సింగపూర్ పేరుతో మోసం చేయొద్దు
* చంద్రబాబుపై ధ్వజమెత్తిన అంబటి
* ఆనందంతో రైతులు రాజధానికి భూములిస్తున్నారనే డ్రామాలొద్దు
* రైతులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్‌ను చూపించి మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల తో మాట్లాడారు.
అక్కడి రైతుల మనసుల్లో ఏముందో తెలుసుకోకుండా వారంతా రాజధానికి భూములివ్వడానికి ఆనందోత్సాహాలతో ముందుకు వస్తున్నారని చంద్రబాబు ప్రయత్నించడం విచిత్రమన్నారు. కొన్ని పత్రికలు కూడా సీఎం ఆలోచనా విధానాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు. వాస్తవానికి ఆయా గ్రామాల రైతులు తమ భూములు ఏమైపోతాయోనన్న బాధ, నిసృ్పహలతో ఉన్నారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...
- ఎంపిక చేసుకున్న కొందరు అనుకూల రైతులను ఆ ప్రాంతం నుంచి చంద్రబాబు హైదరాబాద్‌కు రప్పించుకుని వారితో తాము అనుకూలమేనని చెప్పించుకోవడం సరికాదు. ఆయన తాబేదారులు, వందిమాగధులు కూడా ఈ విషయంలో బాబు భజనకే పూనుకున్నారు తప్ప అక్కడి వాస్తవాన్ని తెలియజేయడంలేదు.
- రైతుల్లో తమకు పూర్తి అనుకూలమైన వారేనని నిర్థారణ చేసుకున్న తరువాతనే శల్య పరీక్షలు నిర్వహించి మరీ తెచ్చారు. వ్యతిరేకంగా మాట్లాడతారని అనుమానం ఉన్నా అలాంటి వారిని బస్సుల్లో నుంచి మధ్యలోనే దించేశారు.
- ఎవరైతే అధికంగా భూములిస్తారో వారిని ఏకంగా పారిశ్రామిక వేత్తలను చేసేస్తానని చంద్రబాబు చెప్పడం, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో ప్రత్యక్షంగా అనుసంధానం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి డ్రామాలు చేసే కన్నా రైతుల మనసుల్లో ఏముందో తెలుసుకొని వ్యవహరిస్తే మంచిది.
- సింగపూర్‌ను చూపించి ఇక్కడ భూములను కాజేయాలని చూస్తున్నారు. అసలు సింగపూర్‌లో ఏముందని ప్రతిసారీ ఉదాహరిస్తున్నారు, అక్కడ రైతాంగం ఉందా? ఉండేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా!
- భూములిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందనీ ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకునే శక్తి తమకుందని బాబు చెప్పడం దారుణం. అసలు 70 శాతంమంది రైతుల సమ్మతి లేనిదే భూములు తీసుకోవడం సాధ్యం కాని పని.
- తుళ్లూరు ప్రాంతంలో రాజధాని కడుతున్నందుకు అక్కడి రైతులు బాబు ఫోటోకు దండ వేయాలని కొందరు చెప్పడం మంచిది కాదు.
- రైతులకు న్యాయం జరగాలని కోరుతున్న మా పార్టీపై అపవాదు వేయడం మాని, రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని వ్యవహరిస్తే మంచిది. భూములు ఇవ్వడానికి కొందరు పెద్ద రైతులు సిద్ధంగా ఉండొచ్చు. కానీ చిన్న, సన్న రైతులు వ్యతిరేకిస్తున్నారు.
- చంద్రబాబు రైతు ద్రోహి అనీ, ఏ వాగ్దానం చేసినా నెరవేర్చరనే అభిప్రాయం ఉంది. రుణమాఫీ వాగ్దానానికి మెలికలు పెట్టి ఇప్పటికి తీర్చకపోవడమే అందుకు ఉదాహరణ. రాజధాని ప్రాంతంలోని రైతుల, కూలీల, కౌలుదారులకు అన్యాయం జరక్కుండా వారి హక్కుల పరిరక్షణ కోసం మా పార్టీ కడకంటా పోరాడుతుంది.