Andaman coast
-
మయన్మార్‌లో పడక మునక..
బ్యాంకాక్: అండమాన్ సముద్రంలో ఆదివారం మయన్మార్‌కు చెందిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. తీర ప్రాంత పట్టణం క్యావుక్కర్లో గత వారం రోజులుగా సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ పట్టణం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 75 మంది ప్రజలు దక్షిణ ప్రాంత టనింథర్యిలోని తీర పట్టణం మెయిక్కు పడవలో బయలుదేరారు. అలల తాకిడి తీవ్రతకు పావు గంటలోనే పడవ ప్రమాదానికి గురైంది. సమీప గ్రామాల వారు వచ్చి సుమారు 30 మందిని కాపాడారు. ఎనిమిది మృతదేహా లను వెలికి తీశారు. మరో 20 మంది జాడ తెలియాల్సి ఉంది. పడవ సామర్థ్యం 30 నుంచి 40 మంది మాత్రమే కాగా, అందుకు మించి జనం ఎక్కడం, వారి వెంట సామగ్రి ఉండటంతో బరువు పెరిగి ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు. క్యావుక్కర్ సమీపంలోని కియె గ్రామంపై బుధవారం ఆర్మీ వైమానిక దాడులు జరిపిందని, దీంతో వేలాదిగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని హక్కుల గ్రూపులు అంటున్నాయి. -
మే 19కల్లా అండమాన్‌కు రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మే19కల్లా దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం(మే13) తెలిపింది. నిజానికి దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు మే 22న చేరుకోవాల్సి ఉంది.అయితే రెండు రోజుల ముందే రుతుపవనాలు అక్కడికి చేరుకోనున్నాయని తెలిపింది. కేరళకు రుతుపవనాలు జూన్1న రానున్నట్లు వెల్లడించింది. కేరళ నుంచి ముందుకు కదలి దేశవ్యాప్తంగా జులై 15వ తేదీ కల్లా రుతుపవనాలు వ్యాపించనున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల వల్ల ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ఐఎండీ మే చివరి వారంలో ఇవ్వనుంది. -
ఓఎన్జీసీతో టోటల్ఎనర్జీస్ జట్టు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) ట్విటర్లో వెల్లడించింది. ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. -
అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
మంచివాళ్లే... కానీ మీద ఉమ్మేస్తారు!
అండమాన్ ప్రజలు అబద్ధం చెప్పరు, మోసం చేయరు. మన వస్తువులను ఎక్కడైనా మర్చిపోయినా కూడా వాటిని తీసుకోరు, తమది కాని వస్తువు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ స్థానికులు అంటే బ్రిటిష్ కాలంలో అండమాన్ జైలు నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగుల కుటుంబాలే. అలా స్థిరపడిన వారిలో బెంగాలీలు, తమిళులు, తెలుగు వాళ్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటారు. పాన్ దో జార్వాన్ అనే ఆటవిక తెగల వాళ్లు వర్షం వస్తే బయటకు రారు. పర్యాటకుల కారణంగా వీళ్లకు పాన్ అలవాటైంది. వెళ్లిన వారందరినీ ‘పాన్ దో’ అని అడుగుతారు. హిందీలో వీళ్లకు వచ్చిన పదం ఇదొక్కటే. వీళ్లను ఫొటో తీస్తే ఒప్పుకోరు. వాహనంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఫొటో తీసినా సరే అంతవేగంతోనూ పరుగెత్తుకు వచ్చేసి వాహనం ఎదురుగా నిలబడతారు. ఫొటో తీసిన వాళ్ల ముఖాన కోపంగా ఉమ్మేస్తారు. గోనె దుస్తులు సెల్యూలార్ జైల్ దగ్గరకు వెళ్తే మనకు తెలియ కుండానే భావోద్వేగాలకు లోనవుతాం. జాతీయోద్యమంలో పాల్గొన్న మన జాతీయ నాయకులను బంధించిన జైలు గదుల్లో తిరుగుతుంటే ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదలుతాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులు జైల్లో గోనెసంచులతో కుట్టిన దుస్తులను ధరించారని తెలిసినప్పుడు మనసు పిండేసినట్లవుతుంది. లేజర్ షో బ్యాక్‌గ్రౌండ్ ఆడియోలో జైలు అధికారి సావర్కర్ సెల్‌కు రావడం, గద్దించి ప్రశ్నించడం, సావర్కర్ వంటి వీరులు సమాధానం చెప్పడం ఉంటుంది. ఇక్కడి పోర్ట్ హాల్లో జాతీయపోరాట యోధులను ఉరితీసేవాళ్లు. విచారణ కాలంలో కూడా ఇక్కడే జైల్లో ఉంచేవారు. చూడాల్సిందే అండమాన్ తీరంలో ముత్యాలు వలిచిన చిప్పలు, పగడపు అవశేషాలు, శంఖువులు ఉంటాయి. వాటిని చూడాల్సిందే తప్ప మనం తెచ్చుకోవడానికి అనుమతించరు. ముత్యాలు, పగడాలు తక్కువ ధరలో వస్తాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పన్నులు ఉండవు. చాలా వస్తువులు చవగ్గా దొరుకుతాయి, ముఖ్యంగా లిక్కర్ సగం ధరకే వస్తుంది. -
అండమాన్‌కు ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం/మంగళగిరి: నైరుతి రుతు పవనాలు నేడో, రేపో అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి దాదాపు పది రోజుల ముందు అంటే మే 20వ తేదీ నాటికి అండమాన్‌ను తాకుతాయి. కానీ, ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే ఇవి అండమాన్‌లోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ శుక్రవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో రాయలసీమలో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. అక్కడ సాధారణం కంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది. వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. వడదెబ్బ బారినపడి శుక్రవారం విశాఖ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. చోడవరంలో భారీగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. బుచ్చయ్యపేట, దుంబ్రిగుడ, కొయ్యూరు, పాడేరు, అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఐదు రోజులూ ఎండలు మండుతాయ్ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు ఎండలు మండుతాయని గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ.. శనివారం ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 19న విజయనగరం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. 20న విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. 21న ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 22న తూర్పుగోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. -
అండమాన్ లో భూకంపం
అండమాన్: అండమాన్ తీరంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోనవ్వకూడదని సంబంధింత అధికారులు తెలిపారు. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.