తుపాను బాధితులను ఆదుకోవడంలోనూ అధికార పార్టీ నేతలు పక్షపాతం చూపిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు విడుదల చేసిన సాయం పంపిణీలోనూ బు(వ)రద రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి విలయానికి విలవిల్లాడిపోతున్న బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలోనూ మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. బాధితుల కోసం విడుదల చేసిన సరకులనూ తమకు అనుకూలమైన వారికే పంపిణీ చేస్తూ విమర్శలకు తావిస్తున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో హుదూద్ తుపాను ప్రళయం సృష్టిం చింది. దాని ధాటికి తీర ప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లగా.. చాలా వరకు ప్రజలు గూడు కోల్పోయి.. రెక్కలు తెగిన పక్షుల్లా మారారు. జిల్లాలో విజయనగరం డివిజన్‌లో తుపాను కారణంగా నష్టపోయినవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారికి తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసరాలు సరఫరా చేశారు. వాటిని క్షేత్ర స్థాయిలో పంపిణీ చేయటంలో అధికార పార్టీ నాయకులు బు(వ)రద రాజకీయానికి పాల్పడ్డారు.
భారీగా వచ్చిన సరకులు
తుపాను తక్షణ సాయం కింద జిల్లాకు 2,01,984 ఆహార పొట్లాలు, 10 లక్షల 12 వేల 680 మంచి నీటి ప్యాకెట్లు, 2,01,612 పాల ప్యాకెట్లు, 507.65 టన్నుల బియ్యం, 75.05 కిలో లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో సరకులు జిల్లాకు వచ్చినా పూర్తిస్థాయిలో బాధితులకు అందలేదన్నది ప్రధాన వాదన. వచ్చిన సరకులన్నీ అధికార పార్టీకి చెందిన నేతల చేతుల్లో పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వారు తమ వెంట తిరిగిన నాయకులు చే తుల మీదుగా వీటిని పంపిణీ చేయటం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. వాస్తవానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు అందించాల్సి ఉండగా..
మిగిలిన రాజకీయ పార్టీల గుర్తు, మద్దతుతో గెలిచినవారికి ఈ అవకాశం కల్పించలేదు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలే వాటిని పంచిపెట్టారు. ఉదాహరణకు పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పోరాం, కొత్తూరు, కిలుగుపేట, మద్దూరు గ్రామాల్లో ఇప్పటివరకు కనీసం మంచినీటి ప్యాకెట్ కూడా పంపిణీ చేయలేదంటూ ఆ ప్రాంత వాసి రాసుపల్లి ఎర్రమ్మ.. తుపాను బాధిత ప్రాంతాలవారిని పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయింది. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో గెలిచిన భోగాపురం మండలం రెడ్డికంచేరులోనూ పరిస్థితి ఇదే తరహాలో ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో చంటి పిల్లలకు పాలందక, వృద్ధులకు టీ కూడా కాచి ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ గెలిచిన స్థానాల్లోనూ...
విజయనగరం పట్టణంలోని తమ పార్టీకి దక్కని కౌన్సిల్ స్థానాల్లోనూ టీడీపీ నాయకులే తక్షణ సాయాన్ని పంచిపెట్టడం గమనార్హం. అందులోనూ తమకు ఓట్లు వేసినవారికే పంపిణీ చేసి మిగిలిన సరకులను నాయకుల ఇళ్లలో వినియోగించుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సైతం ఆ పార్టీ నాయకులు, కౌన్సిలర్లపై అసంతృప్తి వ్య క్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాకు మంచి నీటి ప్యాకెట్లతో వచ్చిన కంటైనర్‌ను గాజులరేగ వద్ద నిలిపి అధికార పార్టీ నాయకులు వారి ఇళ్లకు, బంధువుల ఇళ్లకు పంపిణీ చేసుకున్నారన్న పుకార్లు పట్టణంలో షికార్లు చేస్తున్నాయి. దీంతో అనేకమంది బాధితులు ఇప్పటికీ ఇబ్బందుల నడుమే కాలం వెళ్లదీస్తున్నారు.
మండిపడుతున్న బాధితులు
తుపాను కారణంగా సర్వం కోల్పోయినవారికి తక్షణ సాయం అందించటంలో ప్రజాప్రతినిధులు రాజకీయ చేయగా.. అధికార యంత్రాంగం తమకేమీపట్టనట్టు వ్యవహరించటంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి రాజకీయాలను ముడిపెట్టడమంత దుర్మార్గం మరొకటి లేదని మండిపడుతున్నారు. తుపాను బీభత్సం సృష్టించి 12 రోజులు గడుస్తున్నా సాయం అందకపోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడటం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
పచ్చపాతం
Published Wed, Oct 22 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM
Advertisement
Advertisement