ELURI SRINIVASA RAO
-
ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం, దాడులు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగులను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే.. తాము కూడా వారిని టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం టీజీఓ భవన్లో సంఘం విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. పెండింగ్ బిల్లులు త్వరగా పరిష్కరించాలి సంఘం కార్యకవర్గ సమావేశంలో అన్ని కేటగిరీల్లో ని ఉద్యోగులకు సంబంధించి 500 సమస్యలపై చర్చ జరిగిందని, ఇందులో కీలకమైన అంశాలు 53 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో ఆరు అత్యంత ప్రధానమైనవని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను డిసెంబర్ నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచి్చనా.. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మనుగడలో లేకుండా పోయిందని, ప్రైవేటు అద్దె వాహనాలతోనే వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులు.. ఉద్యోగులు, సంఘాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా సీఎం, సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
దీక్ష భగ్నం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జీవోఎంకు చేసిన ప్రతిపాదనలను నిరసిస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి ఏలూరి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు పరీక్షించి వైద్య సేవలు అందించాలని సూచించారు. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని భావించిన ఉద్యోగ సంఘాల నాయకులు, న్యూడెమోక్రసీ, సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకుని రక్షణ వలయంగా ఏర్పడ్డారు. తెల్లవార్లూ ఆట పాటలతో ధూంధాం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సారంగపాణి, వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు దీక్షా శిబిరాన్ని ముట్టడించారు. అడ్డువచ్చిన నాయకులను పక్కకు నెడుతూ ఏలూరిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పలుమార్లు ఏలూరిని అరెస్ట్ చేయాలని చూసినా నాయకులు ప్రతిఘటించారు. చివరకు పోలీసులు ఉద్యోగులు, ఆయా పార్టీల కార్యకర్తలను పక్కకు నెట్టేసి ఏలూరిని బలవంతంగా జీపులో ఎక్కించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ద్వారాలను మూసి భారీ బందోబస్తు నిర్వహించారు. ఏలూరికి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించడంతో బలవంతంగా సెలైన్ ఎక్కించారు. నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు యత్నించినా పోలీసులు అనుమతించకపోవడంతో వారి వైఖరిని నిరసిస్తూ అప్పుడే కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని, వేరు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం జేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, పోటు రంగారావు, దిండిగల రాజేందర్ తదితరులు ప్రభుత్వ వైద్యశాలలో ఏలూరికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. దీక్ష భగ్నానికి నిరసనగా ర్యాలీ... ఏలూరి శ్రీనివాసరావు ఆమరణ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ రాజకీయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుని, అక్కడినుంచి ప్రదర్శనగా మయూరిసెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జడ్పీ సెంటర్‌మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆమరణదీక్ష చేపట్టిన ఏలూరిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని విమర్శించారు. భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో కొనసాగించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఐదు రోజులుగా ఏలూరి దీక్షచేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. దీక్షతో భద్రాచలం వాణి ఢిల్లీ వరకు వినిపించిందన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు కిరణ్‌కుమార్‌రెడ్డికి దాసోహంగా మారారని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి భద్రాచలాన్ని వేరు చేయాలని ముఖ్యమంత్రి జీవోఎంకు ప్రతిపాదనలు చేసినా, వారు స్పందించకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి, జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు ఉద్యమంలోకి రాకపోవడం దురదృష్టకరమన్నారు. జీవోఎం కుట్రలు పటాపంచలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. పోలీసులు ఏలూరిని అరెస్ట్ చేసిన సమయంలో దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆంధ్రాలో ఉద్యమం జరుగుతున్న సమయంలో అక్కడి పోలీసులు స్పందించలేదని, ప్రభుత్వం కావాలనే తెలంగాణాలో ఉద్యమకారులపై అణచివేత ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లానుంచి భద్రాచలంను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులంతా ఉద్యమంలో పాల్గొనకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారని అన్నారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా మాట్లాడుతూ ఏలూరి దీక్షతో భద్రాచలం ఆవశ్యకత ఢిల్లీ వరకు వినిపించిందని, ఇకనైనా మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఎలాంటి షరతులు లేని భద్రాచలంతో కూడిన తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య, టీటీ జేఏసీ అధ్యక్షుడు నాగిరెడ్డి, టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు నరేందర్, జేఏసీ నాయకులు మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, మోత్కూరి నాగేశ్వరరావు, గుంటిపల్లి వేణుగోపాల్, వల్లోజు శ్రీనివాస్, సాగర్, రమణ యాదవ్, దుర్గాప్రసాద్, బాలకృష్ణ, ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీవై పుల్లయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు మంగతాయి, శిరోమణి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడాలి: దేవీ ప్రసాద్
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలనే ప్రతిపాదన విషయంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడి ఉద్యమంలోకి రావాలని, ప్రభుత్వంతో ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం రెండోరోజుకు చేరుకోగా, దేవీప్రసాద్‌తో పాటు పలువురు నేతలు దీక్షాశిబిరాన్ని సందర్శించి ఏలూరికి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా దేవీప్రసాద్ ప్రసంగిస్తూ భద్రాచలాన్ని కాజేయాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు చూస్తున్నారని ఈ కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఏలూరి చేసిన సాహసం అభినందనీయమన్నారు. పోలవరంతో రాముడిని ముంచడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణంతో అస్థిత్వం కోల్పోతామని గిరిజనులు చెబుతుంటే నిర్మించి తీరుతామని చెప్పడం సరికాదన్నారు. ఈ సమస్య ఉద్యోగులది కాదని, ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకొని మౌనం వీడి,స్పష్టమైన ప్రకటన చేయించి ఏలూరి దీక్షను విరమింపచేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ దీక్ష కొనసాగుతుందని దీనికి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏలూరి దీక్షతోనైనా ప్రజాప్రతినిధులలో చలనం రావాలన్నారు. భద్రాద్రి రాముడిని తెలంగాణ ప్రభువుగా, దేవుడిగా కొనియాడుతున్నారని, అలాంటి రాముడి జోలికి రావడం తగదన్నారు. సీమాంధ్రుల కుట్రలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. టీఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేఛల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన ఏలూరి మళ్లీ భద్రాచలం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైరా శాసన సభ్యురాలు చంద్రావతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో పాలకు ఎదో ఒక రకంగా ప్రజలను తికమక పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఏలూరి చేస్తున్న దీక్ష అభినందనీయమన్నారు. ఎక్కువ భూభాగాన్ని దక్కించుకోవాలని సీమాంధ్రులు చూస్తున్నారని, దీనిని ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పవన్,శ్రీనివాస్,ఉద్యోగజేఏసీ అధ్యక్షప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు,నడింపల్లి వెంకటపతిరాజు,టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా ,టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు నరేంధర్,రాష్ట్ర కోశాధికారి గుంటుపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరి దీక్షకు మద్దతు తెలపండి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలనే కుట్రలను తిప్పికొట్టేందుకు టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి ఆమరణదీక్ష చేపడుతున్నాడని, జిల్లాలోని రాజకీయ, ఉద్యోగ, తెలంగాణ వాదులు మద్దతు ప్రకటించాలని ఉద్యోగ, రాజకీయ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగ, రాజకీయ జేఏసీ సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో టీజేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు నిర్వహించామని అన్నారు. భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఏలూరి శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం కఠినమైందని, దీనికి ఉద్యోగ, రాజకీయ, తెలంగాణ వాదులు సహకరించాలని అన్నారు. ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ భద్రాచలం కోసం ఏలూరి చేపట్టే ఆమరణ దీక్షకు ఉద్యోగులందరూ వెన్నటి ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులు భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర సంఘం నాయకులు గాదె దివాకర్ మాట్లాడుతూ భద్రాచలం రక్షణకు శ్రీనివాసరావు చేస్తున్న దీక్షకు ఎన్డీ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా చరిత్రను, వనరులను దోచుకునేందుకే భద్రాచలం కావాలని సీమాంధ్రులు అడుగుతున్నారని, వారి కుట్రలను భగ్నం చేసేందుకే ఆమరణ దీక్ష చేపడుతున్నానన్నారు. పోరాటాల గడ్డ ఖమ్మం జిల్లాలో పుట్టిన తాను జిల్లాను ముక్కలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. భద్రాచలంలో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ముడిపడి ఉందని, ఒక ఉద్యోగ నేతగా వారి సంక్షేమం కోసం పోరాడుతున్నానని వివరించారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. 23వతేదీ ఉదయం 7 గంటలకు భద్రాచలం రాముడిని దర్శించుకుని భద్రాచలం కాపాడాలంటూ వినతిపత్రం అందజేయనున్నాని పేర్కొన్నారు. మధ్యాహ్నం కొత్తగూడెం చర్చిలో ప్రార్ధనలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మంలోని కస్బాబజార్‌లో ఉన్న మసీద్‌లో ప్రార్ధనలు చేస్తామని, 2 గంటలకు స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని దీక్షలు చేపడతామని అన్నారు. 25, 26 తేదీల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామసమయంలో నిరసనలు తెలిపి ఆమరణదీక్షకు సంఘీభావం తెలిపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లెల రవీంద్రప్రసాద్, జిరామయ్య, సివైపుల్లయ్య, తిరుమలరావు, శిరోమణి, హకీం, సంపత్, మురళి, బాబురత్నాకర్, అమరణ శ్రీను, రమేష్, నాగలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు. -
భద్రాచలాన్ని విడదీస్తే ఊరుకోం..
ఖమ్మం గాంధీచౌక్/ ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని విడదీస్తే ఊరుకునేది లేదని జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మయూరిసెంటర్, బస్టాండ్, జడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ దీక్ష చేస్తున్న పంచాయతీ రాజ్ ఉద్యోగులకు జర్నలిస్టులు సంఘీభావం ప్రకటించారు. భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని జర్నలిస్టు నేతలు ప్రకటించారు. భద్రాచలం డివిజన్‌ను పోలవరంతో ముంచేందుకే సీమాంధ్రులు ఆ డివిజన్ కావాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామ్‌నారాయణ, ఏనుగు వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.ఆదినారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, వెంకట్రావ్, జర్నలిస్టు నాయకులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాపారావు, కృష్ణమురారి, అప్పారావు, వనం వెంకటేశ్వర్లు, పోటు శ్రీనివాస్, వేణుగోపాల్, నాగేందర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల ప్రదర్శనకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగారాజు, నడింపల్లి వెంకటపతిరాజు సంఘీభావం ప్రకటించారు