విశాఖ అందాలను మింగిన హుదూద్
జూ పార్కులో విరిగిపడ్డ చెట్లు
వన్యప్రాణులకు ఆహారం అందించే దారులు బంద్
విశాఖపట్నం: విలయ తాండవం చేసిన హుదూద్ తుపాన్ విశాఖ నగరాన్ని ఇరవై ఏళ్ల వెనక్కు మళ్లించింది. విశాఖకు వన్నె తెచ్చిన పచ్చటి స్నేహితులు నేలకూలటంతో నగరం బోసిపోయింది. బెంగళూరు తరువాత ఆ స్థాయిలో విస్తరించిన పచ్చదనం నిర్జీవమైంది. దాదాపుగా చెట్లు అన్నీ కూలి పోయాయి. నగరం మధ్యలో అతిపెద్ద పార్కుగా అభివృద్ధి చేయాలని తీర్చిదిద్దుతున్న పాతజైలు స్థలంలో ఉన్న భారీ వృక్షాలు దెబ్బతిన్నాయి. ద్వారకానగర్ ప్రాంతంలో రహదారి విస్తరణ లోపోగా మిగిలిన కొద్దిపాటి చెట్లు నేలకూలాయి. విశాఖ నుంచి విజయనగరం దిశగా కొండలు బోసిపోయి కనిపిస్తున్నాయి.
రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో నూరేళ్ల పైబడిన వృక్షం కొమ్మలన్నీ నేలకొరిగి మొదలు మాత్రమే మిగిలింది.పర్యాటక ఆకర్షణగా నిలిచే పార్కులను పెను తుపాన్ మింగేసింది. గతంలో ఈస్ట్ పాయింట్ కాలనీ బీచ్ రోడ్డు నుంచి సముద్రం కనిపించేది. అనంతరం ఇక్కడ వుడా పార్కును అభివృద్ధి చేయడంతో సముద్రం కనిపించేది కాదు. ప్రచండ గాలులకు పార్కులోని చెట్లు కూకటి వేళ్లతో కూలిపోవడంతో రోడ్డు మీద నుంచి సముద్రం కనిపిస్తోంది. పార్కులే కాకుండా నగరంలో పచ్చని చెట్లు లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి.
మహావృక్షాలు నేలకొరిగాయి. సందర్శకులను ఆకర్శించే వుడా పార్కు, శివాజీపార్కు, లుంబిని పార్కులు హుదూద్ విధ్వంసానికి సాక్షాలుగా మిగిలాయి. పర్యాటక ప్రాంతాలు కంబాల కొండ, ఇందిరాగాంధీ జూ పార్కుల పరిస్థితి దయనీయంగా ఉంది. విరిగిపడ్డ చెట్లతో జూలో రోడ్లన్నీ మూసుకుపోవటంతో వన్యప్రాణులకు కనీసం ఆహారం అందించలేని పరిస్థితి నెలకొంది. చెట్లు విరిగిపడటంతో కనుజులు మృత్యువాత పడినట్లు గుర్తించారు. గతేడాది ఆధునికంగా నిర్మించిన జూ ప్రధాన ద్వారం ధ్వంసమైంది.
కైలాసగిరిపై ఒరిగిన వృక్షాలు
పెనుగాలుల ధాటికి బీచ్ రోడ్డులోని వుడా పార్కు అస్తవ్యస్థమైంది. పార్కు అవతల ఉన్న సముద్రం రోడ్డు మీద నుంచి కనిపిస్తోంది.అక్కడ స్కేటింగ్ మైదానం నాశనమైంది. పిల్లలు ఆడుకునే క్రీడా వస్తువులు కూలి పోయాయి. శివాజీ పార్కులో వాకింగ్ ట్రాక్‌లకు ఇరువైపుల అందంగా కనిపించే మొక్కలు నేలమట్టమయ్యాయి. లుంబిని పార్కులో చోట్లు ఒరిగిపోయాయి. పర్యాటకులను ఆకర్శించి నగరానికి వన్నె తెచ్చిన పార్కులు శిథిలమయ్యాయి. కైలాసగిరిపై చెట్లు ఒరిగిపోయి రాళ్లు పైకి తేలాయి. ఆకుపచ్చని కొండలా కనిపించే కైలాసగిరి రాళ్లతో దర్శనమిస్తోంది.
పచ్చదనం చచ్చిపోయింది!
Published Tue, Oct 14 2014 1:36 AM | Last Updated on Tue, May 29 2018 1:20 PM
Advertisement
Advertisement