భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి 72 గంటల పాటు నిరవధికంగా బంద్ పాటిస్తున్నట్లు వేదిక నాయకులు బి.వి. రమణారెడ్డి తెలిపారు. ఇందుకోసం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశారు. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాద్రిని ఆంధ్రలో విలీనం చేయాలనే కుట్రలకు నిరసనగా టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరాయి. గురువారం నాటి దీక్షలను టీజేఏసీ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించగా, టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కాగా, భద్రాచలం పరిరక్షణ పేరిట వివిధ జేఏసీలు ఏర్పడ్డాయి. రాజకీయ టీజేఏసీ అధ్యక్షుడిగా బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, వైద్యుల జేఏసీ కన్వీనర్‌గా డాక్టర్ ఎస్‌ఎల్ కాంతారావు నియమితులయ్యారు. భద్రాచలం కోసం ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు.
తొలిసారిగా 72 గంటల బంద్...
భద్రాచలం డివిజన్‌లో 72 గంటల పాటు నిరవధిక బంద్ నిర్వహించడం ఇదే తొలిసారి. బంద్‌కు రాజకీయ పార్టీలు, కుల, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించటంతో సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. దీంతో గురువారం పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులు బారులు తీరారు.
రచ్చబండ వాయిదా...
మూడు రోజుల పాటు నిరవధిక బంద్ నేపథ్యంలో శుక్రవారం వెంకటాపురం మండల కేంద్ర ంలో నిర్వహించాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా భద్రాచలంను తెలంగాణలోనే ఉంచుతామనే ప్రకటన వచ్చేంత వరకూ రచ్చబండను జరుగనివ్వబోమని రాజకీయ జేఏసీ చైర్మన్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ప్రకటించారు. దీంతో డివిజన్‌లో రచ్చబండ్ నిర్వహణ అనుమానమేనని పలువురు అంటున్నారు. కాగా, భద్రాచలం టీజేఏసీ యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, టీజేఏసీ నాయకులు పాల్గొన్నారు.
పోరాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు..
భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచేలా ఉద్యమాలు చేయాల్సిన సమయం ఇదేనని, అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలో జరుగుతున్న రిలేదీక్షలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...భద్రాచలం అభివృద్ధికి భక్త రామదాసు విశేష కృషి చేశారని అన్నారు. భద్రాచలంలోని గోదావరి పరివాహక ప్రాంతం 180 కిలోమీటర్ల మేర గిరిజనులకు, జిల్లా వాసులకు అందకుండా చేయడానికి సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. భద్రాచలం లేని తెలంగాణకు అర్థం లేదన్నారు. 20వ తేదీలోపు ఈ సమస్య పరిష్కారం కాకుంటే రచ్చబండ కార్యక్రమానికి ఉద్యోగులమంతా సహాయ నిరాకరణ చేస్తామని, నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, పిడమర్తి రవి, చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఎంపీడీవో రమాదేవి, సీతారాములు, వెక్కిరాల శ్రీనివాస్, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే గౌసుద్దీన్, బాబుజాన్, గోపి, ఈశ్వర్, బీజే పీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, మహిసాక్షి రామాచారి, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగలగడ్డ ముత్తయ్య, కెచ్చెల రంగారెడ్డి, కెచ్చెల కల్పన, దాసరి శేఖర్, మారుని సుబ్బారావు, యర్రంరాజు బెహరా, పడిసిరి శ్రీనివాస్‌రావు, తాళ్ల రవికుమార్, నలజాల శ్రీనివాస్, సాయిబాబా పాల్గొన్నారు.
నేటి నుంచి భద్రాచలంలో బంద్
Published Fri, Nov 15 2013 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement