
విభజన హక్కు.. సమైక్యం భావనే : కోదండరాం
సాక్షి, హైదరాబాద్: విభజన అనేది హక్కు అయితే సమైక్యం అనేది భావన మాత్రమేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం టీఎన్‌జీఓ భవన్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అయినట్టేనని చెప్పారు. కేబినెట్ ఆమోదంపై సంతోషంగా ఉన్నామన్నారు. నోట్‌ను స్టీరింగ్ కమిటీ భేటీలో సంపూర్ణంగా అధ్యయనం చేశామని, అది పూర్తి సంతృప్తికరంగా ఉందని అన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, పార్లమెంటులో బిల్లు నెగ్గుతుందని అన్నారు.
రాష్ట్ర విభజన తథ్యం అని ఆంధ్రా ప్రజలు అర్థం చేసుకోవాలని కోదండరాం సూచించారు. తెలంగాణ ప్రజల పోరాటం హక్కుల కోసమని, అయితే తెలంగాణ ప్రజలపై హక్కుల కోసం సీమాంధ్రులు పోరాడుతున్నారని వివరించారు. జేఏసీ నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఖాయమైపోయిన ఈ తరుణంలో ఇంకా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ఎవరికీ మంచిదికాదని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీఓలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెకు దూరంగా ఉంటున్న ఉద్యోగులను కొందరు ఏపీఎన్‌జీఓ నేతలు బెదిరిస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు.
జేఏసీ నేతలు రాజేశ్వర్‌రావు(బీజేపీ), డాక్టర్ దాసోజు శ్రవణ్(టీఆర్‌ఎస్), పి.సూర్యం(న్యూ డెమొక్రసీ), కె.గోవర్ధన్(న్యూ డెమొక్రసీ-చంద్రన్న) మాట్లాడుతూ తెలంగాణపై నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ తరుణంలో ఇంకా ఇరుప్రాంతాల మధ్య విద్వేష పూరిత వాతావరణం పెరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే తెలంగాణ బిల్లును పెట్టి, ఆమోదించాలని వారు కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణ నోట్‌ను కేంద్రం ఆమోదించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి త్వరలో ఢిల్లీకి వెళ్లాలని జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.
దేవీ ప్రసాద్‌ను నిలదీసిన రఘు ఇప్పటిదాకా తెలంగాణకోసం పోరాడుతూ, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న తెలంగాణ ఉద్యోగుల్లో విభజను తెస్తారా అంటూ టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కంచర్ల రఘు నిలదీశారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలైన 1104, 327 ఇప్పటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాయని రఘు వివరించారు. అలాంటి సమైక్య సంఘాలు పెట్టుకునే సభలకు టీఎన్‌జీఓ అధ్యక్షునిగా దేవీ ప్రసాద్ వెళ్తే తెలంగాణకోసం ఇప్పటిదాకా కష్టపడిన వారికి ఎలాంటి సంకేతాలను ఇవ్వాలనుకుంటున్నారని రఘు నిలదీసినట్టుగా సమాచారం.
ఈ విజయం అమర వీరులకు అంకితం: కోదండరాం
తెలంగాణ అమరవీరుల త్యాగం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సాధ్యమైందని కోదండరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద శుక్రవారం ఆయన నివాళులర్పించారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు.