‘తూర్పు’పై కడలి కన్నెర్ర
సముద్రంలో కలసిన 50 ఇళ్లు, మరో 25 గృహాలు ధ్వంసం
సామర్లకోటలో చెట్టు మీదపడి ఒకరి మృతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: హుదూద్ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతం లోని మత్స్యకార గ్రామాలపై మాత్రం కడలి కన్నెర్ర చేసింది. తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్ సహా 16 మండలాల్లోని 78 గ్రామాల్లో ఈ తాకిడి కనిపించింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో శనివారం రాత్రి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటాలు కారణంగా దాదాపు 50 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిలో పక్కా ఇళ్లు, పూరిళ్లు కూడా ఉన్నాయి. 150 కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. మత్స్యకారుల చేపల షెడ్లు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి.
ఈ ఒక్క గ్రామంలో జరిగిన నష్టం రూ. కోటి పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. కాగా, ఉప్పాడ బీచ్‌రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చింది. ఆ గ్రామాల నుంచి సుమారు 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తొండంగి మండలంలో సముద్రం 30 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది. పాత చోడిపల్లిపేట, కోదాడ, ఎ.కొత్తపల్లి, పెరుమాళ్లపురం తదితర ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర తీరం కోతకు గురైంది. పలు చోట్ల భారీ వక్షాలు నేలకూలాయి. సామర్లకోట పట్టణంలో నేరేడు చెట్టు మీదపడి నేమాని వెంకట్రావు(60) మృతి చెందాడు.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి, అరటి పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. జిల్లా మొత్తమ్మీద 31,804 మందిని 67 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి వీస్తున్న బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో పజలు అవస్థలు పడాల్సి వచ్చింది. రైళ్లు, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ వైపు రోడ్లు బోసిపోయాయి. జిల్లా అంతటా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాకినాడ పోర్టులో మూడో రోజు ఆదివారం కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప, కలెక్టర్ నీతూ ప్రసాద్ కలెక్టరేట్ నుంచి జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు.