-టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్
హన్మకొండ(వరంగల్ జిల్లా)
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ కోరారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో టీఎన్జీవోస్ యూనియన్ క్యాలెండర్‌ను సోమవారం అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ముత్తుసుందరం, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణ నుంచే ఈ పోరాటం ప్రారంభం కానుందన్నారు. దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేయనున్నట్లు వివరించారు. ఈ ధర్నాలో రోజుకు మూడు రాష్ట్రాల చొప్పున ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరి 14, 15 తేదీలలో కేరళలోని తిరుచూరులో ఉద్యోగుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ మహిళా సదస్సులో 12 అంశాలతో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్‌లోని అంశాలను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి అమలు కోసం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, నగర అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.