రాజధాని ముసుగులో ‘రియల్’ దందా
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి ధ్వజం
రేపల్లె : రాజధాని ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పట్టణంలో మంగళవారం రాత్రి ఒక శుభ కార్యానికి హాజరైన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమి సేకరణకు మాత్రమే వ్యతిరేకమన్నారు. 3 వేల ఎకరాల్లో అన్ని హంగులతో రాజధానిని నిర్మించుకోవచ్చని తెలిపారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేందుకే ఏడాదికి మూడు పంటలు పండే బంగారు భూములను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.
ప్రపంచంలో ఎక్కడా జరగని కుంభకోణం రాజధాని ముసుగులో ఇక్కడజరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడిందంటూ సంక్షేమ పధకాలకు కత్తెర వేస్తున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపన పేరుతో రూ400 కోట్లు నీళ్ళప్రాయంగా ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఈ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోవటంతో మైలలో ఉన్న చంద్రబాబు కుప్పంలో మట్టి-నీరు ఎలా తీసుకువచ్చారన్నారు. మైలలో ఉండి మట్టి - నీరు తీసుకువచ్చి దేవునిపట్ల, ఆచారాలపట్ల అపచారం చేసిన చంద్రబాబు దేవుడికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.