ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జీవోఎంకు చేసిన ప్రతిపాదనలను నిరసిస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి ఏలూరి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు పరీక్షించి వైద్య సేవలు అందించాలని సూచించారు. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని భావించిన ఉద్యోగ సంఘాల నాయకులు, న్యూడెమోక్రసీ, సీపీఐ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకుని రక్షణ వలయంగా ఏర్పడ్డారు. తెల్లవార్లూ ఆట పాటలతో ధూంధాం నిర్వహించారు.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సారంగపాణి, వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు దీక్షా శిబిరాన్ని ముట్టడించారు. అడ్డువచ్చిన నాయకులను పక్కకు నెడుతూ ఏలూరిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పలుమార్లు ఏలూరిని అరెస్ట్ చేయాలని చూసినా నాయకులు ప్రతిఘటించారు. చివరకు పోలీసులు ఉద్యోగులు, ఆయా పార్టీల కార్యకర్తలను పక్కకు నెట్టేసి ఏలూరిని బలవంతంగా జీపులో ఎక్కించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ద్వారాలను మూసి భారీ బందోబస్తు నిర్వహించారు. ఏలూరికి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించడంతో బలవంతంగా సెలైన్ ఎక్కించారు. నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు యత్నించినా పోలీసులు అనుమతించకపోవడంతో వారి వైఖరిని నిరసిస్తూ అప్పుడే కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని, వేరు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం జేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, పోటు రంగారావు, దిండిగల రాజేందర్ తదితరులు ప్రభుత్వ వైద్యశాలలో ఏలూరికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు.
దీక్ష భగ్నానికి నిరసనగా ర్యాలీ...
ఏలూరి శ్రీనివాసరావు ఆమరణ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ రాజకీయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుని, అక్కడినుంచి ప్రదర్శనగా మయూరిసెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జడ్పీ సెంటర్‌మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆమరణదీక్ష చేపట్టిన ఏలూరిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని విమర్శించారు.
భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో కొనసాగించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఐదు రోజులుగా ఏలూరి దీక్షచేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. దీక్షతో భద్రాచలం వాణి ఢిల్లీ వరకు వినిపించిందన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు కిరణ్‌కుమార్‌రెడ్డికి దాసోహంగా మారారని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి భద్రాచలాన్ని వేరు చేయాలని ముఖ్యమంత్రి జీవోఎంకు ప్రతిపాదనలు చేసినా, వారు స్పందించకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి, జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు ఉద్యమంలోకి రాకపోవడం దురదృష్టకరమన్నారు.
జీవోఎం కుట్రలు పటాపంచలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. పోలీసులు ఏలూరిని అరెస్ట్ చేసిన సమయంలో దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆంధ్రాలో ఉద్యమం జరుగుతున్న సమయంలో అక్కడి పోలీసులు స్పందించలేదని, ప్రభుత్వం కావాలనే తెలంగాణాలో ఉద్యమకారులపై అణచివేత ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లానుంచి భద్రాచలంను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులంతా ఉద్యమంలో పాల్గొనకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారని అన్నారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా మాట్లాడుతూ ఏలూరి దీక్షతో భద్రాచలం ఆవశ్యకత ఢిల్లీ వరకు వినిపించిందని, ఇకనైనా మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఎలాంటి షరతులు లేని భద్రాచలంతో కూడిన తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య, టీటీ జేఏసీ అధ్యక్షుడు నాగిరెడ్డి, టీఎన్‌జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు నరేందర్, జేఏసీ నాయకులు మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, మోత్కూరి నాగేశ్వరరావు, గుంటిపల్లి వేణుగోపాల్, వల్లోజు శ్రీనివాస్, సాగర్, రమణ యాదవ్, దుర్గాప్రసాద్, బాలకృష్ణ, ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీవై పుల్లయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు మంగతాయి, శిరోమణి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
దీక్ష భగ్నం
Published Fri, Nov 29 2013 6:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement