అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం! | Coastal Area In East Godavari: The Sea Is Coming Forward By Human Mistakes | Sakshi
Sakshi News home page

అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!

Published Fri, Oct 7 2022 11:23 AM | Last Updated on Fri, Oct 7 2022 2:47 PM

Coastal Area In East Godavari: The Sea Is Coming Forward By Human Mistakes - Sakshi

తరిగిపోతున్న తీరం: ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప వద్ద తీరానికి భారీ కోత (ఫైల్‌)

సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్‌ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్‌షోర్‌) డ్రిల్లింగ్‌ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు.


కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి

ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్‌ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. 


నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్‌ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్‌)


నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట 

సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. 

జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది.

వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. 
 
మన పాపాలే... శాపాలు 
అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. 

కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. 

చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు

కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్‌ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. 

సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. 

వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్‌)

అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. 

ఉప్పాడ తరహాలో కోత తప్పదు  
కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు కోసం మిలియన్‌ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్‌జెడ్‌లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. 
– డాక్టర్‌ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్‌కేబీఆర్‌ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement