నరక యాతన
తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఉండడానికి గూడు లేదు. కనీసం చంటిపిల్లల కడుపునింపేందుకు పాలకు కూడా కొరత ఏర్పడింది. రవాణా సౌకర్యానిదీ అదే పరిస్థితి.. ఇలా భీతావహ పరిస్థితుల్లో జిల్లా గొల్లుమంటోంది. హుదూద్ చేసిన పెనుగాయం నుంచి ఇంకా ప్రజలు తేరుకోలేదు. జిల్లాలో తుపాను విలయతాండవం చేసి మూడు రోజులు గడిచినా పరిస్థితి అలాగే ఉంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. రోగులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. గాలి లేక పసిపాపలకు ఊపిరాడడం లేదు. ఉన్నవాళ్లు జనరేటర్లపై ఆధారపడుతుండగా...పేదలు అంధకారంలో మగ్గిపోతున్నారు.
జీవనోపాధి ఛిద్రమైన బడుగులు వీధిన పడ్డారు. కనీసం సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వీల్లేకపోవడంతో దూర ప్రాంతంలో ఉన్న ఆప్తులకు తమ క్షేమ సమాచారం చెప్పలేక, వారి వివరాలు తెలుసుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఇదే అదనుగా వ్యాపారులు కూడా భారీగా రేట్లు పెంచి దొరికినంత లాగేస్తున్నారు. ఇక నిత్యావసరాల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి ధరలకు రెక్కలొచ్చాయి. తీరప్రాంతంలోనైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాకాసి అలల తాకిడికి గూళ్లన్నీ కొట్టుకుపోవ డంతో రెక్కలు తెగిన పక్షుల్లాగా విలవిలలాడిపోతున్నారు. మూడు రోజులుగా వారు నరకం చూస్తున్నారు. సర్వం కోల్పోయిన మత్స్యకారులు వేరే దిక్కులేక బిక్కుబిక్కు మంటూ ఇంకా పునరావాస కేంద్రాల్లో కాలంవెళ్లదీస్తున్నారు. సహాయక, పునరుద్ధరణ చర్యలు అంతంమాత్రంగా సాగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుదూద్ తుపాను తీవ్ర నష్టంతో పాటు కష్టాన్ని మిగిల్చింది. ప్రచండ గాలులకు, భారీ వర్షానికి జరిగిన విపత్తు నుంచి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఆ రెండు రోజుల పాటు విరుచుకుపడి గాలి రాకాసి సృష్టించినవిధ్వంసం జిల్లావాసులను వెంటాడుతోంది. యథాతథ పరిస్థితులు ఎప్పటికి వస్తాయో అని ఎదురుచూస్తున్నారు. భారీ నష్టాన్ని ఎలాగూ పూడ్చలేం, కనీసం కష్టాలనైనా అధిగమించి ముందుకు వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా.. పరిస్థితులు అనుకూలించడం లేదు. తాగ డానికి నీరు దొరకడం లేదు. తినడానికి సరైన తిండిలేదు. దొరికినా వాటి ధరలు కూడా గూబగుయ్‌మనేలా ఉన్నాయి. ఇక విద్యుత్ సరఫరా లేక పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అష్టకష్టాలు పడుతున్నారు. అంధకారంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఓ వైపు బురదనీరు, మరోవైపు దోమల బెడద వెరసి అన్నివర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
అంచనాలకు అందని నష్టం
హుదూద్ తుపాను నష్టం అంతా, ఇంతా కాదు. అంచనా వేయడానికి వీల్లేనంతగా ఉంది. అధికారులు కచ్చితమైన నివేదిక ఇవ్వ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరోజు ఇచ్చిన నివేదికకు, తర్వాత రోజు ఇచ్చిన నివేదికకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. రోజు రోజుకూ వెలుగులోకి వస్తున్న నష్టాల వివరాలు చూస్తుంటే ఇంత విపత్తు జరిగిందా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊహకందని నష్టాన్ని చూసి వివిధ జిల్లాల్లో పనిచేసి ఇక్కడకు వచ్చిన అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ రెండురోజులు ఎలా ఉన్నారో అని తోటి అధికారుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇప్పటివరకూ అధికారుల దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం హుదూద్ మిగి ల్చిన నష్టం రూ.వెయ్యి కోట్లుపైబడే. అధికారులు సైతం అవునంటున్నారు. కాకపోతే అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బం దులొస్తాయని ఆలోచిస్తున్నారు.
11 మండలాలకు కోలుకోలేని దెబ్బ
జిల్లాలో ప్రధానంగా భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, లక్కవరపుకోట, గంట్యాడ, జామి, ఎస్.కోట, డెంకాడ, బొ ండ పల్లి, మెంటాడ, కొత్తవలస మండలాల్లో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. జిల్లా వ్యాప్తంగా 385 గ్రామాల్లో తీవ్ర నష్టం వా టిల్లింది. ఈదురుగాలులకు, భారీవర్షాలకు జిల్లా వ్యాప్తంగా 14 వేల ఇళ్లు కూలిపోయాయి. దాదాపు అన్ని మండలాల్లో ఇళ్లు దెబ్బ తిన్నాయి.
అత్యధికంగా పూసపాటిరేగలో 4,559, భోగాపురంలో 3,479, విజయనగరంలో వెయ్యి, కొత్తవలసలో 869 ఇళ్లు కూలి పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ న ష్టం అంచనా వేయలేని విధంగా ఉంది. దాదాపు 80 వేల హెక్టార్లలో వరి, చెరకు, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. వీటి విలువ రూ.350 కోట్లు పైబడి ఉండవచ్చని అధికారిక వర్గాలు అంచనా వే స్తున్నాయి. ఉద్యానపంటలు కూడా అదేస్థాయిలో ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం కొబ్బరి, అరటి, కూరగాయలు తదితర పంటలు దాదాపు రూ. 25 కోట్లు మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పట్టు పరిశ్రమకు సుమారు రూ3కోట్ల పైబడి నష్టం వాటిల్లింది. మత్స్యకారులకు సంభవించిన నష్టం కూడా అంతకంతకు ఎక్కువవుతోంది. 363 బోట్లు, 1270 వలలు కొట్టుకుపోగా, పెద్ద ఎత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 1600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
పెరుగుతున్న మరణాల సంఖ్య
మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇప్పటివరకు ఎనిమిది మంది వృతి చెందినట్టు అధికారుల దృష్టికి రాగా, పలువురు అదృశ్యమయ్యారు. చనిపోయిన వారి జాబితాలో తాజాగా నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందిన పంతగడ ప్రతాప్, పాచి పెంట మండలం తంగలాంకు చెందిన జమ్మి చిన్నయ్య చేరారు. పశు, పక్ష్యాదులు కూడా పెద్ద ఎత్తున మృత్యువాతపడ్డాయి. 1100 వరకూ గేదెలు, 2600 మేకలు, 4200 కోళ్లు మృతిచెందాయి. వీటికారణంగా ఇతర పశువులకు వ్యాధులు సోకేప్రమాదం ఉంది. తక్షణమే వ్యాక్సినేషన్ చేయకపోతే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
విద్యుత్ శాఖకు జరిగిన నష్టం లెక్కలేనంగా ఉంది. ఇప్పటి వరకు 10వేల విద్యుత్ స్తంభాలు, 520 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరిం చేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. సిబ్బంది కొరత, సరిపడా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడంతో పునరుద్ధరణ చర్యల్లో జాప్యం నెలకొంది. వేరే జిల్లాల నుంచి వస్తే తప్ప పునరుద్ధరణ జరిగే పరిస్థితి కన్పించడం లేదు. ముఖ్యంగా నేలకూలిన చెట్లు ఆటంకంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20వేల చెట్లు కూలడంతో పునరుద్ధరణచర్యలకు అడుగుడుగనా ఆ టంకాలుఎదురవుతున్నాయి.
సాగునీటి వ్యవస్థకు భారీ నష్టం
జిల్లాలో సుమారు 1000 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. అలాగే 550 చెరువులకు గండ్లు పడ్డాయి. 484 కిలోమీటర్ల ఆర్ అండ్‌బీ రోడ్లు, 325 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, మున్సిపాల్టీల పరిధి లో 36 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, మున్సిపాల్టీల పరిధిలో మరో 150 ఆస్తులకు నష్టం సంభవించింది.
తేరుకోని విజయనగరం పట్టణం
విధ్వంసం నుంచి విజయనగరం పట్టణం తేరుకోలేకపోతోంది. దారిపొడవునా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో అటు ప్రభుత్వ కార్యాలయాలు, ఇటు జనావాసాలకు వెళ్లేందుకు దారీ తెన్నూలేకుండా పోయింది. దీంతో కార్యకలాపాలు నత్తనడకగా సాగుతు న్నాయి. సినిమా థియేటర్ల ప్రదర్శనలు నేటికీ పున ప్రారంభం కాలేదు. బ్యాంకులు తెరుచుకోవడం లేదు. కొన్ని పెట్రోల్ బంకులే పనిచేస్తున్నాయి. మిగతావన్నీ పునరుద్ధరణ దిశగా ఉన్నాయి. తాగునీటికి, నిత్యావసర వస్తువులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మంచినీరు తెచ్చుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు 175 తాగునీటి పథకాలైతే ఇప్పట్లో పనిచేసే పరిస్థితులు లేకపోగా, మిగతా మంచినీటి పథకాలకు విద్యుత్ లేక నీరందించలేకపోతున్నాయి. తాగునీటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
దిగ్బంధంలో గ్రామాలు
కూలిన చెట్లు, కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో అనేక గ్రామాలు దిగ్బంధనంలో ఉన్నాయి. విజయనగరం, పూసపాటి రేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, ఎస్‌కోట, జామి తదితర మండలాల్లో అనేక గ్రామాలు ఇప్పటికీ దారీతెన్నూ లేక ఇబ్బందులు పడుతున్నాయి.