మీట్ ది మీడియా కార్యక్రమంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైతే అదృంగా రెండు గంటలు పనిచేస్తామని టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడి పించేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, వచ్చే ఐదేళ్లు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఎన్జీవో వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం, అందుకు పూనుకున్న పాలకులే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ, ఆత్మగౌరవపోరాటం చేశామని, ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.
ఈ క్రమంలో హైదరాబాద్ స్టేట్ సర్కారీ ములాజిం యూనియన్ (ప్రస్తుత టీఎన్జీవోస్) తెలంగాణకు చెందిన అన్ని రంగాల ఉద్యోగులను కలుపుకొని పోరాటం చేసిందని, 1952లోనే మొదటిసారి ఫజల్‌అలీ కమిషన్ ముందు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిందన్నారు. రాజకీయ పార్టీలు కలసి రాకపోయినా, ఉద్యోగులతోపాటు అప్పటి నుంచే విద్యార్థులు కలసి వచ్చారని, 1969 ఉద్యమం విద్యార్థుల పాత్ర మరువలేదన్నారు. 369 మంది విద్యార్థుల బలిదానాలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో వారి కుటుంబాలకు స్వాతంత్య్ర సమరయోధుల కు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తాము ఒకరోజు వేతనం ఇస్తామని, కోదండరాం నేతృత్వంలో ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివి ధ అంశాలు, విధానాలపై 21 అంశాలతో నివేదిక రూపొం దించామని, దాని అమలుకు కృషి చేస్తామని సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు దేవీప్రసాద్ ఇచ్చిన సమాధానాలు పునర్నిర్మాణమంటే.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే. ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే.
మొత్తం మంజూరైన పోస్టులను తీసుకొని 58 శాతం పోస్టులను సీమాంధ్రకు కేటాయించాలి. వాటిల్లోకి ప్రస్తుతం ఉన్న సీమాంధ్రులను పంపించాలి.
ఆ తరువాతే తెలంగాణకు ఉద్యోగులకు కేటాయించాలి. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది.
60వేల వరకు ఖాళీలు వస్తాయి. వాటిల్లో తిష్టవేసిన వారిని ఆంధ్రాకు పంపించాలి.
తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో డీఎస్సీల ద్వారా భర్తీ చేస్తుంది. తద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయి.
విభజనలో గిర్‌గ్లానీ కమిటీ సిఫారసులను అమలు చేయాలి.
మేం రాజకీయాల్లోకి ఇప్పుడే రాము. మా ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణమే.