ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమో దం పొందే వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, కార్మికులు పోరాడాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం టీఎన్‌జీవో ఫంక్షన్‌హాలులో సంఘం జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు అధ్యక్షతన జరిగిన టీఎన్‌జీవో భేరి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తెలంగాణను అడ్డుకోవాలని చూసేవారి కుట్రలను ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అనేకసార్లు కమిటీల ముందు ఉంచినా ఎప్పుడు మా ట్లాడని వారు ఇప్పుడు ఎందుకు తెలంగాణను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె చేస్తూ మరోవైపు తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటడానికే దాడులను భరిస్తున్నామని దేవిప్రసాద్ అన్నారు. సకల జనుల సమ్మె 42 రోజులు విజయవంతంగా నిర్వహించినప్పటికీ తెలంగాణ ఉద్యమం లేదని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె మాత్రం నూటికి నూరు శాతం విజయవంతమైందని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు, రాజద్రోహం వంటి కేసులు పెట్టారని, ఆంధ్రా ఉద్యోగులపై ఏ ఒక్క కేసు పెట్టకుండా సమైక్యాంధ్ర వస్తే సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని మంత్రులే చెబుతున్నారన్నారు.
ప్రభుత్వం ఆంధ్రా ఉద్యోగులపై, తెలంగాణ ఉద్యోగులపై భిన్న వైఖరి ప్రదర్శించడం వివక్షకు పరాకాష్టగా నిలిచిందన్నారు. ఏపీ ఏన్జీవోల సభలో తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడులను సైతం భరిస్తూ సంయమనం పాటించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి 50 రోజులు గడుస్తున్నప్పటికీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ కోసం కలిసి రాకుంటే చరిత్రలో దోషులుగా మిగులుతారని అన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని,వేరే ప్రత్యామ్నాయం ఒప్పుకోమని తేల్చిచెప్పారు. సమైక్యపాలనను పారదోలేందుకు ఉద్యోగులందరూ ఏకంకావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో అనైక్యత సృష్టించడం ఎవరితరం కాదన్నారు.
ఉద్యమంలో ఖమ్మం ప్రముఖపాత్ర...
తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రముఖపాత్ర వహించిందని దేవీ ప్రసాద్ అన్నారు. 1969లో పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, రెండో దశ ఉద్యమంలో కూడా ఈ జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9, 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేందుకు ఖమ్మంజిల్లానే మూలకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సమయంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారని, ఆసమయం లో ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి తెలంగాణ వాదాన్ని చాటారని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకూ పోరాడాలన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనందుకు నిరసనగాను, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఈనెల 29న సకలజనుల భేరి నిర్వహిస్తున్నట్లు దేవిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, ఉద్యోగులు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఏపీఎన్జీఓల వైఖరివల్లే పీఆర్‌సీ జాప్యం...
పే రివిజన్ కమిషన్ ఫలితాలు అందకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, ఏపీ ఎన్జీవోల వైఖరి వల్లనే పీఆర్‌సీ అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. 2008 నుంచి 2013 వరకు 125 శాతం ధరలు పెరిగాయన్నారు. ఉద్యోగులకు దసరాలోపు 45 శాతం ఇన్‌టరమ్ చెల్లించాలని, లేనిపక్షంలో టీజేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో మహా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇవ్వడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూపాయి ఇచ్చి పది రూపాయలు ధరల రూపంలో కొల్లగొడుతోందన్నారు. లైబ్రరీ ఉద్యోగులకు 010 అమలు చేయాలని, అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానం ఉద్యోగుల్లో కూడా కలుగుతోందన్నారు.
సీమాంధ్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యా యం జరగదు.: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏలూరి తెలంగాణ ప్రజలకు,ఉద్యోగులకు సీమాంధ్ర ప్రభుత్వంలో న్యాయం జరగదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. అనేక ఎళ్ళుగా వివక్షకు గురవుతునే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా అన్నారు. 29న సమర భేరికి ఉద్యోగులు కదలాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను అణిచివేయాలని చూస్తే తిరగబడతారని,సీమాంధ్రులకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే వెళ్లాలన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో మనమే భాగస్వాములమని, ఉద్యోగులకు ఏలాంటి అన్యాయం జరిగినా సహించేదిలేదన్నారు.
టీఎన్‌జీవో కేంద్రసంఘం ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య ఉద్యమంతో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ ఆగిపోయిందన్నారు. టీఎన్‌జీవో కేంద్రసంఘం మహిళా అధ్యక్షురాలు రేచల్, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, టీజేఏసీ చైర్మన్ కనకాచారి, టీటీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, లాయర్ల జేఏసీ ఆధ్యక్షుడు తిరుమలరావు తదితరులు మాట్లాడుతూ తెలంగాణ సాధించేవరకు ఉద్యమం ఆగేదిలేదని స్పష్టం చేశారు. సభలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, రామారావు, సోమయ్య,లక్ష్మనారాయణ, వల్లోజు శ్రీనివాస్ ,సాగర్,రమణయాదవ్,తుమ్మలపల్లి రామారావు ప్రసాద్, నాగేశ్వరరావు, మల్లెలరవీంద్రపసాద్,రాజేష్, కొర్లపాటి వెంకటేశ్వర్లు, దుర్గప్రసాద్,తదితరులు పాల్గొన్నారు. సభలో కళాకారులు తెలంగాణ ఆటపాట లతో అలరించారు.
కుట్రలను ఎండగడతాం
Published Sat, Sep 21 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement
Advertisement