హైదరాబాద్: విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల ఉద్యమానికి నిరసనగా జేఏసీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణవాదులు ఇక్కడ తమ ఆందోళనను ఉధృతం చేశారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జెఎసి చైర్మన్ కోదండరాం, టిఆర్ఎస్ నేత హరీష్‌రావు, బిజెపి నేత నాగం జనార్ధన రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద నినాదాలు మిన్నంటాయి. వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ శవయాత్రలు నిర్వహిస్తే, మరి కొన్నిచోట్ల పిండప్రధానాలు, తలనీలాలను సమర్పించడం చేశారు. కొందరు రాష్ట్ర విభజనకు కారకులైన వారి చిత్రపటాలను
గాడిదలపై ఊరేగించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.రోజురోజుకు సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న నేపధ్యంలో తెలంగాణలో కూడా జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ జేఏసీ ఆందోళన
Published Mon, Aug 5 2013 2:18 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement