ఐఏఎస్‌లు, మంత్రుల హంగామా | Cyclone relief work monitoring ias officers and Ministers Hungama | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌లు, మంత్రుల హంగామా

Published Wed, Oct 15 2014 1:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Cyclone relief work monitoring ias officers and Ministers Hungama

 శ్రీకాకుళం పాతబస్టాండ్: తుపాను సహాయ పనుల పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వం జిల్లాకు పంపిన సీనియర్ ఐఏఎస్ అధికారుల వల్ల అనవసర హడావుడితోపాటు పనులకు అంతరాయం కలుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  సహాయ, పునరావాస పనుల పర్యవేక్షణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాకు 11 మంది ఐఏఎస్, ఇతర సీనియర్ అధికారులు వచ్చారు. దీంతో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది వీరికి సహాయ పడటం, ప్రొటోకాల్ విధుల పేరుతో వీరి వెంట పర్యటిస్తున్నారు. ఒక్కో ఐఏఎస్ ఆధికారి వద్ద లైజనింగ్ అధికారిగా ఒక జిల్లా స్థాయి ఆధికారి వ్యవహరిస్తుండగా మరో ఇద్దరు కింది స్థాయి సిబ్బంది వారి సేవల్లోనే ఉంటున్నారు.  ఇలా 11 మంది అధికారుల వెంట 33 మంది వరకు వివిధ శాఖల సిబ్బంది ఉండాల్సి వస్తోంది.
 
 దీనికితోడు ఈ అధికారులు బస చేసిన హోటళ్లు, వసతిగృహాల వద్ద మరికొంతమంది రెవెన్యూ ఆధికారులు ప్రొటోకాల్ విధులు నిర్వహిస్తున్నారు, వీరంతా ఈ సమయంలో తుపాను సహాయ, పునరావస పనుల్లో నిమగ్నం కావల్సినవారే.. తమతమ కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్విహ స్తున్నవారే,, అటువంటి వారిని సీనియర్ అధికారుల వెంట పంపడంతో ఆయా మండలాల్లో తుపాను పనులపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. కాగా అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఈ కీలక సమయంలో ఉన్నతాధికారుల తనిఖీలు, తరచూ జరిగే సెట్ కాన్ఫరెన్సులు, సమీక్ష సమావేశాల వల్ల దిగువస్థాయి యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ విప్ పర్యటనలు, సమీక్షలు జరుపుతుండటంతో వీటితోనే సమయం సరిపోతోందని సిబ్బంది వాపోతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement