కూలిలోనూ కక్కుర్తి !
విజయనగరం మున్సిపాలిటీ: పదిహేను రోజులుగా ఇల్లూ వాకిలి వదిలి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన విద్యుత్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. హుదూద్ తుపాను అనంతరం జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థను సరి చేయటంలో వారు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు కూడా. అయితే పలువురు అధికారులు ఈ కష్టజీవుల పొట్ట కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనంలో చేతివాటం ప్రదర్శించి తక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా వారికి చెల్లించవలసిన రూ.50 లక్షల రూపాయలను అధికారులు తమ జేబులో వేసుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణకు ప్రత్యేక కమిటీని వేశారు.
హుదూద్ బీభత్సంతో జిల్లాలో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. ప్రజలంతా చాలాకాలం పాటు అంధకారంలోనే గడిపారు. ఇలాంటి సమయంలో జిల్లాలో వెలుగులు నింపేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మనరాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. వారి కష్టం ఫలితంగానే జిల్లాలో చీకట్లు తొలిగాయి. పనులు చేపడుతున్న సిబ్బంది వేతనాలు, భోజనాలతో పాటు పనుల్లో వినియోగిస్తున్న యంత్రాల కోసం ఇప్పటి వరకు రూ.5.09 కోట్లు ఖర్చు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కష్టించి పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన రోజు వారీ వేతనాల విషయంలో కొందరు అధికారులు కక్కుర్తి పడుతున్నారు.
మాయమాటలు చెప్పి ఇవ్వాల్సిన వేతనం కన్నా రూ. రెండు వందలు తక్కువగా చెల్లిస్తున్నారు. జిల్లాలో 83 సబ్‌స్టేషన్ల పరిధిలో ఆయా ఏఈలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులను నోడల్ అధికారులుగా నియమించి పనులు నిర్వహిస్తున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పనులను దగ్గరుండి పరిశీలించటంతో పాటు పని చేసే కూలీలకు వేతనాలు, భోజనాలు సమకూర్చాల్సి ఉంది. ఇందులో భాగంగా శాఖాపరంగా ఒక్కో కూలికి రూ.650 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇందులో సిబ్బంది భోజనానికి రూ.150 చెల్లిస్తుండగా... వేతనం కింద రూ.500 ఇస్తున్నారు. అయితే ఈ వేతనాల చెల్లింపుల్లో సబ్‌స్టేషన్ పరిధిలోని నోడల్ అధికారులు, ఏఈలు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు తొలుత 2,200 మంది హాజరుకాగా ఇప్పుడా సంఖ్య 3,297కు పెరిగింది. ఒడిశా రాష్ట్రంతో పాటు ఏపీడీసీఎల్, విజయవాడ, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి సిబ్బంది వచ్చి జిల్లాలో పనులు చేపడుతున్నారు.
ఇందులో ఒడిశాకు సంబంధించిన సిబ్బందికి మన వంటకాలు పడకపోవటంతో వారే స్వయంగా పని ప్రదేశంలో వంటలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి అధికారులు నిర్దేశించిన ప్రకారం రూ.650 చెల్లించాల్సి ఉంది. అదే భోజనాలు అధికారులు పెడితే రూ.500 చొప్పున చెల్లించాలి. కానీ ఒడిశా వాసులకు భోజనం పెట్టకుండానే రూ.450, భోజనాలు పెడుతున్న ఇతర ప్రాంత వాసులకు రూ.300 చొప్పున ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై పలువురు సిబ్బంది జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకు వస్తే తమకు ఇచ్చే కూలిని దోచుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఇదే విషయమైన జిల్లాలో పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న విశ్రాంత సీఎండీ రంగనాథం వద్ద సాక్షి ప్రస్తావించగా... ఈ విషయంపై తమ వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపై నలుగురు అధికారుల కమిటీగా ఏర్పాటు చేసిన విచారణ చేస్తున్నామని తెలిపారు. బృందం మంగళవారం నుంచి వేతనాల చెల్లింపులపై ఆరా తీస్తోందని, కూలీలకు అన్యాయం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలా కానీ జరిగితే విజెలెన్స్ విచారణ వేయిస్తామన్నారు.