శాంతి.. అశాంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్, సంతకవిటి, పాలకొండ:శ్రీకాకుళం వద్ద శాంతించిన నాగావళి.. సంతకవిటి, పాలకొండ తదితర మండలాల్లో మాత్రం ఇప్పటికీ ఉగ్రరూపంతోనే విరుచుకుపడుతోంది. వరద ఉద్ధృతికి కాలువలకు గండ్లు పడటంతో సుమారు 16 గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం ఉదయం నుంచి వరదతో పోటెత్తిన నాగావళి శ్రీకాకుళం, పట్టణంతోపాటు 11 మండలాల్లోని 107 తీరగ్రామాలను వణికించింది. సోమవారం రాత్రి శ్రీకాకుళం పాతబ్రిడ్జి వద్ద సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల స్థాయిలో ఉన్న వరద ప్రవాహం..
ఒకదశలో 2 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని.. శ్రీకాకుళం పట్టణానికి వరద ముప్పు ఉండవచ్చని అధికారులు సైతం ఆందోళన చెందిన పట్టణంలో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మంగళవారం ఉదయం నుంచి ప్రవాహం కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పాతబ్రిడ్జి వద్ద 1,32,400 క్యూసెక్కుల నీరు ఉంది. వరద ముప్పు తప్పడంతో పట్టణంతోపాటు పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎత్తివేశారు. అయితే నాగావ ళి వరద కారణంగా ఇప్పటికే శ్రీకాకుళం, పొందూరు, సంతకవిటి, పాలకొండ, ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సుమారు 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నారాయణపురం వద్ద ఉద్ధృతంగానే..
అయితే నారాయణపురం ఆనకట్ట పరిసర మండలాల్లో వరద ఇంకా ఉద్ధృతంగానే ఉంది. దీనివల్ల సంతకవిటి మండలంలో నారాయణపురం కాలువకు వాసుదేవపట్నం, కేఆర్‌పురం గ్రామాల వద్ద గండ్లు పడటంతో సుమారు 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం రాత్రి వాసుదేవపట్నం వద్ద కాలువకు గండి పడటంతో గోళ్ళవలస, చిన్నయ్యపేట, మందరాడ, కాకరాపల్లి, మేడమర్తి, హొంజరాం, బూరాడపేట తదితర గ్రామాలు జలమయమయ్యాయి. మొత్తం ఐదువేల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు కేఆర్‌పురం వద్ద గండి పడటంతో జావాం, కొత్తూరు, రామచంద్రపురం, రంగారాయపురం, పోతులుజగ్గుపేట, తమరాం, బూరాడపేట, తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాలకొండ మండలంలో అన్నవరం, అంపిలి గ్రామాలు వరద నీటితో సోమవారం రాత్రి జలమయమయ్యాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో డాబాలపైకి చేరుకొని కాలం గడిపారు.