ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలనే ప్రతిపాదన విషయంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడి ఉద్యమంలోకి రావాలని, ప్రభుత్వంతో ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం రెండోరోజుకు చేరుకోగా, దేవీప్రసాద్‌తో పాటు పలువురు నేతలు దీక్షాశిబిరాన్ని సందర్శించి ఏలూరికి సంఘీభావం తెలిపారు.
ఈసందర్భంగా దేవీప్రసాద్ ప్రసంగిస్తూ భద్రాచలాన్ని కాజేయాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు చూస్తున్నారని ఈ కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఏలూరి చేసిన సాహసం అభినందనీయమన్నారు. పోలవరంతో రాముడిని ముంచడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణంతో అస్థిత్వం కోల్పోతామని గిరిజనులు చెబుతుంటే నిర్మించి తీరుతామని చెప్పడం సరికాదన్నారు. ఈ సమస్య ఉద్యోగులది కాదని, ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకొని మౌనం వీడి,స్పష్టమైన ప్రకటన చేయించి ఏలూరి దీక్షను విరమింపచేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ దీక్ష కొనసాగుతుందని దీనికి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు.
టీఎన్‌జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏలూరి దీక్షతోనైనా ప్రజాప్రతినిధులలో చలనం రావాలన్నారు. భద్రాద్రి రాముడిని తెలంగాణ ప్రభువుగా, దేవుడిగా కొనియాడుతున్నారని, అలాంటి రాముడి జోలికి రావడం తగదన్నారు. సీమాంధ్రుల కుట్రలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. టీఎన్‌జీవో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేఛల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన ఏలూరి మళ్లీ భద్రాచలం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైరా శాసన సభ్యురాలు చంద్రావతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో పాలకు ఎదో ఒక రకంగా ప్రజలను తికమక పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఏలూరి చేస్తున్న దీక్ష అభినందనీయమన్నారు. ఎక్కువ భూభాగాన్ని దక్కించుకోవాలని సీమాంధ్రులు చూస్తున్నారని, దీనిని ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పవన్,శ్రీనివాస్,ఉద్యోగజేఏసీ అధ్యక్షప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు,నడింపల్లి వెంకటపతిరాజు,టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా ,టీఎన్‌జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు నరేంధర్,రాష్ట్ర కోశాధికారి గుంటుపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడాలి: దేవీ ప్రసాద్
Published Tue, Nov 26 2013 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement