సీఎం రేవంత్ వ్యాఖ్యల వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు: హరీశ్‌రావు
రాష్ట్రానికి ఉన్న మంచిపేరును మంటగలుపుతున్నారని మండిపాటు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి దారుణమని వ్యాఖ్య
శివ్వంపేట (నర్సాపూర్): తెలంగాణలో ప్రజా పాలన కాకుండా గూండారాజ్ నడుస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి స్వగ్రామం గోమారంలోని ఆమె ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు.
ఆదివారం అర్ధరాత్రి గోమారంలోని సునీతారెడ్డి నివాసం వద్ద బాణసంచా కాలుస్తూ, ఇటుకలు విసురుతూ కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం, ఆ సమయంలో బీఆర్‌ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య గొడవ జరగడం నేపథ్యంలో.. హరీశ్‌రావు సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు. సునీతారెడ్డి నివాసాన్ని పరిశీలించి, స్థానిక నేతల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే..
సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరుగుతు న్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలోని తన కార్యాలయంపై, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై, ఇప్పుడు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులతో దాడులు చేయించారని మండిపడ్డారు.
గోమారంలో బీఆర్‌ఎస్ వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తున్న విషయం వీడియో లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి దాడులతో తెలంగాణ కు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారని మండిపడ్డారు.
బాణసంచా పేల్చి.. ఇటుకలు విసిరి!
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామమైన శి వ్వంపేట మండలం గోమారంలో ఆదివారం రాత్రి వినాయక శోభాయాత్ర నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో ఈ యాత్ర ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్దకు చేరుకుంది. ఈ సమయంలో కొందరు బాణసంచా కాల్చుతూ ఆమె ఇంటిపైకి విసిరారు. కొందరు ఇటుకలు విసిరారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. అక్కడ కాపలాగా నిద్రిస్తున్న పలువురు యువకులు బాణసంచా, ఇటుకలు విసురుతున్నవారిని అడ్డుకోవడానికి ప్రయత్నించా రు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు వెంటనే సునీతారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
పథకం ప్రకారమే దాడి: సునీతారెడ్డి
కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే ఆదివారం అర్ధరాత్రి తన ఇంటిపై దాడి జరిగిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. తన ఇంటి వద్దకు వినా యక శోభాయాత్ర రాగానే.. పథకం ప్రకారం ఇంటిపైకి బాణసంచా విసురుతూ, రాళ్లతో దాడి చేశా రని చెప్పారు.
ఇంట్లో పడుకున్న వారిని కొట్టారని.. అడ్డువచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment