పడవల్ని తాళ్లతో కట్టి రక్షించుకుంటున్న మత్స్యకారులు
సముద్రవేట సాగించే తీర గ్రామాలకు రక్షణ లేకుండా పోయింది. గతంలో కెరటాల ఉధృతి అంచెలంచెలుగా పెరుగుతూ కనిపించేది. ఆ స్థాయిని గుర్తించి మత్స్యకారులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేవారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. నిమిషాల్లో కెరటాల తీవ్రత మారిపోవడం, తీరం కోతకు గురికావడం, చెట్లు విరిగిపోవడం, పడవలు గల్లంతవడం జరిగిపోతుంది. వేట సామగ్రి భద్రపరుచుకోవడానికి కూడా సమయం ఇవ్వడంలేదు. వారంలో రెండు దఫాలు తీరం కోతకు గురయ్యింది. దీంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. నిద్రలో ఉన్నప్పుడు కెరటాలు ఎగిసిపడితే తమకు రక్షణ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. అలాగని తరతరాలుగా జీవించిన ఇళ్లను విడిచి బతకలేని పరిస్థితి.
అచ్యుతాపురం (యలమంచిలి): విశాఖకు–కాకినాడకు మధ్య వెయ్యి పడవలలో ఆరు వేలమంది మత్స్యకారులు వేటాడే పెద్ద గ్రామం పూడిమడక. పూడిమడక జనాభా 16 వేలు. ఈ తీరం వేటకు అనుకూలంగా ఉండటంతో çపరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల మత్స్యకారులు ఇక్కడ నుంచే వేటాడతారు. పూడిమడక మత్స్యకారుల బంధువులు వేరే ప్రాంతాల నుంచి సీజన్‌లో ఇక్కడికి వచ్చి వేట సాగిస్తారు. ఇప్పుడు ఆ వేట కష్టాలమయమైంది. తీరం వద్ద నివాసం ప్రా ణాపాయంగా మారింది. జాలరిపాలెం కొండ నుంచి మెరైన్ పోలీస్‌స్టేషన్ వరకూ రెండు కిలోమీటర్ల పరిధిలో రక్షణ గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. తీరం వెంబడి 600 కుటుంబాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. మరికొన్ని కుటుంబాలకు సురక్షిత ప్రాతంలో ఇళ్లు నిర్మించి.. ఖాళీ చేయించి తీరం నుంచి రెండు వందల అడుగుల దూరంలో రక్షణగోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
జెట్టీ లేకపోవడంతో పడవలకు నష్టం
ఖరీదైన చేపల్ని వేటాడడానికి 2 వందల కిలోమీటర్లకు మించి దూరం వేటకి వెళ్తున్నారు. ఇందుకోసం పెద్దబోట్లు, ఇంజన్లను వినియోగిస్తున్నారు. పది లక్షలతో వేటసామగ్రి తయారుచేసుకుంటున్నారు. జెట్టీ లేకపోవడంతో తీరం వద్ద ఇసుకతిన్నలపై ఉంచేస్తున్నారు. కెరటాల తీవ్రత పెరిగినప్పుడు తక్షణమే పడవల్ని సురక్షిత ప్రాంతానికి జరుపుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడకపోతే పడవలు ఢీకొని దెబ్బతింటున్నాయి. ఒక్కొక్క పడవని జరపాలంటే 12 మంది భుజం పట్టి ఈడ్చాల్సి వస్తుంది. వేటకు వెళ్లేటప్పడు, వేట ముగిసిన తరువాత పడవల్ని భుజంపట్టి లాగుతారు.
చేపలు పడినా పడకపోయినా ఈ మోత తప్పడంలేదు. గతంలో సీజన్‌ను బట్టి కెరటాలు ఎక్కడికి వస్తాయో అంచనా ఉండేది. తుఫానుకి కాస్త కెరటాలు ఉధృతిగా వస్తాయని భావించేవారు. ఇప్పుడు క్షణంలో పరిస్థితి మారుతుంది. దీంతో రాత్రులు కంటిమీద కునుకు ఉండటంలేదు. జట్టీ నిర్మిస్తే కెరటాల తీవ్రత పెరిగినా జట్టీలో లంగరు వేసిన పడవలు సురక్షితంగా ఉంటాయి. వేటసామగ్రి భద్రంగా ఉంటుంది. మోత భారం పూర్తిగా పోతుంది. ఇద్దరు మత్స్యకారులు లంగరు విదిలించి పడవను తీసుకొని వేటకి వెళ్లగలరు. మోతకు భయపడి పలువురు వేటకు దూరమవుతున్నారు. రక్షణగోడ, జట్టీ నిర్మాణం చేపడితే మత్స్యకారులకు వృత్తి లాభదాయమవుతుంది. రక్షణ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment