పండుటాకుల పడిగాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుదూద్ తుపా ను బీభత్సం సృష్టించింది. వ్యవస్థలు కుప్పుకూలిపోయాయి. ఉపాధి రంగాలన్నీ దాదాపు మూ సుకుపోయాయి. కార్మికులకు ఉపాధిలేక, కూలీ లకు పనులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల గడవడం కష్టంగా తయారైంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకరిపై ఆధారపడి బతికే వారందరికీ కాసింత భరోసా ఇచ్చే పింఛను కాస్త ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జన్మభూమితో లింకు పెట్టి నిలిపేసింది. ఉపాధి లేక ఇంటి పెద్ద దిక్కు, పింఛను రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూటగడవక, కనీసం మం దులు కొనుక్కునేందుకు సొమ్ములేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఈ వయసులో తమకెందుకీ ఇబ్బందులని గగ్గోలు పెడుతున్నారు.
కొన్నాళ్లు పింఛన్ల సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. మరికొన్ని రోజులుజన్మభూమిలో పంపిణీ చేద్దామని మెలిక పెట్టింది. ఇంతలోనే అనర్హుల పేరుతో 35 వేల మంది పింఛన్లు తీసేసింది. మరో 26,500మందికి సంబంధించి ఆధార్ సీడింగ్ జరగలేదని గాలిలో ఉంచింది. దీంతో 2 లక్షల 17 వేల 500మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. జన్మభూమిలో పంపిణీ చేస్తామని ఆర్భాటం చేసింది. మొత్తానికి ఈ నెల 11వ తేదీ వరకు 64 వేల మందికి జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఇంతలో హుదూద్ తుపాను ముంచెత్తి జిల్లాను కకావికలం చేసింది. జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగతా 1,47,500 మందికి నేటికీ పింఛన్లు అందలేదు. ఇప్పుడు వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
జన్మభూమిలో నేతల చేతుల మీదుగా ఇచ్చి మెప్పు పొందాలని ప్రయత్నించి, చివరికీ తమను అవస్థలకు గురిచేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎప్పుడూ పంపిణీ చేసినట్టు ఐదు తేదీలోగా ఇచ్చేసి ఉంటే తుపాను కష్టకాలంలో కాసింత ఉపశమనం కలిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి నిర్వహించేదెప్పుడు, తమకు పింఛను ఇచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగితే తప్ప తమకు పింఛను వచ్చేటట్టు లేదని ఆందోళన చెందుతున్నారు. జాబితా నుంచి తొలగింపునకు గురైన పింఛనుదారులు, ఆధార్ సీడింగ్ లేదని గాలిలో పెట్టిన లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కక్షతో అన్యాయంగా తీసేసిన తాము అభ్యంతరాలు పెట్టుకున్నా ఇంతవరకు అతీగతి లేదని, వాటిని పరిశీలించి పరిష్కరించేదెప్పుడు? తమకు న్యాయం జరిగేదెప్పుడని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారి పరిస్థితీ అంతే. ఇప్పుడు ఆధార్ కేంద్రాలు తెరిచే అవకాశం లేదని, తమకు సీడింగ్ అయ్యేదెప్పుడని, అంతా పూర్తయి పింఛను వచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిర్వాకంతో తమ ఇబ్బందులొచ్చాయని వారు మండిపడుతున్నారు.