పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం... ఇప్పుడిప్పుడే ఏకతాటిపైకి వస్తున్న ఉద్యోగులు
టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం, దాడులు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగులను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే.. తాము కూడా వారిని టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం టీజీఓ భవన్‌లో సంఘం విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
పెండింగ్ బిల్లులు త్వరగా పరిష్కరించాలి
సంఘం కార్యకవర్గ సమావేశంలో అన్ని కేటగిరీల్లో ని ఉద్యోగులకు సంబంధించి 500 సమస్యలపై చర్చ జరిగిందని, ఇందులో కీలకమైన అంశాలు 53 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో ఆరు అత్యంత ప్రధానమైనవని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను డిసెంబర్ నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచి్చనా.. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మనుగడలో లేకుండా పోయిందని, ప్రైవేటు అద్దె వాహనాలతోనే వ్యవస్థ నడుస్తోందని చెప్పారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులు.. ఉద్యోగులు, సంఘాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా సీఎం, సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment