Titli Cyclone Destruction in Srikakulam District - Sakshi
Sakshi News home page

పెను విధ్వంసం

Published Fri, Oct 12 2018 3:53 AM | Last Updated on Fri, Oct 12 2018 11:09 AM

Toofan destruction in Srikakulam district  - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్‌ తుపానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో ఉద్ధానం వారేగాక శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు.

తుపాను కారణంగా చెట్లు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. తుపాను సృష్టించిన విధ్వంసానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూకటివేళ్లతో విరిగిపడ్డాయి. పూరిళ్లు పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. రైతులకు అపారనష్టం వాటిల్లింది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. వరి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు విజయనగరం జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. ఇక ఒడిశా రాష్ట్రంపైనా తిత్లీ విరుచుకుపడింది.

ప్రధానంగా గజపతి జిల్లాలో బీభత్సం సృష్టించింది. మొత్తంగా విలయ విధ్వంసం సృష్టించి, భీకర గాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ అతి తీవ్ర తుపాను గురువారం వేకువ జామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం తీవ్ర తుపానుగాను, ఆపై తుపానుగాను మారి గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమబెంగాల్‌ వైపు పయనిస్తోంది. గురువారం రాత్రి పది గంటల సమయానికి ఇది ఒడిశాలోని భవానీపట్నాకు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

చిగురుటాకులా వణికిన సిక్కోలు..
తిత్లీ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను కరుణించిన తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా దీని ధాటికి సిక్కోలు చిగురుటాకులా వణికిపోయింది. అర్థరాత్రి తర్వాత నుంచి గంటగంటకూ తిత్లీ తన ప్రతాపాన్ని చూపించింది. తీరాన్ని దాటే సమయానికి పలాస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, సోంపేట తదితర ప్రాంతాల్లో పెనుగాలుల ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఈ ప్రాంతాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది.

టెక్కలి డివిజన్‌లో అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పటిదాకా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 130 నుంచి 165 కిలోమీటర్ల వేగానికి చేరాయి. దీంతో శ్రీకాకుళం జిల్లావాసులు తీవ్ర భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుపాను తీరాన్ని దాటిన సమయంలో వజ్రపుకొత్తూరు మండల ప్రజలు గజగజ వణికిపోయారు. నాలుగేళ్లక్రితం ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా హుద్‌హుద్‌ వణికించగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తీవ్రంగా దెబ్బతీసింది.

ఉద్ధానంపై తీవ్ర ప్రభావం..
ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలో తీరం దాటడంతో ప్రధానంగా ఉద్ధానం ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. భీకర రీతిలో విరుచుకుపడిన పెనుగాలుల ప్రభావంతో కొబ్బరి చెట్లతోపాటు జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. టెక్కలి సమీపంలో కన్నెవలస వద్ద జాతీయ రహదారి పూర్తిగా వరదలో మునిగిపోవడంతో ఉద్ధానం ప్రాంతానికి జిల్లాతో సంబంధం తెగిపోయింది. సుమారు 12 గంటలపాటు కురిసిన వర్షాలకు జిల్లా అంతటా వరద ముంచెత్తింది.

గురువారం జిల్లాలో సగటున 77 మిమీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు మండలాల్లో వరి పంట నీటమునిగింది. సుమారు 1.44 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. అలాగే ఉద్ధానం సహా జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి. 737 హెకార్లలో అరటి, బొప్పాయి, జీడిమామిడి తదితర ఉద్యాన పంటలతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు ధ్వంసమైనట్టు అధికారులు అంచనా వేశారు. పంటలకు వాటిల్లిన నష్టం రూ.1,350 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

పక్కా ఇళ్లకూ తప్పని దెబ్బ...
తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఇళ్లకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 1,021 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. ఇందులో రెండు పక్కా ఇళ్లు పూర్తిగా ధ్వంసంకాగా, మరో ఆరిళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. పూరిళ్లు మాత్రం తుపాను దాటికి ఆగలేకపోయాయి. 409 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 254 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఎక్కువగా రేకుల ఇళ్లే. ఈదురుగాలులకు రేకులు ఎగిరిపోవడంతో వర్షానికి ఇళ్లల్లోని వస్తువులు, ఆహారధాన్యాలు పాడైపోయాయి. ఇలా ఇళ్లు నష్టపోయినవారిలో ఎక్కువమంది వంశధార ప్రాజెక్టు నిర్వాసితులే ఉన్నారు. ఈ మొత్తం నష్టం రూ.20 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమిక అంచనా.


మత్స్యకారులకు తీరని నష్టం...
తిత్లీ తుపాను ధాటికి మత్స్యకారులకు సంబంధించిన 12 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 445 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు మత్స్యకారులు వేటకు ఉపయోగించే 1,520 వలలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీనివల్ల జరిగిన నష్టం రూ.9.34 కోట్లు ఉంటుందని అంచనా.

ఇచ్ఛాపురంలో 24 సెం.మీల భారీ వర్షం..
తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 24, టెక్కలిలో 23, పలాసలో 20, మందసలో 13, సోంపేటలో 12, పాతపట్నంలో 10, కళింగపట్నంలో 9, రణస్థలంలో 5, పాలకొండలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. తుపాను తీరాన్ని దాటాక గాలుల ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టినా గురువారం మధ్యాహ్నం దాకా ఈదురుగాలులు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రికి గాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది.

మరోవైపు తిత్లీ తుపాను తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్‌ వైపు పయనిస్తుండడంతో ఉత్తరాంధ్రలో వానలు తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులకు జారీ చేసిన హెచ్చరికలను ఉపసంహరించింది.


ఏడుగురి మృతి...
తుపాను ప్రభావంతో విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాల కారణంగా గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. వర్షానికి నానిపోయిన ఇంటిస్లాబ్‌ కూలిపోయిన ప్రమాదంలో సరిబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన మూడడ్ల సూర్యారావు(46) చనిపోయారు. తనపై చెట్టు కూలిపోవడంతో వంగర మండలంలోని వోనె అగ్రహారానికి చెందిన తాడి అప్పలనర్సమ్మ(62) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

సంతబొమ్మాళి మండలంలో సున్నాపల్లి గ్రామానికి చెందిన బొంగు దుర్గారావు(50) కూడా చనిపోయినా కారణం ఏమిటనేదీ అధికారికంగా ప్రకటించలేదు. పొలంలో తన ఎద్దులను రక్షించడానికి వెళ్లిన సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిన అప్పలస్వామి(56) మృత్యువాత పడ్డారు. టెక్కలిలోని ఆండ్ర వీధిలో పూరిల్లు కూలిపోయి కొల్లి లక్ష్మమ్మ(70) అనే వృద్ధురాలు మృత్యువాత పడ్డారు.

అలాగే నందిగాం మండలం దేవీపురం గ్రామానికి చెందిన మున్నేన సంతోష్‌కుమార్‌(29), బోలుభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి కన్నయ్య(53) గొర్రెలను కాస్తూ మందస మండలంలోని సువర్ణపురం వద్దకు వెళ్లారు. వారిపై కొబ్బరిచెట్టు పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అలాగే తుపాను ధాటికి మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. తొమ్మిది ఎద్దులు, గేదెలు చనిపోగా, గొర్రెలు, మేకలు 80 వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే 500 కోళ్లు చనిపోయినట్లు సమాచారం.

9 లక్షలమందిపై ప్రత్యక్ష ప్రభావం!
ఊహించిన దానికన్నా ప్రచండమారుతంలా తిత్లీ తుపాను విరుచుకుపడటంతో ప్రత్యక్షంగా నష్టపోయిన బాధితుల సంఖ్య సుమారు 9 లక్షలమంది దాకా ఉంటుందని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. జిల్లాలోని 38 మండలాలపైనా తుపాను ప్రభావం కనిపించింది. 16 మండలాలపై తీవ్రంగా ఉంది. సుమారు 1,864 గ్రామాలతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు కూడా ఈ తుపాను ధాటితో నష్టాన్ని చవిచూశాయి. మొత్తం మీద తిత్లీ తుపాను వల్ల జిల్లాలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement