ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలనే కుట్రలను తిప్పికొట్టేందుకు టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి ఆమరణదీక్ష చేపడుతున్నాడని, జిల్లాలోని రాజకీయ, ఉద్యోగ, తెలంగాణ వాదులు మద్దతు ప్రకటించాలని ఉద్యోగ, రాజకీయ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగ, రాజకీయ జేఏసీ సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో టీజేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు నిర్వహించామని అన్నారు.
భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఏలూరి శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం కఠినమైందని, దీనికి ఉద్యోగ, రాజకీయ, తెలంగాణ వాదులు సహకరించాలని అన్నారు. ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ భద్రాచలం కోసం ఏలూరి చేపట్టే ఆమరణ దీక్షకు ఉద్యోగులందరూ వెన్నటి ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులు భద్రాచలాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలని అన్నారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర సంఘం నాయకులు గాదె దివాకర్ మాట్లాడుతూ భద్రాచలం రక్షణకు శ్రీనివాసరావు చేస్తున్న దీక్షకు ఎన్డీ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా చరిత్రను, వనరులను దోచుకునేందుకే భద్రాచలం కావాలని సీమాంధ్రులు అడుగుతున్నారని, వారి కుట్రలను భగ్నం చేసేందుకే ఆమరణ దీక్ష చేపడుతున్నానన్నారు. పోరాటాల గడ్డ ఖమ్మం జిల్లాలో పుట్టిన తాను జిల్లాను ముక్కలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. భద్రాచలంలో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ముడిపడి ఉందని, ఒక ఉద్యోగ నేతగా వారి సంక్షేమం కోసం పోరాడుతున్నానని వివరించారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
23వతేదీ ఉదయం 7 గంటలకు భద్రాచలం రాముడిని దర్శించుకుని భద్రాచలం కాపాడాలంటూ వినతిపత్రం అందజేయనున్నాని పేర్కొన్నారు. మధ్యాహ్నం కొత్తగూడెం చర్చిలో ప్రార్ధనలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మంలోని కస్బాబజార్‌లో ఉన్న మసీద్‌లో ప్రార్ధనలు చేస్తామని, 2 గంటలకు స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని దీక్షలు చేపడతామని అన్నారు. 25, 26 తేదీల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామసమయంలో నిరసనలు తెలిపి ఆమరణదీక్షకు సంఘీభావం తెలిపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లెల రవీంద్రప్రసాద్, జిరామయ్య, సివైపుల్లయ్య, తిరుమలరావు, శిరోమణి, హకీం, సంపత్, మురళి, బాబురత్నాకర్, అమరణ శ్రీను, రమేష్, నాగలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు.
ఏలూరి దీక్షకు మద్దతు తెలపండి
Published Sun, Nov 24 2013 7:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement