
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులంతా రిటైర్‌మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తుంటే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమ అనుకున్న వారి పదవీ విరమణ వయసు పెంపునకే కృషి చేస్తున్నారు. ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఈ తతంగానికి పాల్పడుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధుల సిఫారసుతో ప్రభుత్వం చేనేత జౌళి శాఖలో ఇద్దరి పదవీ విరమణ వయసు పొడిగించగా, ఇప్పుడు కొందరు టీజీవో, టీఎన్‌జీవో సంఘాల నేతలు తమ వారికి ఇలాగే రిటైర్‌మెంట్ వయసు పొడిగించుకున్నారు. దీని కోసం తమ సంఘాల సిఫారసులను వాడుకోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం పదవీ విరమణ వయసును పొడిగిస్తుందని వేల మంది ఎదురు చూస్తుండగా, సంఘాల నేతలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సీనియర్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చేనేత జౌళిశాఖలో పిట్టల యాదగిరి, రత్నాకర్, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అగ్రికల్చర్ వర్సిటీలో సుధీర్ కుమార్, పరిటాల సుబ్బారావుల సర్వీస్‌నూ రెండేళ్లు పొడిగించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణం అవుతోంది.
సాధారణ ఉద్యోగులకు అడిగే అవకాశం లేక..
ఉద్యోగ సంఘాల్లో సాధారణ ఉద్యోగులకు ప్రాథమిక సభ్యత్వం ఉన్నా తమ నేతలను అడిగే పరిస్థితిలో వారు లేరు. మెజారిటీ సంఘాలు సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తున్న దాఖలాల్లేవ్. దీంతో సాధారణ ఉద్యోగుల ఆవేదనను పట్టించుకునే వారే లేకుండాపోయారు. కాస్త పరపతి ఉన్నవారు అడిగినా.. సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారన్న విమర్శలున్నాయి. అయితే తమ ఇంట్లో వ్యక్తులు, బంధువుల కోసం మాత్రం అడ్డదారిలో పైరవీలు చేసుకొని ప్రయోజనాలు పొందుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ.. నిరాశల్లో ఉద్యోగులు..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడం, తర్వాత ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కావడంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడు జీవో వస్తుందా అని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా ఎదురుచూస్తూనే.. అనేక మంది పదవీ విరమణ పొందుతున్నారు. కనీసం ఈసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రిటైర్‌మెంట్ వయసును సీఎం పొడిగిస్తారని ఆశతో ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. ఇప్పటికే వేల మంది పదవీ విరమణ పొందగా, 2022 వరకు మరో 23,386 మంది పదవీ విరమణ పొందనున్నారు. వీరిలో చాలా మంది రిటైర్‌మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దీని కోసం సంఘాల నేతలను ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.
- 2020 జనవరి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయినవారు - 2,708 మంది
- వచ్చే 7నెలల్లో పదవీ విరమణ పొందనున్న వారు - 5,900 మంది
- 2022 డిసెంబర్ నాటికి రిటైర్ కానున్న ఉద్యోగులు - 23,386 మంది
వ్యక్తిగత ప్రయోజనాలు సరికాదు..
ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించాల్సిన సంఘాల నేతలు వాటిని పక్కనపెట్టేశారు. తమ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. పీఆర్‌సీ, డీఏ, ఐఆర్ వంటి సమస్యలను పట్టించుకోవడం లేదు. తమకు ప్రయోజనం చేకూర్చితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భజనపరులకే ప్రభుత్వ ప్రయోజనం చేకూర్చుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరికి మేలు చేయాలి. – సదానంద్‌గౌడ్, పర్వతరెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యుదర్శులు.. హర్షవర్దన్‌రెడ్డి, పీఆర్‌టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు... జంగయ్య, చావరవి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు... నావత్ సురేశ్, టీపీయూఎస్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment