరి హుటాహుటిన అక్కడికి వెళ్లింది. అప్పటికే పెళ్లితంతు పూర్తయ్యింది. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న వారంతా పరారయ్యారు. పోలీసులు వెళ్లే సరికి వధూవరులు, బంధువులెవరూ లేరు. దీంతో ఆమె చిన్నకొండూరులో వెతికించగా, అబ్బాయి తండ్రి గండయ్య దొరికాడు. అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాల పెద్దమనుషులు వచ్చి, పోలీసులతో మాట్లాడి, గండయ్యను తీసుకుని వెళ్లారు. -
చీరల దొంగల ముఠా అరెస్ట్
నల్లగొండ : తరుచూ చీరల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళలు, ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో వెలుగు చూసింది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన ఐదుగురు మహిళలు ముఠాగా ఏర్పడి చీరల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరికి ఒక ఆటో డ్రైవర్ సహాయ పడుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భూదాన్‌పోచంపల్లి మండలంలోని భవాని హ్యాండ్లుమ్స్ దుకాణంలో రూ. 80 వేల విలువైన చీరలను దోచుకుని... పరారైయ్యారు. ఇది గుర్తించిన సదరు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, తాజాగా వీరు మండలంలోని కొత్తగూడెం గ్రామ సమీపంలో పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి... భువనగిరికోర్టులో హజరుపరిచారు. చీరలను దోచుకెళ్లి తిరిగి విక్రయించి సొమ్ము చేసుకోవడం వీరిపని అని పోలీసులు తెలిపారు. ఆటోను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. -
14 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
నల్లగొండ : పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దొతిగూడెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన 14 మంది యువకులు దొతిగూడెం గ్రామ సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కోళ్లఫారం వద్దకు చేరుకొని పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 29వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ట్రాన్స్‘ఫార్మర్’పైనే.. ప్రాణాలు విడిచాడు..
ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వేయబోయి ఓ రైతు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు సరసం సుధాకర్‌రెడ్డి(52) మంగళవారం పొలంలో వరినాట్లు వేయించాడు. నీరు పెడదామని బుధవారం మోటార్ ఆన్‌చేయగా కరెం టు లేదు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యూజ్ ఊడిపోయినట్లు గుర్తిం చాడు. దీంతో ఫ్యూజ్ వేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశాడు. కానీ సరిగా ఆఫ్కాలేదు. అది గమనించని సుధాకర్‌రెడ్డి ఫ్యూజ్ వేస్తుం డగా.. విద్యుదాఘాతంతో అదే ట్రాన్స్ఫార్మర్పై పడి ప్రాణాలు వదిలాడు. -భూదాన్ పోచంపల్లి -
బ్యూటీఫుల్ కోర్సు
భూదాన్‌పోచంపల్లి :నేడు యువతులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, మహిళలు ఎవరైనా సరే మేకప్ లేకుండా ఏ శుభకార్యానికి రావడంలేదంటే అతిశయోక్తి కాదు. తమ అందాలను మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి మేకప్ సర్వసాధారణమైంది. దీంతో మారుమూల గ్రామాల్లో సైతం బ్యూటీపార్లర్లు వెలుస్తున్నాయి. స్వయం ఉపాధి కల్పిస్తున్న బ్యూటీషియన్ కోర్సుకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ) ‘కాస్మటాలజీ అండ్ బ్యూటీషియన్’ కోర్సులో నిరుద్యోగ విద్యార్థినులు, యువతులకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. నేర్పించే అంశాలు... బ్యూటీషియన్ కోర్సులో ముఖ్యంగా ఫేసిషియల్, మేకప్, థ్రెడ్డింగ్, బ్లీచింగ్, మసాజ్, హెయిర్ డై, హెయిర్ కటింగ్, వాక్సింగ్, మెహందీ డిజైన్స్, పార్టీ అండ్ పెండ్లికుమార్తె మేకప్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం థియరీ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కాగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ రోజుకు ఆ రోజు నోట్స్ రాయిస్తున్నారు. అందరికి అర్థమయ్యేలా సరళమైన విధానంలో బోధిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి.. ఎస్ఆర్టీఆర్ఐ జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల సంస్థ సౌజన్యంతో నెల రోజుల కాలవ్యవధి గల ఈ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. టెన్త్ పాస్ లేదా ఫెయిల్ కనీస విద్యార్హత కల్గిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్ర స్తుతం మన జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన 25 మంది విద్యార్థినులకు మొదటి సారిగా ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్క డ హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు. స్వయం ఉపాధికి ఢోకాలేదు బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధికి ఢోకా లేదు. ఉన్న ఊర్లోనే తక్కువ పెట్టుబడితో సొంతంగా బ్యూటీపార్లర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఎస్ఆర్టీఆర్ఐ సంస్థ కూడా హైదరాబాద్ వంటి నగరాల్లో పేరుగాంచిన పెద్ద పెద్ద బ్యూటీపార్లర్లలో బ్యూటీషియన్‌గా ప్లేస్మెంట్ అవకాశం కల్పిం చేందుకు చర్యలు చేపట్టారు. జాబ్ కంటే ఈ కోర్సు బెటర్ ఎస్సెస్సీ వరకు చదువుకున్నా. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యూటీషియన్ కోర్సును నేర్చుకొంటున్నా. నేర్చుకొన్న తరువాత ఇంట్లోనే స్వయం ఉపాధి పొందవచ్చు. ఎక్కడో జాబ్ చేసేకంటే ఈ కోర్సు నేర్చుకొంటే బెటర్. ఇక్కడ ఉచిత హాస్టల్ వసతి కూడా కల్పించారు. -పి.విజయలలిత, సూర్యాపేట ఇంట్లో ప్రాక్టిస్ చేస్తున్నా.. ఇంటర్ పూర్తి చేసిన తరువాత మా ఇంట్లో చదువు మాన్పించారు. గతంలో ఇదే సంస్థలో ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్సు నేర్చుకొన్నాను. నాకు బ్యూటీషియన్ కోర్సు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ కోర్సును ఇష్టంతో నేర్చుకొంటున్నాను. ఇక్కడ నేర్చుకొన్న అంశాలను మా ఇంటి వద్ద ప్రాక్టిస్ చేస్తున్నా. - బిల్లబాలమణి, పోచంపల్లి ఉచితంగా నేర్పిస్తున్నాం మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిమిస్మే సంస్థ సౌజన్యంతో మొదటిసారిగా బ్యూటీషియన్ కోర్సును ప్రవేశపెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సెస్సీ పాస్ లేదా ఫెయిల్ కనీస విద్యార్హతగా నిర్ణయించాం. 25 మందికి బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. -డాక్టర్ ఎన్.కిషోర్‌రెడ్డి, ఇన్చార్జ్ డెరైక్టర్, ఎస్ఆర్టీఆర్ఐ మార్కెట్లో డిమాండ్ ఉంది బ్యూటీషియన్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సొం తంగా షాపు పెట్టుకొని స్వయం ఉపాధి పొందవచ్చు. కోర్సులో బేసిక్స్ నేర్పిస్తున్నాం. నేర్చుకున్నది మరిచిపోకుండా నోట్స్ కూడా రాయిస్తున్నాం. చాలా మంది ఈ కోర్సును నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. -గీత, ఇన్స్ట్రక్టర్ -
బిటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. మంగళవారం ఉదయం అటుగా వచ్చిన స్థానికులు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డిగా ప్రాధమిక సాక్ష్యాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు బిటెక్ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డిది హత్య, ఆత్మహత్య అనేది దర్యాప్తులో తెలుతుందన్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.