
మెజారిటీ మార్కుకు అతి సమీపంలో...
‘ట్రంప్’ భయంతో అధికార పార్టీకే పట్టంకట్టిన కెనడా ప్రజలు
ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ట్రంప్ మాదిరిగా కెనడా ఫస్ట్ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది.
కెనడా ఆక్రమణ ట్రంప్ తరంకాదు: మార్క్ కార్నీ
లిబరల్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.
అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ
కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.
సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులు
కెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్ దలీవాల్(లిబరల్) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింత్(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.