* భద్రాచలం సీమాంధ్రకు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు
* సీమాంధ్ర కొత్త రాజధాని పరిశీలనకు 6 నెలలు గడువు
* రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు
* ప్రస్తుత అసెంబ్లీ స్థానాల ప్రకారమే ఎన్నికల నిర్వహణ
* ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ సీట్లు పెంపు
* అత్యధిక సవరణలను తిరస్కరించిన కేంద్ర కేబినెట్
* రాయల-టీ, హైదరాబాద్ యూటీ డిమాండ్లకు నో
రాష్ట్ర విభజనకు సంబంధించి ఖమ్మం జిల్లా భద్రాచలం పరిధిలోని కొన్ని ప్రాంతాలను సీమాంధ్ర కొత్త రాష్ట్రంలోకి చేర్చటానికి; రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వటానికి, కొత్త రాష్ట్రానికి ఆర్థికసాయం చేయటానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం అంగీకరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని సవరణలకు మంత్రిమండలి అంగీకరించింది. శాసనసభ ప్రతిపాదించిన 422 ముఖ్య సవరణలను, శాసనమండలి ప్రతిపాదించిన సవరణల్లో 322 కొన్నిటిని మాత్రమే ఆమోదించిన కేబినెట్.. అత్యధిక సవరణల ప్రతిపాదనలను తిరస్కరించింది. రాయల తెలంగాణ ఏర్పాటు, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం, రెండు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, హైదరాబాద్ ఆదాయం పంపిణీ వంటి కీలక సవరణ ప్రతిపాదనలనూ తోసిపుచ్చింది.
అంగీకరించినవివీ...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వుుంపుకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు; భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం, ఆలయం కాకుండా) మండలాలు.. రాష్ట్ర విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర పరిధిలోకి చేర్చాలని సవరణ చేర్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, పునరావాసం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే భద్రాచలం రెవెన్యూ గ్రామం, దేవాలయం ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగంగా ఉంటాయి. మరికొన్ని సవరణలిలావున్నాయి...
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం అంగీకరించినట్లుగా పరిగిణించటం జరుగుతుంది.
* విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి ప్రదేశాలు, ప్రత్యామ్నాయాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ నివేదిక అందించే కాలపరిమితిని.. తొలుత ప్రతిపాదించినట్టుగా 45 రోజులకు బదులు ఆరు నెలలకు పెంచారు.
* ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013ను ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014గా మార్చారు.
* ప్రస్తుత శాసన మండలి చైర్మన్ సీమాంధ్ర శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి చైర్మన్ ఎన్నికయ్యేవరకు ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ వుండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మండలికి సంబంధించి సభా వ్యవహారాల నిబంధనల్లో మార్పు చేర్పులు చేసేవరకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయి.
* వచ్చే సాధారణ ఎన్నికలు ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మేరకే జరుగుతాయని, ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనే సవరణను చేర్చారు. దీనిప్రకారం.. తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కు, విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు పెంచుతారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది.
* ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు చెందుతుందని, తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అది ఏర్పాటయ్యే వరకూ తెలంగాణ అవసరాలను రాష్ట్రపతి అనుమతితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వర్తించవచ్చని సవరణను కేబినెట్ అంగీకరించింది.
* వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాయుం కింద రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంది.
* విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరుల కొరత ఏర్పడకుండా కేంద్రం నుంచి ఆర్థిక సాయం ఇస్తారు.
* విభజన తర్వాత ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాల విద్యార్థులకూ సమాన అవకాశాలు కల్పించేందుకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లో ప్రస్తుతమున్న ప్రవేశాల కోటా ‘పదేళ్లకు మించకుండా కొనసాగుతుంది’ అనే చోట ‘పదేళ్ల కాలం కొనసాగుతుంది’ అని మార్చారు.
* ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీమాంధ్రలో 11 జిల్లాలకు బదులు 13 జిల్లాల పేర్ల గుర్తింపు. (అనంతపురం (2), కర్నూలు (1)ఎమ్మెల్సీ సంఖ్యను అసెంబ్లీకి వచ్చిన బిల్లులో చూపలేదు.)
* పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నెంబర్లు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రింటింగ్‌లో దొర్లిన తప్పుల సవరణ; గిరిజన తెగల పేర్లకు సంబంధించి దొర్లిన పొరపాట్ల సవరణ వంటివి అంగీకరించింది.
* రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి అడ్వైజరీ కమిటీల సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని బిల్లులో పొందుపర్చారు. దీనికిపుడు ‘భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు కేంద్రం నిర్ణయమే అంతిమం’ అని మరో అంశం చేర్చారు.
తిరస్కరించినవివీ...
* తెలంగాణ రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను విలీనం చేసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన.
* గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం (యుూటీ)గా ప్రకటించడం, ఉమ్మడి రాజధానిని ఖైరతాబాద్ మండలానికే పరిమితం చేయడం, ఉమ్మడి రాజధాని పదేళ్లుగా కాకుండా, ఎప్పుడు సీవూంధ్ర కొత్త రాజధాని పూర్తయితే అప్పుడు లేదా రెండు మూడు సంవత్సరాలకే ఉవ్ముడి రాజధాని వ్యవధిని పరిమితం చేయాలనే ప్రతిపాదనలు.
* సీమాంధ్రలో కొత్త రాజధాని, పరిపాలనా భవనాల నిర్మాణానికి కనీసం రూ. రెండు లక్షల కోట్ల ప్యాకేజీ సవుకూర్చాలనే సవరణ.
* ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణకు సంబంధించి గవర్నర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం మేరకు నడుచుకోవాలనే ప్రతిపాదన.
* గవర్నర్ సలహాదారుల్లో ఒకరు కనీసం ఎస్సీ/ఎస్టీ ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను కలిపి ఒకే ఉవ్ముడి కమిషనరేట్ ఏర్పాటు చేయూలి, గవర్నర్ సచివాలయాన్ని బలోపేతం చేయూలి, అక్టోపస్/గ్రే హౌండ్స్‌ను డీజీపీ ఆధీనంలో ఉంచి గవర్నర్ అధికార పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన.
* తెలంగాణ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను 40 నుంచి 50కి పెంచాలనే ప్రతిపాదన.
* తెలంగాణ హైకోర్టును మూడు నెలల్లో ఏర్పాటు చేయూలనే ప్రతిపాదన.
* ప్రణాళిక సంఘం గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వ అదనపు నిధులు సహా హైదరాబాద్ ఆదాయాన్ని పది సంవత్సరాలపాటు ఇరు ప్రాంతాలకు పంపిణీ చేయూలనే ప్రతిపాదన.
* నిజాం ఆస్తులకు సంబంధించి ఎపీ భవన్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్‌కు కొంత స్థలాన్ని కేటాయించడం.. అనే ప్రతిపాదనలు.
* ఆయా ప్రాజెక్టుల ఫలితాలను అనుభవిస్తున్న ప్రాంతాలే సంబంధిత రుణ భారాన్ని భరించాలనీ, 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పర్యటించాలనే ప్రతిపాదనలు.
* ప్రభుత్వ రంగ సంస్థలు తక్షణమే వేరుపడాలనే ప్రతిపాదన.
* స్థానికత ఆధారంగా పెన్షన్ చెల్లింపులు జరపాలనే ప్రతిపాదన.
* కృష్ణా, గోదావరి నదీ జలాల యజమాన్య నిర్వహణకు అపెక్స్ కౌన్సిల్ ఉండకూడదనే ప్రతిపాదన. కృష్ణాపై చేపట్టిన వరద నీటి ప్రాజెక్టులు హాంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడులను అక్రవు ప్రాజెక్టులుగా గుర్తించాలనే సవరణ.
* ప్రాణహిత - చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించాలనే ప్రతిపాదన.
* విభజన అనంతర ఏర్పాటుకు పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలనే ప్రతిపాదన.
* ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటుకు 50 వేల హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయాలనే సూచన.
* ఉన్నత విద్యలో సమాన అవకాశాలు, ఉమ్మడి ప్రవేశాలను రెండు నుంచి ఐదేళ్లకు పరిమితం చేయాలనే ప్రతిపాదన.
* సింగరేణి బొగ్గు కే టాయింపులు మూడేళ్లకే పరిమితం చేయాలనే సవరణ.
* విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, శంకర్‌పల్లి ప్లాంటుకు గ్యాస్ కేటాయింపు ప్రతిపాదన.
* తెలంగాణలో ఎయిమ్స్ తరహా సంస్థ, పశు విశ్వవిద్యాలయం ఏర్పాటు, దుగ్గిరాజ పట్నం కాకుండా రామాయపట్నంలో భారీ ఓడరేవు ప్రాజెక్టు ఏర్పాటు సూచనలు
* మత్స్యకారులకు ఉపాధి హామీ పథకం వర్తింపు, ప్రత్యేక ప్యాకేజీ, తెలంగాణలో 12.5 శాతం, ఆంధ్రలో 7 శాతం మైనారిటీ సబ్‌ప్లాన్ వర్తింపు, కరీంనగర్‌లో టెక్స్‌టైల్ పార్క్, సత్తుపల్లికి బొగ్గు, నేదునూరుకు గ్యాస్ కేటాయింపు. నిజాంపట్నం పోర్టు ఏర్పాటు, విజయవాడ రవాణా హబ్‌గా తీర్చిదిద్దడవునే ప్రతిపాదనలు.
కొన్ని సవరణలకు ఓకే
Published Sat, Feb 8 2014 3:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement