Sea waves
-
విశాఖలో అలజడిగా మారిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్‌ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
అలల ఒడి నుంచి విద్యుత్!
సాక్షి, అమరావతి: సముద్ర అలల నుంచి విద్యుత్ పుట్టించవచ్చా.. సముద్ర కెరటాలతో వెలుగులు పంచవచ్చా.. ఆటుపోట్ల నుంచి శక్తిని ఉత్పత్తి చేయవచ్చా.. అనే అలోచనలతో శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు విజయవంతమై ఆచరణలోకి వస్తున్నాయి. ప్రపంచానికి భవిష్యత్‌లో కరెంటు కష్టాలు ఉండవనే ఆశలు కల్పిస్తున్నాయి. సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సవాళ్లు, గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో గ్రిడ్లు చిన్నవిగా, అస్థిరంగానూ ఉంటాయి. అయినప్పటికీ సాంకేతికంగా.. ఆర్థిక పరంగా కష్టం, ఖర్చుతో కూడుకున్న ఓషన్ థర్మల్ ఎనర్జీ, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు ప్రస్తుతం 31 దేశాల్లో విస్తరిస్తున్నాయి. మెరైన్ టెక్నాలజీల నుంచి విద్యుత్ ఉత్పత్తి రెండేళ్ల క్రితంతో పోలిస్తే 33 శాతం పెరిగింది. మన రాష్ట్రంలోనూ అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనపై అధ్యయనం జరిగిందంటే.. ఈ సాంకేతికత ఎంతగా విశ్వవ్యాప్తమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐరోపాలో ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర శక్తి సామర్థ్యంలో 98 శాతం వాటా దక్షిణ కొరియా, ఫ్రాన్స్, కెనడా దేశాలదే. పెట్రోలియం, పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండటంతో అనేక దేశాలు సముద్రం, ఉష్ణ, హైడ్రోజన్, ఆఫ్ షోర్ విండ్, సోలార్ వంటి టెక్నాలజీలలో పెట్టుబడి పెడుతున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ విద్యుత్ ఆగ్నేయాసియాలో అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను నిపుణులు పరిశీలించారు. అక్క డి తీర ప్రాంతాలకు టైడల్ శక్తిని ఉత్పత్తి చేసే సా మర్థ్యం ఉందని గుర్తించారు. భారత్, పసిఫిక్ మ హాసముద్రంలోని మారిటైమ్ ఆగ్నేయాసియా అ ని పిలిచే ద్వీపాలు, సముద్ర సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. పునరుత్పాదక శక్తి సాంకేతికతలను అక్కడ నివసిస్తున్న 660 మిలియన్లకు పైగా ప్రజలకు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వాటిలో భాగంగా ఓషన్ థర్మల్ ఎనర్జీ, లవణ సాంకేతికతలు, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐరెనా) చెబుతున్న దాని ప్రకారం.. సముద్రాలకు పునరుత్పాదక శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ. సముద్ర విద్యుత్ చిన్న ద్వీపం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన విద్యుత్ అందించగలదని, సముద్రపు నీటి డీశాలినేషన్ ద్వారా తాగునీటి సరఫరాను పెంచుతుందని ‘ఇన్నోవేషన్ ఔట్లుక్–ఓషన్ ఎనర్జీ టెక్నాలజీస్’ నివేదిక నిర్ధారించింది. దీనివల్ల అదనంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. స్థానికుల జీవనోపాధి మెరుగుపడుతుంది. సామాజిక–ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు సవాళ్లను అధిగమించి, సముద్ర శక్తిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అధ్యయనం రాష్ట్రంలోనూ సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు పడ్డాయి. విశాఖ–కాకినాడ మధ్య తీరంలో 100 కేవీ అలల విద్యుత్ సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (నెడ్కాప్) ఆధ్వర్యంలో అలల విద్యుత్‌పై ఓ అధ్యయనానికి శ్రీకారం జరిగింది. అలల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తాన్నీ జెన్కో కొనుగోలు చేసే అవకాశాలపైనా చర్చ జరిగింది. ఇందుకోసం 12 తీర ప్రాంతాల్లో కూడా అలల విద్యుత్ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ప్రస్తుత తరుణంలో ఈ ప్రయత్నం అత్యంత ఖర్చుతోనూ, సాంకేతికంగా కష్టంగానూ కూడుకున్న వ్యవహారం కావడంతో మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకూ వేచి ఉండటం మంచిదని భావించి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం లేదు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా మన రాష్ట్రంలోనూ అలల నుంచి కరెంట్ పుట్టే అవకాశాలు ఉన్నాయని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!
సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్‌షోర్) డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు. కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్) నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. మన పాపాలే... శాపాలు అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్‌ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్) అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. ఉప్పాడ తరహాలో కోత తప్పదు కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టు కోసం మిలియన్ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్‌జెడ్‌లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. – డాక్టర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం -
బీ అలర్ట్.. కళ్లు మూసి తెరిచేలోగా కొట్టుకుపోయారు
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కొందరు సముద్రాలు, నదుల వద్ద ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రదేశాల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోనే చెబుతోంది. ఐపీఎస్ అధికారిణి షిఖా గోయెల్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోలో కొందరు సముద్రం ఒడ్డున అలలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద కెరటం వచ్చి అక్కడున్న వారిని సముద్రంలోకి లాకెళ్లింది. అప్పుడు వారిని ఎవరూ కాపాడలేకపోయారు. కాగా, ఈ వీడియోకు షిఖా గోయెల్.. ‘‘జాగ్రత్తగా ఉండటం కంటే ధైర్యంగా తప్పు చేయడం మంచిది . గొప్ప పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్త మంచిది. ముఖ్యంగా ఇప్పుడు, తీవ్రమైన వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ ఘటన ఒమాన్ దేశంలో చోటుచేసుకుంది. సలాలహ్ హల్ ముగుసెల్ బీచ్‌లో 8 మంది భారతీయులు.. కెరటాల్లో కొట్టుకుపోగా.. ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అయితే, వారంతా సెఫ్టీ ఫెన్నింగ్ దాటిన కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. Its better to err on the side of daring than the side of caution ...... A little caution is better than a great regret Please be cautious especially now, in view of severe rainfall alert pic.twitter.com/Lo6ga6o0t4— Shikha Goel, IPS (@Shikhagoel_IPS) July 12, 2022 -
అమ్మ తపనే ఆయువై..
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర కెరటాలకు కొట్టుకుపోయిన బాలిక మృత్యువును జయించింది. ఒడిశాలోని రాయగడకు చెందిన ఓ కుటుంబం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు వచ్చింది. ఆ కుటుంబంలోని తొమ్మిదేళ్ల బాలిక అలేఖ్య సముద్రంలోకి దిగి కేరింతలు కొడుతుండగా కెరటాలకు కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు గమనించి మునిగిపోయిన బాలికను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే బాలిక నీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. నోటి వెంట నురగలు వచ్చాయి. దీంతో బాలికను చూసి ఆమె తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. ఇంతలో స్థానిక యువకులు బాలికకు ప్రథమ చికిత్స చేశారు. కడుపు, ఛాతీ మీద గట్టిగా రుద్దినా చిన్నారిలో కదలిక రాలేదు. బాలిక తల్లి గట్టిగా హత్తుకున్న క్రమంలో ఒక్కసారిగా స్పృహ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వెంటనే చికిత్స నిమిత్తం బాలికను కేజీహెచ్‌కు తరలించారు. తమ కంటిపాపను కాపాడిన స్థానికులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
సముద్ర అలలతో విద్యుదుత్పత్తి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ఉన్న విశాల సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐవోటీ)తో ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం (ప్రీ ఫీజుబిలిటీ స్టడీ) కూడా పూర్తి చేశారు. ఈ మేరకు ఎన్‌ఐవోటీతో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయేతర, పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ఒప్పందం చేసుకుంది. మరో 10 రోజుల్లో ఈ సంస్థతో మరోసారి చర్చించిన అనంతరం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా సదరు ప్రాజెక్టును చేపట్టవచ్చా? లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాత ముందడుగు పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఎక్కడ, ఎంత సామర్థ్యంతో ఏర్పాటు చేయవచ్చనే నిర్ణయం కూడా తీసుకుంటామని నెడ్‌క్యాప్ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అధ్యయనం పూర్తి: ఇప్పటికే సముద్ర అలలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఇజ్రాయెల్‌లో ఉన్నాయి. దేశంలో కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ప్రారంభించారు. రాష్ట్రంలో తీరం వెంబడి ఏయే ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న విషయంపై ఎన్ఐవోటీ ప్రాథమిక అధ్యయనాన్ని పూర్తి చేసింది. తీరంలో 25 మీటర్ల లోతు ఉండడంతో పాటు అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఎన్ఐవోటీ గుర్తించింది. సముద్రంలో వచ్చే భారీ అలల ధాటితో టర్బైన్లను తిరిగేలా చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ఉత్పత్తికి అనేక పద్ధతులు అమల్లో ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఆస్కిలేటింగ్ వాటర్ కాలమ్ (ఓడబ్ల్యూసీ) పద్ధతిని అమలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12 ప్రాంతాల్లో సముద్ర అలల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని స్పష్టం చేసింది. పాత సోనాపూర్, మేఘవరం, నారాయణ గజపతి రాజాపురం, విశాఖపట్నం, కుమారపురం, నీళ్లరేవు, కాలీపురం, ఎదురుమండి, కొత్తపట్నం, కావలి, కోట పులికాట్ ప్రాంతాల్లో సముద్ర అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తేలింది. అయితే, మరింత అధ్యయనం తర్వాతే ఏయే ప్రాంతాల్లో ఎంతమేర విద్యుత్ ఉత్పత్తి చేయచ్చన్న విషయం తేలనుంది. పూర్తిస్థాయి అధ్యయనం చేస్తాం సముద్ర అలల ఆధారంగా పనిచేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నాం. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతమేర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది, ఇందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశాలను పరిశీలిస్తాం. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇలా చేసే విద్యుత్ ఉత్పత్తికి ఇంధనం ఖర్చు ఉండదు. కాలుష్య సమస్య కూడా ఉండదు. – కేకే రాజు, చైర్మన్, నెడ్‌క్యాప్ -
ముందుకొస్తున్న ముప్పు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న ఉద్దానం ప్రజలకు కష్టాలు వీడటంలేదు. తిత్లీ తుఫాన్‌తో సర్వస్వం కోల్పోయిన ఉద్దానం రైతాంగాన్ని సముద్రం రూపంలో ప్రకృతి ఇంకా భయపెడుతునే ఉంది. మండలంలోని దున్నవూరు పంచాయతీ, గెడ్డవూరు ప్రాంతం, భేతాళపురంలలో సుమారు 100 మీటర్లను దాటించి సముద్రం ముందుకు వచ్చేస్తోంది. నాలుగైదు రోజులుగా తీరంలోని కొబ్బరి, జీడిమామిడి తోటల వరకు అలలు తాకుతున్నాయి. భేతాళపురం తీరంలో సముద్రం మరింత ముందుకు వచ్చి చెట్లను పెకలిస్తోంది. ఇదే గ్రామంలోని గుంటు గున్నయ్య అనే రైతుకు చెందిన కొబ్బరి, టేకు, తాటి చెట్లు కూలిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. అలల తాకిడికి తీరం కోతకుగురవుతోంది. ఆలయాలకు ముప్పు.. మత్స్యకారులు తీరంలో దేవతలు, గ్రామదేవత, అమ్మవార్లకు చిన్న, చిన్న ఆలయాలు నిర్మించుకుని వేటకు వెళ్లే ముందు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. సముద్రం ముందుకు రావడంతో ఈ ఆలయాల వరకు అలలు వస్తున్నాయి. ఇసుకలో నిర్మితమైన ఈ ఆలయాలు సముద్రుడు ఆగ్రహిస్తే కూలిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి తీరంలో విహారానికి ఉపయోగపడే ఇసుక దిబ్బలు సముద్రంలో కలిసిపోగా, అదే పరిస్థితి మందస మండలంలో కూడా నెలకొంది. భేతాళపురం, రట్టి, లక్ష్మీపురం, గంగువాడ తదితర ప్రాంతాల్లో అలల ప్రవాహానికి నీటి తాకిడి పెరుగుతుండడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తీర ప్రాంతవాసులు భయపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా చెట్లు కూలిపోతుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆందోళనగా ఉంది.. ఎన్నడూలేని విధంగా సముద్రం ముందుకు వస్తోంది. నీటి ప్రవాహానికి చెట్లు కూలిపోతున్నాయి. నా తోటలోని కొబ్బరి, టేకు చెట్లు సముద్రం ముందుకు రావడంతో పడిపోయాయి. తిత్లీ తుఫాన్ సమయంలో తీవ్ర నష్టం కలిగించింది. ఈ నష్టం నుంచి తేరుకోక ముందే సముద్రం భయపెడుతోంది. సుమారు నెల రోజులుగా అలల తాకిడి పెరుగుతోంది. సాధారణ స్థాయిని దాటింది. తోటలు, ఒడ్డు వరకు సముద్రం ఎప్పుడూ రాలేదు. నేటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. – గుంటు గున్నయ్య, బాధిత రైతు, భేతాళపురం, మందస -
కడలి కన్నెర్ర
సాక్షి, కొత్తపల్లి (తూర్పుగోదావరి) : నిండు గంభీరంగా ఉండే సముద్రుడే ఎగసిపడితే.. తట్టుకోవడం కష్టమే. అదే జరిగింది పొన్నాడ శివారు కోనపాపపేటలో. వారం రోజులుగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతం కడలికోతకు గురైంది. సుమారు 10 మత్స్యకారుల గృహాలు కూలిపోయాయి. అనేకమంది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. తీరంలోని రోడ్డు, చెట్లు సాగర గర్భంలో కలిశాయి. కోతకు గురైన ఈ గృహాలను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయడమే కాకుండా ఇంటి రుణాలను మంజూరు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
అలల ఫ్యాక్టరీతో విద్యుత్ ఉత్పత్తి...
సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం కొత్త కాకపోయినప్పటికీ... చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసేందుకు ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త యంత్రాన్ని తయారు చేశారు. ఇప్పటికే ఉన్న సముద్ర తరంగ జలశక్తి కేంద్రాల్లో వీటిని నేరుగా వాడుకోవచ్చు. లేదంటే విడిగానూ ఏర్పాటు చేసుకోవచ్చు. తాము తయారు చేసిన నమూనా యంత్రం ద్వారా 500 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఇది వంద ఇళ్లకు సరిపడా ఉంటుందని డేవిడ్ ఇన్‌గ్రామ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. డై ఎలక్ట్రిక్ ఎలాస్టోమీటర్ జనరేటర్ అని పిలిచే ఈ కొత్తయంత్రం రబ్బరుతో తయారైంది.గొట్టాల పైభాగంలో ఈ రబ్బరుతో తయారైన భాగాలను ఏర్పాటు చేస్తారు. గొట్టాల అడుగు భాగం నుంచి అలలు ప్రయాణిస్తాయి. ఫలితంగా ఈ రబ్బరు భాగంలో ఉండే గాలి పైకి ఎగుస్తుంది.. అల వెనక్కు వెళ్లగానే గాలి కూడా వెళ్లిపోతుంది. ఈ క్రమంలో రబ్బరు భాగాలపైన ఉండే జనరేటర్లు కూడా పనిచేస్తాయి. విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ప్రస్తుతం తాము 25 మీటర్ల వ్యాసమున్న ట్యాంక్‌లో నమూనా యంత్రాన్ని పరిశీలిస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. -
పెను గండం
81 కేంద్రాలకు 30,395 మంది తరలింపు ఇంకా తరలించాల్సింది 59,197 మందిని పెనుగాలులకు నేలకొరిగిన చెట్లు ఎగసిపడుతున్న సముద్రపు అలలు కెరటాల ధాటికి హార్బర్లో కూలిన గోడ జిల్లాకు మరో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ హుదూద్ గుప్పెట్లో విశాఖ విలవిల్లాడుతోంది. పెను తుఫాన్ ప్రభావంతో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న కడలి కెరటాలు చెలియలి కట్టదాటి తీరం వెంబడి ఉన్న కట్టడాల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ముందుకు దూసుకువచ్చిన సముద్రంతో బీచ్ అల్లకల్లోలమైంది. సాగర భీకర గర్జనకు మత్స్యకార గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. బలమైన గాలులు వీస్తూ భయకంపితులను చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రత హెచ్చడంతో పలుచోట్ల కరెంటు స్తంభాలుపడిపోయాయి. విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. హుదూద్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా హైవేలో దాదాపు వాహనాల రాకపోకలను నిషేధించారు. రైలు, బస్సు, విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం అనుక్షణం జిల్లా అంతటిని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆదివారం ఉదయం గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం సమీపంలో తీరం దాటే వేళ పెనుతుఫాన్ మరింత ఉధృత రూపం దాల్చే ముప్పు ఉండడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలతో ఉన్నారు. ఈ పెనుగండం దాటేలా చూడాలని గంగమ్మను వేడుకుంటున్నారు. గరిష్ట స్థాయిలో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ రూరల్: పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ హుదూద్ విశాఖపైకి దూసుకువస్తోంది. అత్యంత శక్తివంతంగా ‘అల’జడి రేపుతూ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉప్పెనను మోసుకొస్తోంది. ముప్పుకు ముందస్తు సంకేతంగా శనివారం పెనుగాల వర్షంతో అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోడానికి త్రివిధ దళాలతో పాటు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది. పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పరిశ్రమల్లో రాత్రి విధులను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. రవాణా వ్యవస్థను నిలిపివేసింది. తుపాను హెచ్చరికలతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు, పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోటెత్తిన సముద్రం తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. కెరటాల ధాటికి ఫిషింగ్ హార్బర్లో గోడ నేలకూలింది. జిల్లాలో చోలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రధానంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రం పోటెత్తుతోంది. ఇక్కడ సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. సముద్రం పోటు మీద ఉండడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గ స్తీ నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డు మూసివేత పర్యాటకులను పోలీసులు బీచ్‌లోకి అనుమతించడం లేదు. శనివారం ఉదయం నుంచే సందర్శకులను సముద్ర తీరం నుంచి వెనక్కు పంపించారు. శనివారం సాయంత్రం నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి తీర ప్రాంత రోడ్డులో రాకపోకలను పోలీసులు నిషేధించారు. సముద్ర తీవ్రతను చూసేందుకు భారీగా సందర్శకులు బీచ్‌కు వచ్చినప్పటికీ పోలీసులు వారిని అనుమతించలేదు. నేలకొరిగిన చెట్లు శుక్రవారం రాత్రి నుంచి వీచిన గాలుల ధాటికి జిల్లాలో అనేక చోట్లు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విశాఖకు మరిన్ని బలగాలు హుదూద్ తుపాను విశాఖ పరిసర ప్రాంతాల నుంచి తీరం దాటనుండడంతో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి భారీగా రక్షణ దళాలు విశాఖకు చేరుకున్నాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రెండు ఆర్మీ బృందాలు అచ్యుతాపురంలో ఒక పాలిటెక్నిల్ కళాశాలలో మకాం వేశాయి. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీర, తుపాను ప్రభావ మండలాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి, అనకాపల్లి, కశింకోట, మునగపాక, కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట, రావికమతం, కోటవురట్ల, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట మండలాల్లో ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అధనంగా గజియాబాద్ నుంచి మరో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం విశాఖపైనే అధికంగా ఉంటుందని నిపుణలు అంచనాల మేరకు ఒరిస్సాలో ఉన్న మరో 3 బృందాలు విశాఖకు వస్తున్నారు. మొత్తంగా 12 బృందాలను జిల్లాలో అన్ని మండలాలోను సిద్ధంగా ఉంచుతున్నారు. వీటితో పాటు 30 నేవీ టీమ్‌లు కూడా మండలాలకు చేరుకున్నాయి. మండలాలకు బోట్లు ముంపు ప్రభావిత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బోట్లను తరలించారు. పాయకరావుపేట మండలంలో గజపతినగరం, పెంటకోట గ్రామాలకు ఒక్కో బోటు, నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, పెదతీనార్లకు, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపేట, రేవుపోలవరం గ్రామాలకు, అనకాపల్లి, రాంబిల్లి మండలం దిమిలి, నారాయణపురం, మునగపాక మండలం చూచుకొండ, చోడవరం మండలం పి.ఎస్.పేట, యలమంచిలి, కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామాలకు ఒక్కో బోటను సిద్ధం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు మరో 10 బోట్లు పంపించారు. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ తుపాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. అతి భారీ వర్షాలు, పెనుగాలులు హెచ్చరికలతో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బస్సు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి బంద్ అతిభారీ వర్ష సూచనలతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు శనివారం సాయంత్రం 7 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అత్యవసర వాహనాలు, అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలింపు తీర ప్రాంత, తుపాను ప్రభావిత మండలాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్బన్‌లో 26, రూరల్‌లో 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల్లో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో పోలీసులు వారి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారు సైతం తిరిగి కొంత మంది వెనక్కు వచ్చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. శనివారం రాత్రికి 40 వేల మందిని తరలించారు. ప్రతి పునరావాస కేంద్రానికి డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జ్గా నియమించారు. వంటలు చేసి కేంద్రాల్లో ప్రజలకు అందజే స్తున్నారు. సింహాచలం దేవస్థానం వారు 5 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల వద్ద బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లను సిద్ధంగా ఉంచారు. -
కడలి కల్లోలం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: పెనుతుపాన్ పై-లీన్ ప్రభావంతో జిల్లాలోని తీరప్రాంతంలో అలజడి రేగింది. సముద్ర అలలు భీకరంగా ఎగిసిపడటంతో పలు చోట్ల తీరం కోతకు గురైంది. ఎట్టకేలకు తుపాన్ శనివారం రాత్రి తీరం దాటినా, జిల్లాపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అధికారులతో పాటు ప్రజలందరూ ఊపిరిపీల్చుకున్నారు. ముప్పు తప్పినా అధికారులు అనుక్షణం అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. పై-లీన్ ప్రభావం జిల్లాపైనా చూపే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద సూచిక ఎగురవేశారు. ఈ క్రమంలోనే శనివారం వేకువజాము నుంచే సముద్రం కల్లోలంగా మారింది. ఎప్పుడూలేని విధంగా అలలు ఎగిసిపడ్డాయి. కావలి, బోగోలు, ఇందుకూరుపేట మండలంలోని పలు చోట్ల సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. అలల తీవ్రతకు కొన్ని చోట్ల తీరం కోతకు గురైంది. బోగోలు మండలంలోని తాటిచెట్లపాళెం వద్ద అలల ఉధృతికి పది వలలు ఇసుకలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో తుపాన్ తీరం దాటే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు. తీరానికి దగ్గరగా వెనామీ రొయ్యలసాగు చేపట్టిన రైతులు పలువురు హడావుడిగా రొయ్యలు పట్టేశారు. సాయత్రం 6.25 గంటల సమయంలో తుపాన్ శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిందని సమాచారం రావడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు. అయినా తుపాన్ ప్రభావం మరికొద్ది గంటలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. 21 మండలాల్లో నియమితులైన 23 మంది ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లోని డిపోల్లో ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్ శ్రీకాంత్ పై-లీన్ తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలోని అధికారులందరినీ ఆదేశించామని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. శనివారం రాత్రి ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రత్యేకాధికారులంతా వారికి కేటాయించిన ప్రాంతాల్లో బస చేస్తున్నారన్నారు. గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ అధికారుల అప్రమత్తం నెల్లూరు(దర్గామిట్ట): తుపాన్ నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత విద్యుత్‌శాఖ అధికారులను ఎస్ఈ నందకుమార్ అప్రమత్తం చేశారు. కొందరికి రెవెన్యూ అధికారులకు సహకారం అందించే బాధ్యతలు అప్పగించారు.