పెను గండం | Mortal danger | Sakshi
Sakshi News home page

పెను గండం

Published Sun, Oct 12 2014 12:05 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

పెను గండం - Sakshi

పెను గండం

  • 81 కేంద్రాలకు 30,395 మంది తరలింపు
  •  ఇంకా తరలించాల్సింది 59,197 మందిని
  •  పెనుగాలులకు నేలకొరిగిన చెట్లు
  •  ఎగసిపడుతున్న సముద్రపు అలలు
  •  కెరటాల ధాటికి హార్బర్‌లో కూలిన గోడ
  •  జిల్లాకు మరో ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
  •  జాతీయ రహదారిపై రాకపోకలు బంద్
  •  నిలిచిపోయిన రవాణా వ్యవస్థ
  • హుదూద్ గుప్పెట్లో విశాఖ విలవిల్లాడుతోంది. పెను తుఫాన్ ప్రభావంతో  ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న కడలి కెరటాలు చెలియలి కట్టదాటి తీరం వెంబడి ఉన్న కట్టడాల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ముందుకు దూసుకువచ్చిన సముద్రంతో బీచ్ అల్లకల్లోలమైంది. సాగర భీకర గర్జనకు మత్స్యకార గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. బలమైన గాలులు వీస్తూ భయకంపితులను చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రత హెచ్చడంతో పలుచోట్ల  కరెంటు స్తంభాలుపడిపోయాయి. విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది.  హుదూద్‌ను ఎదుర్కొనేందుకు  ప్రభుత్వ యంత్రాంగం అన్ని  ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా హైవేలో దాదాపు వాహనాల రాకపోకలను నిషేధించారు. రైలు, బస్సు, విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం అనుక్షణం జిల్లా అంతటిని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆదివారం ఉదయం గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం సమీపంలో తీరం దాటే వేళ పెనుతుఫాన్ మరింత ఉధృత రూపం దాల్చే ముప్పు ఉండడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని  భయాందోళనలతో ఉన్నారు. ఈ పెనుగండం దాటేలా చూడాలని గంగమ్మను వేడుకుంటున్నారు. గరిష్ట స్థాయిలో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  
     
    విశాఖ రూరల్: పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ హుదూద్ విశాఖపైకి దూసుకువస్తోంది. అత్యంత శక్తివంతంగా ‘అల’జడి రేపుతూ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉప్పెనను మోసుకొస్తోంది. ముప్పుకు ముందస్తు సంకేతంగా శనివారం పెనుగాల వర్షంతో అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోడానికి త్రివిధ దళాలతో పాటు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది. పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పరిశ్రమల్లో రాత్రి విధులను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. రవాణా వ్యవస్థను నిలిపివేసింది. తుపాను హెచ్చరికలతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు, పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
     
    పోటెత్తిన సముద్రం

    తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. కెరటాల ధాటికి ఫిషింగ్ హార్బర్‌లో గోడ నేలకూలింది. జిల్లాలో చోలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రధానంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రం పోటెత్తుతోంది. ఇక్కడ సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. సముద్రం పోటు మీద ఉండడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గ స్తీ నిర్వహిస్తున్నారు.
     
    బీచ్ రోడ్డు మూసివేత

    పర్యాటకులను పోలీసులు బీచ్‌లోకి అనుమతించడం లేదు. శనివారం ఉదయం నుంచే సందర్శకులను సముద్ర తీరం నుంచి వెనక్కు పంపించారు. శనివారం సాయంత్రం నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి తీర ప్రాంత రోడ్డులో రాకపోకలను పోలీసులు నిషేధించారు. సముద్ర తీవ్రతను చూసేందుకు భారీగా సందర్శకులు బీచ్‌కు వచ్చినప్పటికీ పోలీసులు వారిని అనుమతించలేదు.
     
    నేలకొరిగిన చెట్లు

    శుక్రవారం రాత్రి నుంచి వీచిన గాలుల ధాటికి జిల్లాలో అనేక చోట్లు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి.
     
    విశాఖకు మరిన్ని బలగాలు

    హుదూద్ తుపాను విశాఖ పరిసర ప్రాంతాల నుంచి తీరం దాటనుండడంతో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి భారీగా రక్షణ దళాలు విశాఖకు చేరుకున్నాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రెండు ఆర్మీ బృందాలు అచ్యుతాపురంలో ఒక పాలిటెక్నిల్ కళాశాలలో మకాం వేశాయి. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తీర, తుపాను ప్రభావ మండలాలకు చేరుకున్నాయి.

    పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి, అనకాపల్లి, కశింకోట, మునగపాక, కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట, రావికమతం, కోటవురట్ల, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట మండలాల్లో ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

    వీటికి అధనంగా గజియాబాద్ నుంచి మరో 3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం విశాఖపైనే అధికంగా ఉంటుందని నిపుణలు అంచనాల మేరకు ఒరిస్సాలో ఉన్న మరో 3 బృందాలు విశాఖకు వస్తున్నారు. మొత్తంగా 12 బృందాలను జిల్లాలో అన్ని మండలాలోను సిద్ధంగా ఉంచుతున్నారు. వీటితో పాటు 30 నేవీ టీమ్‌లు కూడా మండలాలకు చేరుకున్నాయి.
     
    మండలాలకు బోట్లు

    ముంపు ప్రభావిత మండలాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, నేవీ బోట్లను తరలించారు. పాయకరావుపేట మండలంలో గజపతినగరం, పెంటకోట గ్రామాలకు ఒక్కో బోటు, నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, పెదతీనార్లకు, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపేట, రేవుపోలవరం గ్రామాలకు, అనకాపల్లి, రాంబిల్లి మండలం దిమిలి, నారాయణపురం, మునగపాక మండలం చూచుకొండ, చోడవరం మండలం పి.ఎస్.పేట, యలమంచిలి, కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామాలకు ఒక్కో బోటను సిద్ధం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు మరో 10 బోట్లు పంపించారు.
     
    నిలిచిపోయిన రవాణా వ్యవస్థ

    తుపాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. అతి భారీ వర్షాలు, పెనుగాలులు హెచ్చరికలతో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బస్సు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.
     
    జాతీయ రహదారి బంద్

    అతిభారీ వర్ష సూచనలతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు శనివారం సాయంత్రం 7 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అత్యవసర వాహనాలు, అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు.
     
    పునరావాస కేంద్రాలకు తరలింపు

    తీర ప్రాంత, తుపాను ప్రభావిత మండలాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్బన్‌లో 26, రూరల్‌లో 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల్లో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో పోలీసులు వారి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారు సైతం తిరిగి కొంత మంది వెనక్కు వచ్చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. శనివారం రాత్రికి 40 వేల మందిని తరలించారు. ప్రతి పునరావాస కేంద్రానికి డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. వంటలు చేసి కేంద్రాల్లో ప్రజలకు అందజే స్తున్నారు. సింహాచలం దేవస్థానం వారు 5 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల వద్ద బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లను సిద్ధంగా ఉంచారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement