
ఎనిమిది మంది మృతి, 20 మంది గల్లంతు
బ్యాంకాక్: అండమాన్ సముద్రంలో ఆదివారం మయన్మార్‌కు చెందిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. తీర ప్రాంత పట్టణం క్యావుక్‌కర్‌లో గత వారం రోజులుగా సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 75 మంది ప్రజలు దక్షిణ ప్రాంత టనింథర్యిలోని తీర పట్టణం మెయిక్‌కు పడవలో బయలుదేరారు.
అలల తాకిడి తీవ్రతకు పావు గంటలోనే పడవ ప్రమాదానికి గురైంది. సమీప గ్రామాల వారు వచ్చి సుమారు 30 మందిని కాపాడారు. ఎనిమిది మృతదేహా లను వెలికి తీశారు. మరో 20 మంది జాడ తెలియాల్సి ఉంది. పడవ సామర్థ్యం 30 నుంచి 40 మంది మాత్రమే కాగా, అందుకు మించి జనం ఎక్కడం, వారి వెంట సామగ్రి ఉండటంతో బరువు పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు. క్యావుక్‌కర్ సమీపంలోని కియె గ్రామంపై బుధవారం ఆర్మీ వైమానిక దాడులు జరిపిందని, దీంతో వేలాదిగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని హక్కుల గ్రూపులు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment