waves effect
-
మయన్మార్‌లో పడక మునక..
బ్యాంకాక్: అండమాన్ సముద్రంలో ఆదివారం మయన్మార్‌కు చెందిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. తీర ప్రాంత పట్టణం క్యావుక్కర్లో గత వారం రోజులుగా సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 75 మంది ప్రజలు దక్షిణ ప్రాంత టనింథర్యిలోని తీర పట్టణం మెయిక్కు పడవలో బయలుదేరారు. అలల తాకిడి తీవ్రతకు పావు గంటలోనే పడవ ప్రమాదానికి గురైంది. సమీప గ్రామాల వారు వచ్చి సుమారు 30 మందిని కాపాడారు. ఎనిమిది మృతదేహా లను వెలికి తీశారు. మరో 20 మంది జాడ తెలియాల్సి ఉంది. పడవ సామర్థ్యం 30 నుంచి 40 మంది మాత్రమే కాగా, అందుకు మించి జనం ఎక్కడం, వారి వెంట సామగ్రి ఉండటంతో బరువు పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు. క్యావుక్కర్ సమీపంలోని కియె గ్రామంపై బుధవారం ఆర్మీ వైమానిక దాడులు జరిపిందని, దీంతో వేలాదిగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని హక్కుల గ్రూపులు అంటున్నాయి. -
అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!
సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్‌షోర్) డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు. కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్) నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. మన పాపాలే... శాపాలు అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్‌ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్) అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. ఉప్పాడ తరహాలో కోత తప్పదు కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టు కోసం మిలియన్ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్‌జెడ్‌లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. – డాక్టర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం -
అలల కల్లోలం: ఉప్పొంగుతున్న కడలి
సఖినేటిపల్లి: ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో పోటెత్తుతున్న ఉప్పునీరు, ప్రస్తుత అల్పపీడన ప్రభావానికి అమావాస్య తోడవడంతో సముద్రుడు మరింత ఉగ్రుడవుతున్నాడు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శుక్రవారం సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని సుమారు 500 మీటర్ల మేర అంతర్వేదికర కొత్త వంతెనకు సమీపంలో రోడ్డును దాటి సరుగుడు తోటల్లోకి చేరాయి. సాగరసంగమానికి సమీపాన ఉన్న పల్లిపాలెంలో ఇళ్ల వద్దకు కూడా ఉప్పునీరు పోటెత్తింది. అంతర్వేదికర గ్రామంలో ఉప్పునీరు పోటెత్తిన ప్రాంతాలను, పల్లిపాలెంలో ముంపునకు గురైన నివాస గృహాలను తహసీల్దార్ రామ కుమారి పరిశీలించారు. ముంపు నీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె వెంట ఆర్ఐ బి.మనోజ్, వీఆర్వో బొల్లాప్రగడ సీతారామం, గ్రామస్తులు ఉన్నారు. పర్ర ప్రాంతానికి పోటెత్తిన ఉప్పునీరు ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానాం సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం సముద్రపు అలలు బీచ్ రోడ్డు పల్లపు ప్రాంతంలోకి భారీగా చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బీచ్‌రోడ్డు వద్ద కట్టు కాలువ వంతెన సమీపంలో ఎస్.యానాంలోని రవ్వ చమురు సంస్థ ఆన్‌షోర్, ఆఫ్షోర్లకు పైపులైన్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పల్లంగా ఉండటం వల్ల అక్కడే సముద్రపు అలలు ఎగసి పడి నీరు కట్టు కాలువను దాటుకుని పర్ర ప్రాంతానికి ఎగబాకాయి. దీంతో పైప్‌లైన్ ఉన్న ప్రాంతంలో గాడిలా ఏర్పడి కాలువలా తయారయ్యింది. ఒక దశలో పైపులైన్ లీకయ్యిందంటూ వదంతులు వ్యాపించడంతో రవ్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రపు అలలు వస్తున్న ప్రాంతాన్ని రవ్వ యాజమాన్య సిబ్బంది పరిశీలించి, సముద్రపు పోటు అధికంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యాహ్న సమయం వరకూ సముద్రపు నీరు భారీగా పర్రలోకి చేరడంతో డ్రెయిన్ల ద్వారా ఉప్పనీరు పంట పొలాలకు చేరుతోందని స్థానికులు, రైతులు ఆందోళన చెందారు. తహసీల్దారు కె.పద్మావతి, ఆర్ఐ ఎన్.ప్రసూన, వీఆర్ఓ రాములు బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అమావాస్య, అల్పపీడన ప్రభావంతో ఆటు పోట్లకు సముద్రం అల్లకల్లోలంగా మారిందని తేల్చారు. అంతర్వేదికరలో కొత్తవంతెన వద్ద రోడ్డును దాటుకుని సరుగుడు తోటల్లోకి చొచ్చుకు వస్తున్న ఉప్పునీరు నేలకొరిగిన భారీ వృక్షాలు.. కోతకు గురైన తీరం.. అల్లవరం: ఓడలరేవు తీరం వద్ద రక్షణగా ఉన్న కరకట్టలను, సరుగుడు తోటలను దాటుకుంటూ సముద్ర అలలు పల్లపు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వృక్షాలు సైతం కెరటాల తాకిడికి నేలకొరిగాయి. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన అలల తాకిడి శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. దీని ప్రభావంతో తీరం కోతకు గురైంది. తీరానికి ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులు సముద్రపు నీటితో నిండిపోయాయి. ఓడలరేవు ఆ‹ఫ్‌షోర్ టెరి్మనల్ ప్రహరీ, ఓడలరేవు తీరానికి పర్యాటకంగా పేరు తెచ్చిపెట్టిన సముద్ర రిసార్ట్సు గోడలను కెరటాలు తాకాయి. అమావాస్య ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చిందని, దీని ప్రభావం మరో మూడు, నాలుగు రోజులు ఉంటుందని అధికారులు అంటున్నారు. -
సంద్రమంత విషాదం
సాక్షి, పరవాడ : ఆ సంబరం చూసి చూసి సముద్రుడికి ఈర్శ్య కలిగిందేమో వారిని తనలో కలిపేసుకున్నాడు.. వారి వినోదంతో విధికి కన్నుకుట్టిందేమో కన్నెర్ర జేసింది. ఆ కుటుంబాలకు ఆధారం వద్దనుకున్నాడేమో తన దగ్గరికి తీసుకుపోయాడు. కన్నీటికే కన్నీరు వచ్చే విషాదం.. పగవాడికి కూడా రాకూడని కష్టం.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం.. ఆ గ్రామానికి పెను విషాదం. పరవాడ మండలం ముత్యలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో రాకాసి అలలకు ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇంటికి చేదోడుగా ఉంటాడని ఆశ పడిన ఆ కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు. వెన్నెలపాలెంలో నాలుగు నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న ఆశలు ఆరిపోయాయి. పరవాడ పోలీసుల కథనం మేరకు.. వెన్నెలపాలేనికి చెందిన ముగ్గురు యువకులు సముద్ర అలలకు బలికావడం.. మరొకరు గల్లంతు అవ్వడంతో జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన పైలా మహేష్(28), మాసవరపు నరేష్(27), సిరపరపు రామకృష్ణ(28) సముద్రంలో మునిగి మృత్యు ఒడికి చేరుకోగా.. లాలం నరసింగరావు(27) గల్లంతయ్యాడు. పరవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’పేరిట ఆదివారం ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిపాడి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలో వెన్నెలపాలేనికి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణ, నరసింగరావు సముద్ర స్నానానికి దిగతా.. ఓ రాకాసి అల వీరిని సముద్రంలోకి లాగేసింది. దీంతో మహేష్, నరేష్, రామకృష్ణలు తీవ్ర అస్వస్తతకు గురై మరణించగా నరసింగరావు సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్రావు అనకాపల్లిలోని మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను సీఐ స్వామినాయుడు, ఎస్ఐ వెంకటరావును అడిగి తెలుసుకున్నారు. దేవుడా మేం ఏ పాపం చేశాం... సముద్రంలో మునిగి మృతి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణతో పాటు గల్లంతైన నరసింగరావులు ఆయా కుటుంబాల్లో ఒక్కరే మగ సంతానం. మహేష్‌కు మూడేళ్ల కిందట వివాహం జరగ్గా భార్య గౌతమి, రెండేళ్ల పాప రిషిత ఉన్నారు. తండ్రి కలాసీగా పనిచేస్తున్నా మహేష్ సంపాదనే ఆధారం. నరేష్ అవివాహితుడు కాగా తండ్రి రాజు డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో కాలు విరిగిపోయి ఇంటి వద్ద ఉండే పరిస్థితి. కుటుంబ భారం మీద పడడంతో హిందుజా కంపెనీలో పనికి కుదిరిన నరేష్ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. ఇక రామకృష్ణ కుటుంబానిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి ఉన్న ఎకరంలో సేద్యం చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత రామకృష్ణ జన్మించాడు. గల్లంతైన నరసింగరావు ఏకైక సంతానం. చిన్ననాటి స్నేహితులైన నలుగురిలో ముగ్గురు ఒకే ప్రమాదంలో మరణించడం.. ఒకరు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాలల్లో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రులతో పాటు బంధవులు, గ్రామస్తులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
తీర గ్రామాల్లో ‘అల’జడి
సముద్రవేట సాగించే తీర గ్రామాలకు రక్షణ లేకుండా పోయింది. గతంలో కెరటాల ఉధృతి అంచెలంచెలుగా పెరుగుతూ కనిపించేది. ఆ స్థాయిని గుర్తించి మత్స్యకారులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేవారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. నిమిషాల్లో కెరటాల తీవ్రత మారిపోవడం, తీరం కోతకు గురికావడం, చెట్లు విరిగిపోవడం, పడవలు గల్లంతవడం జరిగిపోతుంది. వేట సామగ్రి భద్రపరుచుకోవడానికి కూడా సమయం ఇవ్వడంలేదు. వారంలో రెండు దఫాలు తీరం కోతకు గురయ్యింది. దీంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. నిద్రలో ఉన్నప్పుడు కెరటాలు ఎగిసిపడితే తమకు రక్షణ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. అలాగని తరతరాలుగా జీవించిన ఇళ్లను విడిచి బతకలేని పరిస్థితి. అచ్యుతాపురం (యలమంచిలి): విశాఖకు–కాకినాడకు మధ్య వెయ్యి పడవలలో ఆరు వేలమంది మత్స్యకారులు వేటాడే పెద్ద గ్రామం పూడిమడక. పూడిమడక జనాభా 16 వేలు. ఈ తీరం వేటకు అనుకూలంగా ఉండటంతో çపరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల మత్స్యకారులు ఇక్కడ నుంచే వేటాడతారు. పూడిమడక మత్స్యకారుల బంధువులు వేరే ప్రాంతాల నుంచి సీజన్లో ఇక్కడికి వచ్చి వేట సాగిస్తారు. ఇప్పుడు ఆ వేట కష్టాలమయమైంది. తీరం వద్ద నివాసం ప్రా ణాపాయంగా మారింది. జాలరిపాలెం కొండ నుంచి మెరైన్ పోలీస్‌స్టేషన్ వరకూ రెండు కిలోమీటర్ల పరిధిలో రక్షణ గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. తీరం వెంబడి 600 కుటుంబాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. మరికొన్ని కుటుంబాలకు సురక్షిత ప్రాతంలో ఇళ్లు నిర్మించి.. ఖాళీ చేయించి తీరం నుంచి రెండు వందల అడుగుల దూరంలో రక్షణగోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నారు. జెట్టీ లేకపోవడంతో పడవలకు నష్టం ఖరీదైన చేపల్ని వేటాడడానికి 2 వందల కిలోమీటర్లకు మించి దూరం వేటకి వెళ్తున్నారు. ఇందుకోసం పెద్దబోట్లు, ఇంజన్లను వినియోగిస్తున్నారు. పది లక్షలతో వేటసామగ్రి తయారుచేసుకుంటున్నారు. జెట్టీ లేకపోవడంతో తీరం వద్ద ఇసుకతిన్నలపై ఉంచేస్తున్నారు. కెరటాల తీవ్రత పెరిగినప్పుడు తక్షణమే పడవల్ని సురక్షిత ప్రాంతానికి జరుపుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడకపోతే పడవలు ఢీకొని దెబ్బతింటున్నాయి. ఒక్కొక్క పడవని జరపాలంటే 12 మంది భుజం పట్టి ఈడ్చాల్సి వస్తుంది. వేటకు వెళ్లేటప్పడు, వేట ముగిసిన తరువాత పడవల్ని భుజంపట్టి లాగుతారు. చేపలు పడినా పడకపోయినా ఈ మోత తప్పడంలేదు. గతంలో సీజన్‌ను బట్టి కెరటాలు ఎక్కడికి వస్తాయో అంచనా ఉండేది. తుఫానుకి కాస్త కెరటాలు ఉధృతిగా వస్తాయని భావించేవారు. ఇప్పుడు క్షణంలో పరిస్థితి మారుతుంది. దీంతో రాత్రులు కంటిమీద కునుకు ఉండటంలేదు. జట్టీ నిర్మిస్తే కెరటాల తీవ్రత పెరిగినా జట్టీలో లంగరు వేసిన పడవలు సురక్షితంగా ఉంటాయి. వేటసామగ్రి భద్రంగా ఉంటుంది. మోత భారం పూర్తిగా పోతుంది. ఇద్దరు మత్స్యకారులు లంగరు విదిలించి పడవను తీసుకొని వేటకి వెళ్లగలరు. మోతకు భయపడి పలువురు వేటకు దూరమవుతున్నారు. రక్షణగోడ, జట్టీ నిర్మాణం చేపడితే మత్స్యకారులకు వృత్తి లాభదాయమవుతుంది. రక్షణ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. -
విద్యార్థి ఉసురు తీసిన అలలు
ధర్మవరం అర్బన్ : సముద్రపు అలలు ఓ విద్యార్థి ఉసురు తీశాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన ప్రసాద్, ఇందిరమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్ (19) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. ఈ నెల 25న తన స్నేహితులతో కలసి అక్కడి బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి రాజశేఖర్ చిక్కుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం ధర్మవరం తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్ బాలిరెడ్డి, నాయకులు బోయ శ్రీనివాసులు, సుబ్రమణ్యం, వాసు తదితరులు పరామర్శించారు.