21కి చేరిన ‘హుదూద్’ మృతులు
నేలకూలిన ఇళ్లు 6,695..
1,798 పశువుల మృత్యువాత..
44 మండలాల్లో తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపానువల్ల మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారమే 21కి పెరిగింది. ఆదివారం సాయంత్రానికి ముగ్గురు మాత్రమే చనిపోయారని ప్రకటించిన ప్రభుత్వం.. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో మృతుల సంఖ్య 21కి చేరినట్లు పేర్కొంది. ఒక్క విశాఖ జిల్లాలోనే 15 మంది మృత్యువాత పడగా విజయనగరం జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చనిపోయారు. ప్రభుత్వ ప్రకటన మేరకు నష్టం వివరాలిలా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 6,695 ఇళ్లు కూలిపోయాయి 109 చోట్ల రైల్వే లైన్లు, రహదారులు దెబ్బతిన్నాయి. 5,727 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
విజయనగరం జిల్లాలో 19 చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ నాలుగు జిల్లాల్లో 181 బోట్లు గల్లంతయ్యాయి. 1,798 పశువులు చనిపోయాయి. 73 తాగునీటి పథకాలు పాడయ్యాయి. 44 మండలాల్లో తుపానువల్ల నష్టం వాటిల్లింది. 320 గ్రామాల్లోని 2,48,004 మందిపై తుపాను ప్రభావం పడింది. 223 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,35,262 మంది బాధితులను తరలించారు. 223 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 4,06,163 మందికి ఆహార పొట్లాలు అందించారు. 24 జాతీయ విపత్తు సహాయ దళాలు తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. నాలుగు ఆర్మీ, నేవీ దళాలు కూడా సేవల్లో ఉన్నాయి. 691 మంది ఈతగాళ్లు, 56 బోట్లు సహాయ కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉన్నాయి.
మృతుల వివరాలు..
శ్రీకాకుళం జిల్లా: గంటా యోగానందం (45).. సంతబొమ్మాళి మండలం గండపేట.
విజయనగరం జిల్లా.. 1.కర్రి రమేష్ (22) జామీ మండలం కొమరం, 2.సలగంశెట్టి సత్తిబాబు(32) విజయనగరం మండలం ద్వారపూడి, 3, యండాడ సీతప్పడు (68). 4. దమ్మడి సూరిబాబు (68) డెంకాడ మండలం బంటుపల్లి, 5.కర్రోతు బంగారమ్మ (65), భోగాపురం మండలం పోలిపల్లి.
విశాఖపట్నం జిల్లా.. 1.జి.పంచువతి (58), అనకాపల్లి మండలం కొండారం. 2. మంగారి ఎర్రయ్య (58), పద్మనాభం మండలం పాలవలస. 3.పి. నాగమనోజ్ (1), 4.రాములమ్మ (45). 5. సుబ్రమణ్యం (65), 6. బి. సింహాచలం (65), 7. నెల్లి దేవీ కుమారి (26), 8. కె. రామయ్య (57), 9. బి. రాములమ్మ (50), 10, నెల్లి సత్యనారాయణ (34), విశాఖ నగరం. 11. గోకుల అప్పారావు (52), 12. అడవి అప్పారావు(50), 13, గోరంట్ల ఎరకయ్య (62), 14, గుర్తు తెలియని వ్యక్తి, 15, పేరు గుర్తించని వ్యక్తి (58), విశాఖ రూరల్.