అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ కార్యకర్తలు.. బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు
ముగ్గురు బీజేపీ నేతలతోపాటు అబిడ్స్ ఇన్‌స్పెక్టర్‌కు గాయాలు
అనంతరం గాందీభవన్ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు
కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీల చించివేత
రమేశ్ బిదూరీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: హైదరాబాద్‌లోని నాంపల్లి వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకాగాందీని ఉద్దేశించి ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు.
కర్రలతో దాడికి ప్రయత్నించడంతో ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి ఉపక్రమించారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఘర్షణ వాతావరణం నెలకొనగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. రాళ్లదాడిలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యకర్త నందు తలకు తీవ్ర గాయమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ కూడా గాయపడ్డారు. వారిని పార్టీ నేతలు పక్కనే ఉన్న కేర్ ఆస్పత్రికి తరలించారు.
అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ ఇమాన్యుయేల్‌కు కూడా గాయాలయ్యాయి. అనంతరం బీజేపీ కార్యాలయానికి కొంత దూరంలో రమేశ్ బిదూరీ దిష్టి»ొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ ఘర్షణ దాదాపు గంటపాటు కొనసాగింది. అనంతరం ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా, కేసులు నమోదయ్యాయి. అబిడ్స్ డివిజన్ పోలీసులతోపాటు అదనపు పోలీసు బలగాలు పలువురిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించేశాయి.
గాంధీభవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు
తమ పార్టీ కార్యాలయంపై దాడికి ప్రతిగా బీజే పీ కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకొని బారి కేడ్లు తొలగించి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కల్పించుకొని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాదనకు దిగారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడున్న కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను చించేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు హెల్మెట్‌లను గాం«దీభవన్‌పైకి విసి రారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దీంతో గాందీభవన్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రేవంత్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్
బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సంజాయిషీ ఇవ్వాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరని ఒక ప్రక టనలో హెచ్చరించారు. దాడుల విషయంలో బీజేపీ మరో నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందని హెచ్చరించారు.
పోలీసులను వెంట తీసుకొని బీజేపీ కార్యాలయ మెయిన్ గేటు వద్దకు వచ్చి బీజేపీ కార్యకర్తలపై, పార్టీ ఆఫీసుపై కర్రలు, రాళ్లతో దాడిచేయడం దుర్మార్గమన్నారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాలు దాడి చేస్తున్నా పోలీ సులు ప్రేక్షకపాత్ర వహించారు. దీనిపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ స్పందించాలి’అన్నారు.
మేం తలుచుకుంటే..: కేంద్ర మంత్రి బండి సంజయ్
బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాందీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే.. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
సీఎం బాధ్యత వహించాలి: లక్ష్మణ్
ఈ దాడులకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ‘ఇలాంటి గూండా రాజకీయాలు సాగవు.. మిస్టర్ రేవంత్‌రెడ్డి ఖబడ్దార్. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ ఘటన వెనుక రేవంత్ కుట్ర దాగుంది’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
బీజేపీ కార్యాలయంపై గూండాలు, రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి సీఎం రేవంత్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పార్టీ కార్యాలయాల మీద దాడిచేసే సంస్కృతి సిగ్గుచేటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment