విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా ప్రజలు శుక్రవారం నరకం చవిచూశారు. రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పల్లె, పట్టణమనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు అవస్ధలు పడ్డారు. ప్రతీ శుక్రవారం విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం పగటి సమయమంతా అధికారులు అధికారిక విద్యుత్ కోత విధించగా సాయంత్రం 5.15 గంటల నుంచి ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అత్యవసర కోత విధించారు. దీంతో ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పరవాడలో సాంకేతిక సమస్య
పగలంతా విద్యుత్ నిర్వహణ పనుల పేరిట అధికారులు సరఫరా నిలిపివేసి, తిరిగి పునురుద్ధరించే సమయంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట కోత విధించడంతో జిల్లా ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.విశాఖ జిల్లా పరవాడలో గల హిం దూజా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నెలకొన్న సాంకేతిక సమస్యతో విద్యుత్ ఉత్పత్తి 28 వందల మెగావాట్ల నుంచి 15వందల మెగావాట్లకు పడిపోవడంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోత విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని పట్టణాలు... గ్రామాలనే తేడాలేకుండా... సాయంత్రం 5.15 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో, 7.15గంటల నుంచి మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తరచూ కోతలు:
వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తిలో మిగులు స్థానంలో ఉన్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా... ఎప్పుడు పడితే అప్పుడే కోతలు అనివార్యంగా మారుతున్నాయి. ప్రభుత్వం సాంకేతిక సమస్యలను అధిగమించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో సుమారు ఆరు లక్షల విద్యుత్ సర్వీసులుండగా, నెల రోజులగా అధికారికంగా, అనధికారికంగా విధిస్తున్న విద్యుత్ కోతలు జిల్లా వాసులకు నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడు సరఫరా ఉంటుందో, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
చిన్నపాటి వర్షం కురిస్తే రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతీ ఏడాది మే, జూన్ నెలలో ప్రీ మాన్‌సూన్ ఇన్‌స్పెక్షన్ పేరిట పనులు చేపడుతుండగా ఇటీవలే వారంలో ప్రతీ శుక్రవారం ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు నిర్వహణ పనులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారి మాటలకు, క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతున్న తీరుకు పొంతనలేదనే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి గత మూడు నెలలుగా జనం పడుతున్న అవస్థలే తార్కాణాలు.