పరిశ్రమకు హుదూద్ దెబ్బ !
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :హుదూద్ తుపాను ప్రభావం పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం చూపింది. జిల్లాలోని పరిశ్రమలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి హామీ లభించకపోవడంతో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 12న సంభవించిన తుపాను ధాటికి రణస్థలం, ఎచ్చెర్ల, పైడిభీమవరం, పలాస ప్రాంతాలకు చెందిన చిన్న, భారీ పరిశ్రమలు అతలాకుతలమైపోయాయి. ఆయా పరిశ్రమలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో నష్టాల దిశగా పయణిస్తున్నాయి. కొన్ని సంస్థలకు కేవలం విద్యుత్ దీపాల వరకే సరఫరా ఇస్తుండగా, చిన్న పరిశ్రమలకు పాక్షికంగా సరఫరా ఇవ్వడంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడింది. మరికొన్ని సంస్థలు జనరేటర్ల సహాయంతో నడుస్తున్నాయి. దీంతో వ్యాపారులంతా సమావేశమై జిల్లాలోని పరిశ్రమల శాఖ అధికారుల సహకారంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాయి. వచ్చేఏడాదితో ప్రారంభమయ్యే నూతన పారిశ్రామిక విధానంలోనైనా తుపాన్ల వంటి విపత్తుల సమయంలో పరిశ్రమల్ని గట్టెక్కించే విధంగా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమలు నడవకపోయినా జీతాలు, నిర్వహణ ఖర్చుల ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది.
ఇదీ కథ
జిల్లా పరిశ్రమల శాఖలో 6,156 చిన్న పరిశ్రమలు, 35 భారీ పరిశ్రమలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఆయా పరిశ్రమల్లో తుపాను కారణంగా బాయిలర్లు ధ్వంసం కావడం, షెడ్లు కూలిపోవడం, రేకులు ఎగిరిపోవడం, ఎలివేటర్ గొట్టాలు విరిగిపోవడం, గ్రీన్‌బెల్ట్ కనుమరుగైపోవడం జరిగింది. మరికొన్ని పరిశ్రమలు భారీ మరమ్మతులకు గురయ్యాయి. ఆయా సంస్థలకు ఎల్‌టీ కనెక్షన్లకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. హెచ్‌టీ లైన్లు ఎప్పటికి పునరుద్ధరణ జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తమకు వాటిల్లిన నష్టాలపై పారిశ్రామిక వేత్తలు గత నెల 18న పరిశ్రమల శాఖ అధికారులకు వివరించారు.
అప్పటివరకు తమకు విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రూ.85 కోట్లు నష్టం వాటిల్లినట్టు తేల్చారు. ఈ వివరాలతో 19న ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. జిల్లాలో అధికశాతం రైస్ మిల్లులే ఉన్నాయి. వర్షం, గాలుల కారణంగా మిల్లుల్లో నిల్వ చేసిన బియ్యం తడిచిపోవడంతో కనీసం రూ.3 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా. పలాస కేంద్రంగా జీడిపప్పు పరిశ్రమకు తుపాను గాయంతో మరో రూ.2 కోట్లు నష్టం వాటిల్లింది. జీడిపప్పుకు చెమ్మ వచ్చి రంగుమారి రెండో రకంగా తయారై ధర పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. ఫార్మా కంపెనీల్లో కూలింగ్ టవర్స్ పడిపోయి భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా కారణంగా ట్రైమెక్స్ సంస్థలో ఇప్పటి వరకు సుమారు రూ.35 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. నాగార్జున ఆగ్రికెమ్ సంస్థ(ఎన్‌ఏసీఎల్) తన విదేశీ ఖాతాదారుల్ని సంతృప్తి పరిచేందుకు నిత్యం రూ.11 లక్షల ఖర్చుతో డీజిల్ అయిల్‌తో నడిచే జనరేటర్‌ను ఉపయోగించుకుంటోంది.
ధీమా ఇవ్వని బీమా !
పరిశ్రమల్లో ఏటా బీమా రెన్యూవల్ చేయించుకున్నవారికి ధీమా ఉంటుంది. అయితే తుపానుకు సంబంధించి బీమా నిబంధనలు పరిశ్రమల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చోరీ, అగ్నిప్రమాదం సంఘటనలకు లభించే బీమా తుపానుకు లేదంటూ అధికారులు చెబుతుంటే..రెన్యూవల్స్ సమయంలో భారీ ప్రీమియం చెల్లించాల్సి ఉండగా వ్యాపారులు వెనకడుగు వేశారని సిబ్బంది చెబుతున్నారు. బీమా ఉన్న సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలు సవాలక్ష షరతులు విధిస్తాయని, మొత్తంగా చూస్తే కోతలు పోనూ 10 నుంచి 20 శాతం లోపే వచ్చే అవకాశం ఉంటుందని, అది కూడా నెలల తరబడి సమయం పడుతోందని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాల పరిశ్రమల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలంటున్నారు.
టాక్స్ మినహాయించాలి
20 రోజుల వరకూ విద్యుత్ సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో జనరేటర్ల వాడకం పెరగింది. ఫలితంగా లక్షలాది లీటర్ల డీజిల్ వాడుతున్నారు. ఈ మేరకు బంకుల్లో ఇంధనం కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి 22.5 శాతం పన్ను చెల్లిస్తున్నారు. కనీసం ఈ పన్ను చెల్లింపునైనా తమను విముక్తి చేయాలని వ్యాపారులు ప్రభుతాన్ని కోరుతున్నారు. అలాగే బకాయి పడిన విద్యుత్ బిల్లుల చెల్లింపునకు కనీసం ఆరునెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తాము ‘ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ’ (ఐపీసీ) దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.