సొంత పనుల కోసమే టూర్!: అంబటి
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లింది తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత మాత్రం కాదని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొత్త రాజధాని నిర్మాణానికి ఓ వైపు చందాలడుగుతున్నారు.. మరోవైపు హుద్‌హుద్ తుపానుకు విలవిల్లాడిన విశాఖపట్టణం అభివృద్ధికి డబ్బుల కొరత ఉందంటున్నారు.. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక విమానాల్లో ఖరీదైన సింగపూర్ యాత్ర చేయాల్సిన అవసరముందా, ఇది దుబారా కాక మరేమిటి?’ అని ఆయన నిలదీశారు. ‘సౌత్ ఆసియన్ స్టడీస్’ సంస్థ వార్షికోత్సవంలో ప్రసంగించడానికి వారి ఆహ్వానం మేరకు చంద్రబాబు వెళుతున్నట్లు చెబుతున్నారని, ఈ సంస్థకు స్థానికంగా కూడా అంత ప్రాచుర్యం లేదని అన్నారు. ఈ ఖర్చుకు బదులు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికిగాని, హుద్‌హుద్ సహాయక చర్యల కోసంగాని నిధులు వెచ్చించ వచ్చు కదా అని ఆయన నిలదీశారు.
చంద్రబాబుకు అక్కడే వ్యాపారాలు..
చంద్రబాబుకు, సింగపూర్‌కు అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో ఉందని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా జిల్లాల్లో తిరుగుతూ ఉంటే సింగపూర్‌లో చక్కర్లు కొట్టిన ఘనత చంద్రబాబుదని అంబటి అన్నారు. చంద్రబాబు వ్యాపారాలు చేసుకునేది, హోటళ్లు నిర్మించుకునేది సింగపూర్‌లోనే అని, ఇది తాను చెప్పేది కాదని, ‘తెహల్కా డాట్ కామ్’ వారే చెప్పారని అన్నారు. వైఎస్ కుమారుడైన జగన్ తన పత్రికను, వ్యాపారాలను ఏపీలోనే చేసుకుంటున్నారని, కానీ చంద్రబాబు కొడుకు, కోడలు, ఇతర వందిమాగధులు వ్యాపారాలు చేసేది సింగపూర్‌లోనే అని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే మంచిదనే చర్చ మేధావుల్లో జరుగుతోందని అన్నారు.
మనీల్యాండరింగ్‌కు కేంద్రంగా .....
చంద్రబాబు సింగపూర్‌లో ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా వేయాల్సిందిగా ‘రా’ సంస్థను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌తో పాటు, గతంలో సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు దావోస్‌కు కూడా వెళ్లే వారని, ఆయన బంధువులు, స్నేహితులు మనీల్యాండరింగ్, వ్యాపారాలకు సింగపూర్‌ను ఒక కేంద్రంగా పెట్టుకున్నారని అన్నారు.