సముద్ర అలలతో విద్యుదుత్పత్తి! | Electricity generation with ocean waves Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సముద్ర అలలతో విద్యుదుత్పత్తి!

Published Sun, Oct 10 2021 3:34 AM | Last Updated on Sun, Oct 10 2021 8:40 AM

Electricity generation with ocean waves Andhra Pradesh - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ఉన్న విశాల సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా సముద్ర అలల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ)తో ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం (ప్రీ ఫీజుబిలిటీ స్టడీ) కూడా పూర్తి చేశారు. ఈ మేరకు ఎన్‌ఐవోటీతో ఆంధ్రప్రదేశ్‌ సంప్రదాయేతర, పునరుత్పాదక విద్యుత్‌ అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) ఒప్పందం చేసుకుంది. మరో 10 రోజుల్లో ఈ సంస్థతో మరోసారి చర్చించిన అనంతరం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా సదరు ప్రాజెక్టును చేపట్టవచ్చా? లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాత ముందడుగు పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఎక్కడ, ఎంత సామర్థ్యంతో ఏర్పాటు చేయవచ్చనే నిర్ణయం కూడా తీసుకుంటామని నెడ్‌క్యాప్‌ వర్గాలు తెలిపాయి. 

ప్రాథమిక అధ్యయనం పూర్తి: ఇప్పటికే సముద్ర అలలను ఉపయోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఇజ్రాయెల్‌లో ఉన్నాయి. దేశంలో కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ప్రారంభించారు. రాష్ట్రంలో తీరం వెంబడి ఏయే ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న విషయంపై ఎన్‌ఐవోటీ ప్రాథమిక అధ్యయనాన్ని పూర్తి చేసింది. తీరంలో 25 మీటర్ల లోతు ఉండడంతో పాటు అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఎన్‌ఐవోటీ గుర్తించింది. సముద్రంలో వచ్చే భారీ అలల ధాటితో టర్బైన్‌లను తిరిగేలా చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

ఈ విద్యుత్‌ ఉత్పత్తికి అనేక పద్ధతులు అమల్లో ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఆస్కిలేటింగ్‌ వాటర్‌ కాలమ్‌ (ఓడబ్ల్యూసీ) పద్ధతిని అమలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12 ప్రాంతాల్లో సముద్ర అలల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని స్పష్టం చేసింది. పాత సోనాపూర్, మేఘవరం, నారాయణ గజపతి రాజాపురం, విశాఖపట్నం, కుమారపురం, నీళ్లరేవు, కాలీపురం, ఎదురుమండి, కొత్తపట్నం, కావలి, కోట పులికాట్‌ ప్రాంతాల్లో సముద్ర అలల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని తేలింది. అయితే, మరింత అధ్యయనం తర్వాతే ఏయే ప్రాంతాల్లో ఎంతమేర విద్యుత్‌ ఉత్పత్తి చేయచ్చన్న విషయం తేలనుంది. 

పూర్తిస్థాయి అధ్యయనం చేస్తాం
సముద్ర అలల ఆధారంగా పనిచేసే విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నాం. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతమేర విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది, ఇందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశాలను పరిశీలిస్తాం. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇలా చేసే విద్యుత్‌ ఉత్పత్తికి ఇంధనం ఖర్చు ఉండదు. కాలుష్య సమస్య కూడా ఉండదు.
 – కేకే రాజు, చైర్మన్, నెడ్‌క్యాప్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement