మళ్లీ జన్మభూమి
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపాను సందర్భంగా నిలిచిపోయిన జన్మభూమి గ్రామసభలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రకటించిన షెడ్యూల్ గ్రామాలు, వార్డులలో శనివారం నిర్వహించిన గ్రామసభల్లో మళ్లీ జన్మభూమిపింఛను దారులు, డ్వాక్రా మ హిళలు నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలను నిలదీశారు. ఎన్నికల సందర్భంగా మాయ మాటలు చెప్పి చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి వృద్ధులకు, విక లాంగులకు అందుతున్న పింఛన్లను ఎందుకు ఆపేస్తున్నారని నిలదీశారు. ప్రజల ఆవేదన ఆగ్రహంగా మారడంతో జన్మభూమి గ్రామసభల్లో పాల్గొన్న నాయకులు తెల్లమొహం వేశారు. ఎస్.కోటలోని సీతారాంపురం, గోపాలపల్లి గ్రామాల్లో డ్వాక్రా రుణాలు, పింఛన్ల కోసం ప్రజలు నిలదీశారు. ఐకేపీ ఏపీఎం ప్రగతి నివేదిక చదువుతుండగా మాకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు.
మాఫీ చేయకపోయినా రుణాలు చెల్లించాలంటూ ఎందుకు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారని ఇప్పుడు కనిపించడం లేదని సంగంపూడి రమణ తదితరులు అసహనం వెలిబుచ్చారు. సీతారాంపురంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రసంగిస్తుండగా కరక గంగునాయుడు అనే వికలాంగుడు లేచి మాలాంటి వారికి కూడా పింఛన్లు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. సదరం ధ్రువపత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయడంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఏదో సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. బొబ్బిలి మండలంలోని ఎం బూర్జి వలసలో చుక్క జగన్మోహనరావు అనే యువజన సంఘం నాయకుడు సమీపంలోని గ్రోత్ సెంటర్ వల్ల గ్రామం, పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని, దీనికి పరిష్కార మార్గాలు ఎందుకు చూపడం లేదని అధికారులను నిలదీశాడు.
విజయనగరంలో.. గీతకు చుక్కెదురు
మండలంలోని గుంకలాంలో జరిగిన గ్రామసభలో ఎంఎల్‌ఏ మీసాల గీతకు చుక్కెదురైంది. ఈ గ్రామంలో 64 మంది అర్హులకు పింఛన్లు రాజకీయంగా తొలగించడంతో జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. పింఛన్లు కొనసాగిస్తామని స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేకుంటే సభను జరగనీయమని గ్రామస్తులు భీష్మించారు. ఈ రసాభాసను చూసిన అధికారులు ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ సీఈఓ మోహనరావుకు ఫోన్‌లో సమాచారమందించడంతో వారు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అయినా గ్రామస్తులు వినిపించుకోకపోవడంతో ఎంఎల్‌ఏ ఆగ్రహిస్తూ పింఛన్లు పోయిన వారే మాట్లాడాలని లేనివారు నోరెత్తొద్దని అనడంతో ప్రజలంతా మండిపడ్డారు. పండు ముదుసలి, వికలాంగులకు పింఛన్లు రద్దు చేస్తే మాట్లాడొద్దా? అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ మొత్తం గందరగోళమైంది. తెలుగు దేశం పార్టీకి ఓట్లేయలేదనే కారణంతోనే జెడ్పీటీసీ సభ్యుడు అర్హుల పేర్లు తొలగించారని అధికారులు, ఎమ్మెల్యేను నిలదీశారు. అనంతరం ఎంఎల్‌ఏ ప్రభుత్వం ప్రగతి గురించి మాట్లాడుతుండగా మా పింఛన్ల సంగతి లేకుండా ఆ సోదంతా మాకెందుకంటూ గుసగుసలాడారు. అలాగే జిల్లాలోని నెల్లిమర్ల, ఎస్‌కోట, చీపురుపల్లి, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జరిగిన పలు గ్రామసభలు ప్రజల నిరసనలు, నిలదీతలతోనే సాగాయి.