ప్రభుత్వం దీపావళి కానుక
2022, జూలై 1 నుంచి వర్తింపు.. బకాయిలు పీఎఫ్ ఖాతాకు జమ
మార్చి 2025లోపు రిటైరయ్యే వారికి 17 వాయిదాల్లో చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు దీపావళి కానుక ఇచ్చింది. మంత్రివర్గం ఆమోదం మేరకు 3.64% కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డీఏను డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం 22.75%గా ఉన్న డీఏ 26.39 శాతానికి పెరగనుంది.
2022, జూలై 1 నుంచి ఈ డీఏ వర్తిస్తుందని, ఇందుకు సంబంధించిన బకాయిలను (జూలై 1, 2022 నుంచి అక్టోబర్31, 2024 వరకు) ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలో జమ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, మార్చి 31, 2025లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు 17 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.
2004, సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే డీఏలో 10 శాతం వారి ‘ప్రాన్’ (పరి్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) అకౌంట్లలో జమ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరి, 2025 వేతనం నుంచి మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు.
పీఎఫ్ ఖాతాలు లేని కాంటిజెంట్ ఉద్యోగులకు కూడా 2025, జనవరి నెల వేతనంతో మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. ఒకవేళ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ డీఏను ఒకేసారి చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల డీఏలను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment