‘సుడి’ చుట్టేసింది!
పాలకొండ : రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వరి పంటపై పూర్తిగా ఆశలు వదులుకునేలా ప్రకృతి శాసించింది. కనీసం ఎకరమైనా పంట పండుతుందన్న ఆశ రైతుకు మిగల్లేదు. హుదూద్ తుపాను ప్రభావంతో సగం పంట నష్టపోతే..ఆ తరువాత విజృంభించిన సుడి దోమతో ఉన్నది పోరుుంది. దీంతో అన్నదాత నిర్వేదానికి గురయ్యూడు.
ఖరీఫ్ ప్రారంభం నుంచీ కష్టాలే..
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచీ రైతులు కష్టాలు కొనసాగుతూనే వచ్చాయి. కార్తెల సమయంలో వర్షాలు లేకపోవడంతో ఆగస్టులో ఉభాలు పూర్తి చేశారు. అనంతరం వర్షాలు అనుకూలించడంతో జిల్లా మొత్తం 1.97 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డారుు. ఆ తరువాత కూడా వరుణుడు కరుణించడంతో చేను ఏపుగా పెరగడంతో పంటపై రైతన్నలో ఆశలు మొలకెత్తారుు. ఈ ఏడాది ఘననీయమైన దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖాధికారులు సైతం అంచనాలు తయారు చేశారు. ఇలాంటి సమయంలో వచ్చిన హుదూద్ తుపాను రైతుల కలలపై నీళ్లు చల్లింది. దాదాపు 90 వేల హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతినగా ఉన్న పంటలోనే సగం పొల్లు గింజలుగా తయారయ్యాయి. ఈ పరిస్థితులో రైతులు కనీసం కుటుంబ పోషణకైనా ధాన్యం వస్తాయని ఆశించారు. కానీ వారి ఆశలపై సుడిదోమ దాడి చేసింది. గంటల వ్యవధిలో ఎకరాలకు ఎకరాలు పంట పొలం బూడిదరంగులో మారిపోతుంది. ఇప్పటికే ఎన్ను వదిలినవి కుళ్ల్లిపోగా, పొట్టదశలో ఉన్నవి కాల్చివేసిన చేనులా కనిపిస్తుంది. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. మరో వైపు పంట నష్టాలు అంచనాలో అధికారులు వ్యవహరించిన తీరు రైతులకు తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది.
గంటల వ్యవధిలో నాశనం అవుతుంది
సుడిదోమ వ్యాపించిన గంటల వ్యవధిలో ఆ ప్రాంతం మొత్తం వ్యాపిస్తుంది. ఉదయం చూసిన పంట పొలం పచ్చగా కనిపిస్తే సాయంత్రానికి బూడద రంగుగా మారిపోతుంది. దీనిపై ఎవరి నుంచి సూచనలు, సలహాలు లేవు. కేవలం మోనో క్రోటోపాస్ ఎకరాకు లీటర్ చొప్పున 20 ట్యాంక్‌ల నీటిలో కలిపి చల్లుతున్నాం. దీనితో తెగులు వ్యాపించే తీవ్రత తగ్గుతుంది.
- కండాపు ప్రసాదరావు, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు