Badhrachalam Division
-
కొన్ని సవరణలకు ఓకే
* భద్రాచలం సీమాంధ్రకు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు * సీమాంధ్ర కొత్త రాజధాని పరిశీలనకు 6 నెలలు గడువు * రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు * ప్రస్తుత అసెంబ్లీ స్థానాల ప్రకారమే ఎన్నికల నిర్వహణ * ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ సీట్లు పెంపు * అత్యధిక సవరణలను తిరస్కరించిన కేంద్ర కేబినెట్ * రాయల-టీ, హైదరాబాద్ యూటీ డిమాండ్లకు నో రాష్ట్ర విభజనకు సంబంధించి ఖమ్మం జిల్లా భద్రాచలం పరిధిలోని కొన్ని ప్రాంతాలను సీమాంధ్ర కొత్త రాష్ట్రంలోకి చేర్చటానికి; రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వటానికి, కొత్త రాష్ట్రానికి ఆర్థికసాయం చేయటానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం అంగీకరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని సవరణలకు మంత్రిమండలి అంగీకరించింది. శాసనసభ ప్రతిపాదించిన 422 ముఖ్య సవరణలను, శాసనమండలి ప్రతిపాదించిన సవరణల్లో 322 కొన్నిటిని మాత్రమే ఆమోదించిన కేబినెట్.. అత్యధిక సవరణల ప్రతిపాదనలను తిరస్కరించింది. రాయల తెలంగాణ ఏర్పాటు, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం, రెండు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, హైదరాబాద్ ఆదాయం పంపిణీ వంటి కీలక సవరణ ప్రతిపాదనలనూ తోసిపుచ్చింది. అంగీకరించినవివీ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వుుంపుకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు; భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం, ఆలయం కాకుండా) మండలాలు.. రాష్ట్ర విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర పరిధిలోకి చేర్చాలని సవరణ చేర్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, పునరావాసం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే భద్రాచలం రెవెన్యూ గ్రామం, దేవాలయం ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగంగా ఉంటాయి. మరికొన్ని సవరణలిలావున్నాయి... * పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం అంగీకరించినట్లుగా పరిగిణించటం జరుగుతుంది. * విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి ప్రదేశాలు, ప్రత్యామ్నాయాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ నివేదిక అందించే కాలపరిమితిని.. తొలుత ప్రతిపాదించినట్టుగా 45 రోజులకు బదులు ఆరు నెలలకు పెంచారు. * ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014గా మార్చారు. * ప్రస్తుత శాసన మండలి చైర్మన్ సీమాంధ్ర శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి చైర్మన్ ఎన్నికయ్యేవరకు ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ వుండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మండలికి సంబంధించి సభా వ్యవహారాల నిబంధనల్లో మార్పు చేర్పులు చేసేవరకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. * వచ్చే సాధారణ ఎన్నికలు ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మేరకే జరుగుతాయని, ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనే సవరణను చేర్చారు. దీనిప్రకారం.. తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కు, విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు పెంచుతారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది. * ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు చెందుతుందని, తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అది ఏర్పాటయ్యే వరకూ తెలంగాణ అవసరాలను రాష్ట్రపతి అనుమతితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వర్తించవచ్చని సవరణను కేబినెట్ అంగీకరించింది. * వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాయుం కింద రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంది. * విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరుల కొరత ఏర్పడకుండా కేంద్రం నుంచి ఆర్థిక సాయం ఇస్తారు. * విభజన తర్వాత ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాల విద్యార్థులకూ సమాన అవకాశాలు కల్పించేందుకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లో ప్రస్తుతమున్న ప్రవేశాల కోటా ‘పదేళ్లకు మించకుండా కొనసాగుతుంది’ అనే చోట ‘పదేళ్ల కాలం కొనసాగుతుంది’ అని మార్చారు. * ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీమాంధ్రలో 11 జిల్లాలకు బదులు 13 జిల్లాల పేర్ల గుర్తింపు. (అనంతపురం (2), కర్నూలు (1)ఎమ్మెల్సీ సంఖ్యను అసెంబ్లీకి వచ్చిన బిల్లులో చూపలేదు.) * పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నెంబర్లు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రింటింగ్‌లో దొర్లిన తప్పుల సవరణ; గిరిజన తెగల పేర్లకు సంబంధించి దొర్లిన పొరపాట్ల సవరణ వంటివి అంగీకరించింది. * రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి అడ్వైజరీ కమిటీల సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని బిల్లులో పొందుపర్చారు. దీనికిపుడు ‘భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు కేంద్రం నిర్ణయమే అంతిమం’ అని మరో అంశం చేర్చారు. తిరస్కరించినవివీ... * తెలంగాణ రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను విలీనం చేసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన. * గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం (యుూటీ)గా ప్రకటించడం, ఉమ్మడి రాజధానిని ఖైరతాబాద్ మండలానికే పరిమితం చేయడం, ఉమ్మడి రాజధాని పదేళ్లుగా కాకుండా, ఎప్పుడు సీవూంధ్ర కొత్త రాజధాని పూర్తయితే అప్పుడు లేదా రెండు మూడు సంవత్సరాలకే ఉవ్ముడి రాజధాని వ్యవధిని పరిమితం చేయాలనే ప్రతిపాదనలు. * సీమాంధ్రలో కొత్త రాజధాని, పరిపాలనా భవనాల నిర్మాణానికి కనీసం రూ. రెండు లక్షల కోట్ల ప్యాకేజీ సవుకూర్చాలనే సవరణ. * ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణకు సంబంధించి గవర్నర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం మేరకు నడుచుకోవాలనే ప్రతిపాదన. * గవర్నర్ సలహాదారుల్లో ఒకరు కనీసం ఎస్సీ/ఎస్టీ ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను కలిపి ఒకే ఉవ్ముడి కమిషనరేట్ ఏర్పాటు చేయూలి, గవర్నర్ సచివాలయాన్ని బలోపేతం చేయూలి, అక్టోపస్/గ్రే హౌండ్స్‌ను డీజీపీ ఆధీనంలో ఉంచి గవర్నర్ అధికార పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన. * తెలంగాణ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను 40 నుంచి 50కి పెంచాలనే ప్రతిపాదన. * తెలంగాణ హైకోర్టును మూడు నెలల్లో ఏర్పాటు చేయూలనే ప్రతిపాదన. * ప్రణాళిక సంఘం గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వ అదనపు నిధులు సహా హైదరాబాద్ ఆదాయాన్ని పది సంవత్సరాలపాటు ఇరు ప్రాంతాలకు పంపిణీ చేయూలనే ప్రతిపాదన. * నిజాం ఆస్తులకు సంబంధించి ఎపీ భవన్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్‌కు కొంత స్థలాన్ని కేటాయించడం.. అనే ప్రతిపాదనలు. * ఆయా ప్రాజెక్టుల ఫలితాలను అనుభవిస్తున్న ప్రాంతాలే సంబంధిత రుణ భారాన్ని భరించాలనీ, 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పర్యటించాలనే ప్రతిపాదనలు. * ప్రభుత్వ రంగ సంస్థలు తక్షణమే వేరుపడాలనే ప్రతిపాదన. * స్థానికత ఆధారంగా పెన్షన్ చెల్లింపులు జరపాలనే ప్రతిపాదన. * కృష్ణా, గోదావరి నదీ జలాల యజమాన్య నిర్వహణకు అపెక్స్ కౌన్సిల్ ఉండకూడదనే ప్రతిపాదన. కృష్ణాపై చేపట్టిన వరద నీటి ప్రాజెక్టులు హాంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడులను అక్రవు ప్రాజెక్టులుగా గుర్తించాలనే సవరణ. * ప్రాణహిత - చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించాలనే ప్రతిపాదన. * విభజన అనంతర ఏర్పాటుకు పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలనే ప్రతిపాదన. * ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటుకు 50 వేల హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయాలనే సూచన. * ఉన్నత విద్యలో సమాన అవకాశాలు, ఉమ్మడి ప్రవేశాలను రెండు నుంచి ఐదేళ్లకు పరిమితం చేయాలనే ప్రతిపాదన. * సింగరేణి బొగ్గు కే టాయింపులు మూడేళ్లకే పరిమితం చేయాలనే సవరణ. * విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, శంకర్పల్లి ప్లాంటుకు గ్యాస్ కేటాయింపు ప్రతిపాదన. * తెలంగాణలో ఎయిమ్స్ తరహా సంస్థ, పశు విశ్వవిద్యాలయం ఏర్పాటు, దుగ్గిరాజ పట్నం కాకుండా రామాయపట్నంలో భారీ ఓడరేవు ప్రాజెక్టు ఏర్పాటు సూచనలు * మత్స్యకారులకు ఉపాధి హామీ పథకం వర్తింపు, ప్రత్యేక ప్యాకేజీ, తెలంగాణలో 12.5 శాతం, ఆంధ్రలో 7 శాతం మైనారిటీ సబ్‌ప్లాన్ వర్తింపు, కరీంనగర్లో టెక్స్టైల్ పార్క్, సత్తుపల్లికి బొగ్గు, నేదునూరుకు గ్యాస్ కేటాయింపు. నిజాంపట్నం పోర్టు ఏర్పాటు, విజయవాడ రవాణా హబ్‌గా తీర్చిదిద్దడవునే ప్రతిపాదనలు. -
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే: దేవేందర్
రామాయంపేట: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి పోలీస్ దేవేందర్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, భద్రాచలంపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కులు ఉండవని తెలిపారు. సోదర భావంతో విభజనకు సహకరించాలని కోరారు. ఆయనతో టీఎంవీఎస్ జిల్లా కన్వీనర్ కర్రె రమేశ్ ఉన్నారు. -
1న ఢిల్లీకి టీ జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నేతలు డిసెంబర్ 1న ఢిల్లీ వెళ్లనున్నారు. 3,4,5 తేదీల్లో మూడురోజుల పాటు అక్కడే మకాం వేసి తెలంగాణ వ్యతిరేక ప్రయత్నాలను అడ్డుకోవాలని, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు కూడగట్టాలని నిర్ణరుుంచారు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జేఏసీ ముఖ్యనేతల సమావేశం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, దేవీ ప్రసాద్, పిట్టల రవీందర్, డాక్టర్ దాసోజు శ్రవణ్ (టీఆర్ఎస్), పి.సూర్యం (న్యూ డెమొక్రసీ) తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు, వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, వాటిని అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చిం చారు. ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో అన్ని పార్టీల అధినేతలను, ము ఖ్యులను కలిసి తెలంగాణకు మద్దతు కోరుతూ వినతిపత్రాలివ్వాలని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అని, తెలంగాణ ఏర్పాటుకు కొద్దిమంది స్వార్థపరశక్తులే వ్యతిరేకమని పేర్కొంటూ ఒక సవివరమైన నోట్‌ను అందజేయూలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో తెలంగాణ విలీనం, అంతకముందు తెలంగాణ నేపథ్యం, తెలంగాణపై వివక్ష, సుదీర్ఘ ఉద్య మం, ఉద్యమంలో జరిగిన వెన్నుపోట్లు, ఉద్యమకారులపై అణిచివేత, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, రాజకీయపార్టీల వైఖరి వంటివాటిపై కూడా ఓ నోట్‌ను అన్ని పార్టీల నేతలకు ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం ఢిల్లీకి ఇదే చివరియాత్రగా భావిస్తున్న జేఏసీ ము ఖ్య నేతలు అంతా కలిసి ఒకే బోగీలో వెళ్లాలని తీర్మానించుకున్నా రు. ఇలావుండగా టీఆర్ఎస్ చేపడుతున్న దీక్షాదివస్‌కు సంఘీభావంగా ఆయూ కార్యక్రమాల్లో పాల్గొనాలని జేఏసీ నిర్ణయించింది. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలి రాష్ట్రవిభజనానంతరం భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలంటూ ఆ ప్రాంత నాయకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. డివిజన్లోని ప్రజలంతా తాము తెలంగాణలోనే కొనసాగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని, ఈ మేరకు 143 గ్రామాల ప్రజలు గ్రామసభల్లో తీర్మానం చేశారని తెలిపారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి ఆ తీర్మానాల ప్రతులను అందజేశారు. -
ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడాలి: దేవీ ప్రసాద్
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలనే ప్రతిపాదన విషయంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వీడి ఉద్యమంలోకి రావాలని, ప్రభుత్వంతో ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం రెండోరోజుకు చేరుకోగా, దేవీప్రసాద్‌తో పాటు పలువురు నేతలు దీక్షాశిబిరాన్ని సందర్శించి ఏలూరికి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా దేవీప్రసాద్ ప్రసంగిస్తూ భద్రాచలాన్ని కాజేయాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు చూస్తున్నారని ఈ కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఏలూరి చేసిన సాహసం అభినందనీయమన్నారు. పోలవరంతో రాముడిని ముంచడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణంతో అస్థిత్వం కోల్పోతామని గిరిజనులు చెబుతుంటే నిర్మించి తీరుతామని చెప్పడం సరికాదన్నారు. ఈ సమస్య ఉద్యోగులది కాదని, ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకొని మౌనం వీడి,స్పష్టమైన ప్రకటన చేయించి ఏలూరి దీక్షను విరమింపచేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ దీక్ష కొనసాగుతుందని దీనికి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏలూరి దీక్షతోనైనా ప్రజాప్రతినిధులలో చలనం రావాలన్నారు. భద్రాద్రి రాముడిని తెలంగాణ ప్రభువుగా, దేవుడిగా కొనియాడుతున్నారని, అలాంటి రాముడి జోలికి రావడం తగదన్నారు. సీమాంధ్రుల కుట్రలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. టీఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రేఛల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన ఏలూరి మళ్లీ భద్రాచలం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైరా శాసన సభ్యురాలు చంద్రావతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో పాలకు ఎదో ఒక రకంగా ప్రజలను తికమక పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఏలూరి చేస్తున్న దీక్ష అభినందనీయమన్నారు. ఎక్కువ భూభాగాన్ని దక్కించుకోవాలని సీమాంధ్రులు చూస్తున్నారని, దీనిని ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పవన్,శ్రీనివాస్,ఉద్యోగజేఏసీ అధ్యక్షప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు,నడింపల్లి వెంకటపతిరాజు,టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా ,టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగవరపు నరేంధర్,రాష్ట్ర కోశాధికారి గుంటుపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రాచలం జోలికి వస్తే సహించం : ఏబీవీపీ
జవహర్‌నగర్ :భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణనుంచి విడదీయరాదని, ఈ విషయంలో ఎలాంటి తేడా వచ్చినా సహించేది లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జవహర్‌నగర్‌లో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి జోగారామ్ మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతవాసుల అభీష్టం మేరకు డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల కుట్రల నుంచి భద్రాచలాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్ చేతకాకపోతే బీజేపీ అయినా తెలంగాణ ఇస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ సికింద్రాబాద్ జోనల్ ఇన్చార్జి రాంబాబు, జవహర్‌నగర్ అధ్యక్షుడు గోపాల్, వీహెచ్‌పీ నాయకులు సంతోష్, యోగి, రవీందర్ గౌడ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి భద్రాచలంలో బంద్
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి 72 గంటల పాటు నిరవధికంగా బంద్ పాటిస్తున్నట్లు వేదిక నాయకులు బి.వి. రమణారెడ్డి తెలిపారు. ఇందుకోసం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్హాల్లో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశారు. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాద్రిని ఆంధ్రలో విలీనం చేయాలనే కుట్రలకు నిరసనగా టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరాయి. గురువారం నాటి దీక్షలను టీజేఏసీ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించగా, టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కాగా, భద్రాచలం పరిరక్షణ పేరిట వివిధ జేఏసీలు ఏర్పడ్డాయి. రాజకీయ టీజేఏసీ అధ్యక్షుడిగా బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, వైద్యుల జేఏసీ కన్వీనర్‌గా డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు నియమితులయ్యారు. భద్రాచలం కోసం ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. తొలిసారిగా 72 గంటల బంద్... భద్రాచలం డివిజన్లో 72 గంటల పాటు నిరవధిక బంద్ నిర్వహించడం ఇదే తొలిసారి. బంద్‌కు రాజకీయ పార్టీలు, కుల, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించటంతో సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. దీంతో గురువారం పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు బారులు తీరారు. రచ్చబండ వాయిదా... మూడు రోజుల పాటు నిరవధిక బంద్ నేపథ్యంలో శుక్రవారం వెంకటాపురం మండల కేంద్ర ంలో నిర్వహించాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా భద్రాచలంను తెలంగాణలోనే ఉంచుతామనే ప్రకటన వచ్చేంత వరకూ రచ్చబండను జరుగనివ్వబోమని రాజకీయ జేఏసీ చైర్మన్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ప్రకటించారు. దీంతో డివిజన్లో రచ్చబండ్ నిర్వహణ అనుమానమేనని పలువురు అంటున్నారు. కాగా, భద్రాచలం టీజేఏసీ యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, టీజేఏసీ నాయకులు పాల్గొన్నారు. పోరాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచేలా ఉద్యమాలు చేయాల్సిన సమయం ఇదేనని, అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలో జరుగుతున్న రిలేదీక్షలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...భద్రాచలం అభివృద్ధికి భక్త రామదాసు విశేష కృషి చేశారని అన్నారు. భద్రాచలంలోని గోదావరి పరివాహక ప్రాంతం 180 కిలోమీటర్ల మేర గిరిజనులకు, జిల్లా వాసులకు అందకుండా చేయడానికి సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. భద్రాచలం లేని తెలంగాణకు అర్థం లేదన్నారు. 20వ తేదీలోపు ఈ సమస్య పరిష్కారం కాకుంటే రచ్చబండ కార్యక్రమానికి ఉద్యోగులమంతా సహాయ నిరాకరణ చేస్తామని, నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, పిడమర్తి రవి, చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎంపీడీవో రమాదేవి, సీతారాములు, వెక్కిరాల శ్రీనివాస్, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే గౌసుద్దీన్, బాబుజాన్, గోపి, ఈశ్వర్, బీజే పీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, మహిసాక్షి రామాచారి, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగలగడ్డ ముత్తయ్య, కెచ్చెల రంగారెడ్డి, కెచ్చెల కల్పన, దాసరి శేఖర్, మారుని సుబ్బారావు, యర్రంరాజు బెహరా, పడిసిరి శ్రీనివాస్‌రావు, తాళ్ల రవికుమార్, నలజాల శ్రీనివాస్, సాయిబాబా పాల్గొన్నారు.