గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడులా?: కేటీఆర్
ఫిరాయింపులపై కోర్టు తీర్పు వచ్చిన రోజే అరికెపూడికి పీఏసీ పదవి ఎలా ఇచ్చారు?
అరికెపూడి ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్
గచ్చిబౌలి (హైదరాబాద్): చేతకాని ముఖ్యమంత్రి ఉండటం వల్ల రాష్ట్రానికి దౌర్భాగ్యం దాపురించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై సీఎం రేవంతే గూండాలను దాడికి పురిగొల్పారని ఆరోపించారు.
శనివారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ పద్ధతులకు తిలోదకాలు ఇస్తూ.. ఫిరాయింపులపై కోర్టు తీర్పు వచ్చిన రోజే స్పీకర్ కార్యాలయం అరికెపూడి గాందీని పీఏసీ చైర్మన్‌గా నియమించడం ఏమిటి? ఇది సాంప్రదాయాలకు విరుద్ధం కాదా?
కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఉండటంతోనే ఇలా చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలి. కాంగ్రెస్ విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన అరికెపూడి గాంధీ.. పీఏసీ చైర్మన్‌గా నియామకం కాగానే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ తీరును ప్రశి్నస్తూ.. ఏ పార్టీలో ఉన్నావని మా వాళ్లు ప్రశ్నించడం తప్పా?’’అని ప్రశ్నించారు.
ఇలాంటి గూండాగిరీ ఎన్నడూ లేదు
‘‘ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ భారీగా గూండాలను వెంటేసుకుని.. డీసీపీ, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, పోలీసుల ఎస్కార్టులో భారీ కాన్వాయ్‌గా రావడం.. గేటెడ్ కమ్యూనిటీలో దౌర్జన్యం చేయడం ఏమిటి? పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఒక్కటైనా చోటు చేసుకున్నాయా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే దాడికి గూండాలను ఉసిగొల్పిన దౌర్భాగ్యపు, చరిత్ర హీనమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమ వాళ్లేనని.. గత పదేళ్లలో ఒక్క ప్రాంతీయ విద్వేష ఘటన జరగలేదని గుర్తు చేశారు.
నీలాంటోళ్లను చాలామందిని చూశాం
రాష్ట్రంలో నెలలో 28 హత్యలు జరిగినట్టు పత్రికల్లో వచ్చిందని.. రాష్ట్రానికి ఏమయిందనే ఆందోళన వ్యక్తమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి ఎవరో తెలియదని, సీఎం 22 సార్లు ఢిల్లీకి వెళ్లినా చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి చాలా మంది పెద్ద నాయకులను చూశాం. వారి కంటే చాలా చిన్నోడివి. నీలాంటి బుల్లబ్బాయ్, చిట్టి నాయుళ్లను చాలా మందిని చూశాం..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
త్వరలో ‘పాలమూరు’ సందర్శన
సాక్షి, నాగర్‌కర్నూల్: మేడిగడ్డ తరహాలో త్వరలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ బృందం సందర్శిస్తుందని కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందినే నేపథ్యంలో.. కేటీఆర్ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం నేరళ్లపల్లిలో మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, ఇంకా పది శాతం పనులే మిగిలి ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. రూ.5 వేల ఖర్చుతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంటుందని.. కానీ సీఎం రేవంత్ తొమ్మిది నెలలుగా పాలమూరు ప్రాజెక్ట్‌ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే తొక్కిపెడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment